Published : 30 Apr 2021 00:20 IST

బురిడీ కొట్టిందిలే.. బుస్‌..బుస్‌.. పాము!

దొక చిట్టడవి. ఆ అడవిలో ఒక చెట్టుమీద కాకి, చిలుక, పావురం మూడు పక్షులూ స్నేహితుల్లా కలిసిమెలిసి హాయిగా జీవిస్తున్నాయి. ఆ పక్షులు వాటి పిల్లల కోసం గూళ్లు కట్టుకున్నాయి. ఈ పనిలో నేర్పరి అయిన కాకి, తోటి పక్షులైన చిలుక, పావురాలకు గూటి నిర్మాణంలో సాయం చేసింది. ‘నీ సాయం మరచి పోలేము మిత్రమా!’ అంటూ చిలుక, పావురం కాకికి కృతజ్ఞతలు చెప్పాయి.
అప్పుడు కాకి, ‘ఒకరికొకరు సాయం చేసుకుంటూ కలిసి జీవించడమే అందమైన జీవితం కదా!’ అంది నవ్వుతూ. తోటి పక్షులు కూడా ‘నిజమే కాకి బావా! బాగా చెప్పావు!’ అన్నాయి నవ్వుతూ. అప్పుడప్పుడే ఎదుగుతున్న వాటి పిల్లల ఆహార సంపాదన కోసం ఆ పక్షులు మూడూ కలిసి కట్టుగా బయటకు వెళ్లేవి. ఆహారాన్ని తెచ్చి వాటి పిల్లలకు పెట్టేవి. వాటి కిలకిలరావాలు విని పక్షులు ఎంతో సంతోషించేవి.

అయితే ఆ పక్షుల పిల్లలపై అక్కడే చెట్టుకు దగ్గరలో పుట్టలో ఉంటున్న పాము కన్ను పడింది. తల్లి పక్షులు ఆహారం కోసం బయటకు వెళ్లే సమయం చూసి, వాటి పిల్లలను తినాలని పాము వేచి చూడసాగింది. పాము విషయం కనిపెట్టిన పక్షులు మూడూ తమ పిల్లలను పాము బారి నుంచి కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాయి.
‘పోనీ ఈ చెట్టును వదిలి ఆ పుట్టకు దూరంగా మరో చోటుకు వెళ్లిపోతే బాగుంటుంది కదా’ చిలుక ఆందోళన చెందుతూ మిగతా రెండు పక్షులతో అంది.
‘నిజమే! చిలుక చెప్పినట్లు దూరంగా వెళ్లిపోదామా..కాకిబావా..?’ పావురం కూడా చిలుక మాటలను సమర్థిస్తూ కాకితో అంది.
‘సమస్యను దూరం చేసుకోవాలే కానీ, దానికి దూరంగా పారి పోకూడదు. అక్కడ కూడా ఇదే సమస్య ఎదురైతే ఏం చేస్తారు?’ కాకి వాటిని అడిగింది. అప్పుడు అక్కడి నుంచి కూడా దూరంగా పారిపోవడమే! ఇంకేం చేయలేం కదా’ అన్నాయి చిలుక, పావురం.
‘అదే తప్పు మిత్రులారా! రాత్రి తర్వాత పగలు ఉన్నట్లే ప్రతీ సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది. కంగారు పడకండి’ అంటూ తోటి పక్షులకు ధైర్యం చెప్పింది కాకి.
ఆ రోజు పక్షులు మూడూ ఆహారం కోసం బయటకు వెళ్లినట్లే వెళ్లి, పాము రాక కోసం దూరం నుంచి గమనించసాగాయి. తల్లి పక్షులు బయటకు వెళ్లడం చూసిన పాము ఇదే సమయం అనుకుంటూ జరజరా చెట్టు పైకి పాకింది. అలా వెళ్లిన పాముకు ఎదురుగా గద్ద కనిపించడంతో కంగారు పడిపోయింది. ప్రాణభయంతో సర్రున వెనక్కు తిరిగి వచ్చిన దారినే పాక్కుంటూ పుట్టలోకి వెళ్లి పోయింది. పాము వెళ్లిపోవడం తల్లి పక్షులు మూడూ గమనించి ‘పాము తిక్క భలేగా కుదిరింది’ అనుకున్నాయి.
మరుసటి రోజూ అదే జరిగింది. మళ్లీ చెట్టుమీద గద్ద కనిపించడంతో పాము ఉలిక్కిపడి భయం, భయంగా పాక్కుంటూ కిందకు దిగిపోయింది.
‘ఈ గద్ద చెట్టు మీదే ఉంటోంది. ఇక్కడ ఉంటే నా ప్రాణానికే ప్రమాదం’ అనుకుని పాము అక్కడి నుంచి దూరంగా పారిపోయింది. చక్కని ఉపాయంతో పాము బెడదను శాశ్వతంగా తప్పించిన కాకి తెలివిని మెచ్చుకుంటూ.. ‘అవును కాకి బావా! గద్ద బొమ్మను చెట్టు మీద ఉంచాలనే ఆలోచన నీకెలా కలిగింది’ కుతూహలం కొద్దీ చిలుక, పావురం కాకిని అడిగాయి. అందుకు కాకి ‘మనుషులు పంట పొలాల్లో మన బోటి పక్షులు రాకుండా దిష్టి బొమ్మను పెడతారు కదా. ఆ బొమ్మను చూసి మనం భయపడినట్లే పాము కూడా బెదురుతుందనిపించి పాముకు శత్రువైన గద్ద బొమ్మను చెట్టు మీద ఉంచాను. నేను అనుకున్నట్లుగానే నిజమైన గద్ద అనుకుని భయపడి పాము పారిపోయింది. నేను చెప్పాను కదా. ఆలోచించాలే కానీ పరిష్కారం లేని సమస్య ఎక్కడా ఉండదు’ అంది కాకి  నవ్వుతూ.

- కె.వి.లక్ష్మణరావు


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts