నమ్మకమైన పనివాడు

హేలాపురిలో ఉండే నందయ్య దగ్గర ఎంతో కాలం పనిచేశాడు వీరయ్య. ఇప్పుడు ముసలివాడయ్యాడని, అతన్ని విశ్రాంతి తీసుకోమన్నాడు నందయ్య.  అతని స్థానంలో మరొక పనివాడిని  నియమించుకోవాల్సి వచ్చింది. ఈ సంగతి తెలిసిన అతని బంధువు.. రాజయ్య

Published : 02 May 2021 01:29 IST

హేలాపురిలో ఉండే నందయ్య దగ్గర ఎంతో కాలం పనిచేశాడు వీరయ్య. ఇప్పుడు ముసలివాడయ్యాడని, అతన్ని విశ్రాంతి తీసుకోమన్నాడు నందయ్య.  అతని స్థానంలో మరొక పనివాడిని  నియమించుకోవాల్సి వచ్చింది. ఈ సంగతి తెలిసిన అతని బంధువు.. రాజయ్య అనే వ్యక్తిని నందయ్య దగ్గరకు పంపాడు. వెంటనే పనివాడి అవసరం ఉండడంతో నందయ్య మరో ఆలోచన లేకుండా రాజయ్యను పనిలోకి తీసుకున్నాడు.
ఇంట్లోనూ తోటలోనూ చేయాల్సిన పనులు వివరంగా చెప్పి నెలకు మూడువేల రూపాయల జీతానికి రాజయ్యను పనిలో పెట్టుకున్నాడు. నెల రోజులు గడిచాయి. ఎంతో నమ్మకంగా నందయ్య పురమాయించిన పనులన్నీ చక్కగా నిర్వర్తిస్తున్నాడు రాజయ్య. నెల చివరిలో నందయ్య చిన్న సంచి అతనికిచ్చి ‘రాజయ్యా! ఇందులో మూడువేల రూపాయలున్నాయి. లెక్క చూసుకో’ అన్నాడు. మర్నాడు రాజయ్య ‘అయ్యా.. నిన్న తమరు నా నెల జీతం ఇచ్చారు కదా! అందులో వంద రూపాయలు ఎక్కువ ఉన్నాయి. ఇవిగో తీసుకోండి ఆ వంద రూపాయలు’ అని తిరిగిచ్చేశాడు.
కొంత కాలం గడిచాక.. ఒకరోజు నందయ్య తోట పని చేస్తున్న రాజయ్యను పిలిచి ‘చూడు రాజయ్యా! నేనూ, నా భార్య తీర్థయాత్రలకు వెళుతున్నాం. మేం తిరిగి రావడానికి పదిహేను రోజులు పడుతుంది. అప్పటిదాకా ఇంటినీ, తోటనూ కనిపెట్టుకుని ఉండు’ అని చెప్పి ఆరోజే యాత్రలకు బయలుదేరారు నందయ్య దంపతులు.
ఆనాటి నుంచి రాజయ్య భోజనానికి మాత్రమే ఇంటికి వెళ్లొస్తూ తోట పనులన్నీ చూసుకుంటున్నాడు. రాత్రికి తోటలోనే ఉన్న గుడిసెలో పడుకునేవాడు. పదిహేను రోజుల తర్వాత నందయ్య దంపతులు తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చారు.
రాజయ్య నందయ్య దగ్గరకు వెళ్లి ‘అయ్యా! తమరు వెళ్లిన వారం రోజులకు ఓ రాత్రి దొంగతనానికి ప్రయత్నం జరిగింది. నేను దొంగను పట్టుకునేలోపే దొరక్కుండా నన్ను గాయపరిచి పారిపోయాడు’ అంటూ తన తలను చూపించాడు.
తనతో తీసుకెళ్లి, ఇంటి వెనుక కిటికీ అద్దం పగిలి ఉండడం చూపించాడు రాజయ్య. కిటికీ కిందుగా మట్టిలో పగిలిపోయిన గాజు ముక్కలను చూశాడు నందయ్య. ‘మీరు తిరిగి వచ్చిన తర్వాత మీకు చూపించే ఉద్దేశంతోనే గాజు పెంకులు పారవేయలేదు దొరా..’ అన్నాడు రాజయ్య. అనంతరం వాటిని పడేసి ఆ ప్రాంతాన్ని శుభ్రం చేశాడు.
ఆ మర్నాడు నందయ్య మిత్రుడు పంపిన మామిడి కాయల గంపను రాజయ్యకు ఇస్తూ ‘వీటిని తీసుకెళ్లి సుగంధపురిలో ఉన్న మా అమ్మాయికి ఇచ్చిరా’ అన్నాడు. నందయ్య కూతురికి ఆ గంప అందజేసి సాయంకాలానికి హేలాపురికి తిరిగొచ్చేశాడు రాజయ్య.
రెండు రోజుల తర్వాత రాజయ్యను పిలిచి ‘చూడు రాజయ్యా! ఇక మీదట నీ సేవలు మాకు అవసరం లేదు. ఈ నెలలో నువ్వు ఇప్పటి వరకూ పనిచేసిన రోజులకు గానూ రావాల్సిన జీతం ఈ సంచిలో ఉంది’ అంటూ రాజయ్య చేతికిచ్చాడు నందయ్య.
అకస్మాత్తుగా తనని పనిలో నుంచి ఎందుకు తీసేస్తున్నారో అర్థం కాని రాజయ్య బిక్క మొకం వేశాడు. ఏం పాలుపోక సంచి తీసుకుని ఇంటికెళ్లిపోయాడు. ఇదంతా గమనిస్తున్న నందయ్య భార్య ‘అదేమిటండీ! అంత నమ్మకంగా పని చేస్తున్న రాజయ్యను ఎందుకు తీసేశారు?’ అని అడిగింది ఆశ్చర్యంగా.
నందయ్య చిన్నగా నవ్వి.. ‘మొదట్లో నేను అతనికి జీతంలో వంద రూపాయలు ఎక్కువ ఇచ్చేశానని చెప్పాడు కదా! నిజానికి నేను ఆ సంచిలో మూడువేల రూపాయలే ఉంచాను. నా లెక్క ఎప్పుడూ తప్పు కాదని నీకు తెలుసు కదా! తాను నిజాయతీ పరుడనని నమ్మించడానికే అలా చేశాడు. నేను ఆ విషయం ఆరోజే గ్రహించాను. రాజయ్య తానే కిటికీ అద్దం జాగ్రత్తగా పగలగొట్టి ఆ ముక్కలు కిటికీ బయట పడేశాడు. ఎవరైనా దొంగతనానికి వచ్చి కిటికీ అద్దాన్ని ఏ రాయితోనో పగల గొట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ అద్దం పెంకులు కిటికీ లోపల ఇంట్లో పడతాయి. ఇంటిలో ఒక్క గాజు పెంకు కూడా లేదు. గాజు పెంకులు లోపల పడలేదంటే రాజయ్య కావాలని తనే జాగ్రత్తగా అద్దాన్ని పగలగొట్టాడని అర్థమవుతోంది కదా!’ అన్నాడు.
భర్త ఆలోచనకు విస్తుపోయి.. ‘మరి అమ్మాయికి మామిడి పళ్ల గంప భద్రంగా చేర్చాడు కదా?’ అని అడిగింది నందయ్య భార్య. ‘అదీ చెబుతాను. గంపలో వంద కాయలు ఉన్నాయని అమ్మాయికి ముందే చెప్పాను. లెక్క తెలియదనుకుని అతను  పది కాయలు కాజేశాడు. గంపలో తొంభై మామిడి కాయలే ఉన్నాయన్న సమాచారం మన అల్లుడు నాకు చేరవేశాడు’ అని వివరించాడు నందయ్య. భర్త తెలివి తేటలకు, ముందు జాగ్రత్తకు ఆమె పొంగిపోయింది.

- కోనే నాగ వెంకట ఆంజనేయులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని