ఫలించిన మృగరాజు ఉపాయం

సిరిపురం అడవికి రాజైన సింహం సమక్షంలో జంతువులన్నీ సమావేశమయ్యాయి. తమకున్న సమస్యలను విన్నవించడానికి అవి వచ్చాయి. సింహం ఆజ్ఞాపించగా సాధు జంతువులైన జింకలు ముందుకు వచ్చి.. ‘మృగరాజా! మన అడవిలో మాకు రక్షణ లేకుండా పోయింది. దుష్టులైన అడవి దొంగలు విచక్షణా రహితంగా మమ్మల్ని మాంసం కోసం వేటాడుతున్నారు’ అని బాధపడుతూ చెప్పాయి.

Published : 03 May 2021 01:18 IST

సిరిపురం అడవికి రాజైన సింహం సమక్షంలో జంతువులన్నీ సమావేశమయ్యాయి. తమకున్న సమస్యలను విన్నవించడానికి అవి వచ్చాయి. సింహం ఆజ్ఞాపించగా సాధు జంతువులైన జింకలు ముందుకు వచ్చి.. ‘మృగరాజా! మన అడవిలో మాకు రక్షణ లేకుండా పోయింది. దుష్టులైన అడవి దొంగలు విచక్షణా రహితంగా మమ్మల్ని మాంసం కోసం వేటాడుతున్నారు’ అని బాధపడుతూ చెప్పాయి.
ఆ తరువాత ఏనుగులు కూడా వచ్చి.. ‘మాకు కూడా రక్షణ లేదు మహా ప్రభూ! అడవి దొంగలు మా దంతాల కోసం మమ్మల్ని కూడా వేటాడుతున్నారు’ అని ఫిర్యాదు చేశాయి. పులులు, చిరుత పులులతో సహా అడవిలోని ప్రతి జంతువు మృగరాజుతో తమ గోడు చెప్పుకున్నాయి.
చివరికి చెట్లు సైతం బోరున విలపిస్తూ ‘మృగరాజా! మాతోనూ అడవి దొంగలు క్రూరంగా వ్యవహరిస్తున్నారు. విలువైన మా కలప కోసం మమ్మల్ని విచ్చలవిడిగా నరికేస్తున్నారు. ఇలా చూస్తూ ఉంటే చివరికి ఈ అడవిలో జంతువుల జాతి అంతా అంతరించిపోతుంది. ప్రతి జీవీ ఆకలితో అలమటిస్తూ.. తినడానికి తిండిలేక, తాగడానికి నీరులేక భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించి తమరు అందరికీ న్యాయం చేయాలి’ అని వేడుకున్నాయి.
మృగరాజు బాగా ఆలోచించి ‘నిజమే! మీరు చెబుతున్నట్లు మన అడవిలోని జంతువులు, పక్షులు, చెట్లు అన్నీ అంతరించిపోతున్నాయి. చూడండి మిత్రులారా! ఈ సమస్యను మనకు మనమే పరిష్కరించుకోవాలి. మనమందరం ఐకమత్యంతో మన ప్రాణాలను మనమే కాపాడుకోవాలి’ అని చెప్పింది.
ప్రతి జంతువు, పక్షికి ఒక్కో బాధ్యతను అప్పగించింది. ‘ఇక నుంచి వారికి భయపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన ఈ ఉపాయం వల్ల మనం నివసించే ఈ అడవిని రక్షించుకోగలం’ అని తన అభిప్రాయాన్ని చెప్పింది.
ఆ అడవి దొంగలను తెలివి తేటలతో ధైర్యంగా ఎలా ఎదుర్కోవాలో... ఏ జంతువుకు ఏ సామర్థ్యముందో వివరించింది. మృగరాజు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడానికి జంతువులన్నీ సంతోషంగా ఒప్పుకున్నాయి.
ఓ రోజు అటవీ అధికారుల కళ్లుగప్పి అడవి దొంగలు రహస్యంగా అడవిలోకి వచ్చారు. వారిని చూసిన కాకులు, ఇతర పక్షులు మిగతా జంతువులను అప్రమత్తం చేశాయి.
దొంగలు ఏమరపాటుగా ఉన్నప్పుడు వారి వెంట తెచ్చుకున్న తుపాకులను అడవి కుక్కలు, కోతులు అన్నీ కలిసి మెరుపువేగంతో లాక్కుని వాగులో పడేశాయి.
ఏనుగులు గుంపులుగుంపులుగా వచ్చి వారిని తమ తొండాలతో బలంగా బాదాయి. సింహాలు, పులులు అడవి అంతా మారుమోగేటట్లు గట్టిగా అరుస్తూ  గాయపరిచాయి.
ఇలా జంతువులన్నీ కలిసి వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. అసలు ఏం జరుగుతుందో దొంగలకు అర్థం కాలేదు. జంతువులన్నీ ఎన్నడూ లేనివిధంగా ఐకమత్యంగా ఇలా ఎదురుతిరగడం వాళ్లకు కొత్తగా, ఆశ్చర్యంగా అనిపించింది.
బతికుంటే బలుసాకు తిని బతకొచ్చు. ఇక ఎప్పుడూ ఈ అడవిలోకి రాకూడదు అనుకుని అక్కడి నుంచి దొంగలందరూ ప్రాణభయంతో పారిపోయారు. ఆ తర్వాత అడవిలోకి ఏ దొంగల ముఠా వచ్చినా... జంతువులన్నీ ఇలాగే తెలివిగా ప్రవర్తించి వారిని అడవి నుంచి తరిమికొట్టేవి.

- గెడ్డం సుశీల రావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని