నెమలి నాట్యం... కోతి నాణెం!

తోటపల్లి పొలిమేర దాటాక అడవి ఉంది. చిలుక, నెమలి, కోతి, జింక ఈ నాలుగూ ఎంతో స్నేహంగా మెలిగేవి. ఒకరోజు ఓ వేటగాడు ఇంటి నుంచి వేటకోసం వెళుతుంటే ‘ఏమయ్యో! ఈ రోజు ఎలాగైనా నెమలిని వేటాడి తీసుకురా.. సంతలో దానికి భలే గిరాకీ ఉంది’ అని అంది అతని భార్య. అలాగే అని బయలుదేరాడు వేటగాడు.

Published : 07 Jun 2021 01:22 IST

తోటపల్లి పొలిమేర దాటాక అడవి ఉంది. చిలుక, నెమలి, కోతి, జింక ఈ నాలుగూ ఎంతో స్నేహంగా మెలిగేవి. ఒకరోజు ఓ వేటగాడు ఇంటి నుంచి వేటకోసం వెళుతుంటే ‘ఏమయ్యో! ఈ రోజు ఎలాగైనా నెమలిని వేటాడి తీసుకురా.. సంతలో దానికి భలే గిరాకీ ఉంది’ అని అంది అతని భార్య. అలాగే అని బయలుదేరాడు వేటగాడు.

అడవిలోకి వెళ్లగానే వేటగాడి ఎదుటకే ఒక నెమలి వచ్చి నిలబడింది. ‘అయ్యా! నా స్నేహితురాలు ఒక గొయ్యిలో పడిపోయింది. దయచేసి దాన్ని కాపాడరూ?’ అని ఎంతో దీనంగా అడిగింది. ఇదే అదను అనుకొని ఆ వేటగాడు ‘మరి నీ స్నేహితురాలిని కాపాడితే నువ్వు నాకేమిస్తావు?’ అన్నాడు.

‘నువ్వు కోరింది ఇస్తాను’ అంది నెమలి. వేటగాడు జింకను గొయ్యి నుంచి బయటకు తీశాడు. ‘నీ స్నేహితురాలిని కాపాడాను. అన్నమాట ప్రకారం నాకు కావాల్సింది ఏమంటే.. నువ్వు నా వెంట రావాలి’ అని నెమలితో అన్నాడు వేటగాడు.

తనకోసం నెమలి ప్రమాదంలో పడింది అని జింక కన్నీరు పెట్టుకుంది. చిలుక కూడా ఎంతో బాధపడింది. కోతేమో అరటిపండ్ల కోసం వెళ్లి ఇంకా రాలేదు. ‘మన కోతి నేస్తానికి నా ఇష్ట ప్రకారమే వేటగాడితోపాటు వెళ్లానని చెప్పండి’ అని నెమలి వేటగాడి వెంట నడవసాగింది. చిలుక ఎగురుతూ వాళ్లను అనుసరించింది.

వేటగాడు ఇల్లు చేరాడు. అతడి భార్య సంతోషించింది. వారి అబ్బాయి నెమలిని చూసి ఎంతో ముచ్చటపడ్డాడు. నెమలి పిల్లాడిని ఆనందింపచేయడానికి పురి విప్పి నాట్యం చేసింది. పిల్లాడు ఆనందంతో చప్పట్లు కొట్టాడు. నాట్యం చేసినప్పుడు కొన్ని ఈకలు రాలి పడ్డాయి. వాటిని ఆ పిల్లాడు ఏరుకుని ఎంతో సంతోషించాడు.

అక్కడ అడవిలో... అప్పుడే వచ్చిన కోతి,  జింక ఒక్కటే ఉండటం చూసి నెమలి, చిలుక గురించి అడిగింది. జింక జరిగింది చెప్పింది. కోతి కూడా చాలా బాధపడింది. చిలుక వచ్చాక వేటగాడి వివరాలు తెలుసుకుని ఎలాగైనా సరే నెమలిని కాపాడి తీసుకొస్తాను అని అంది.

‘వేటగాడికి ఏదైనా బహుమతి ఇస్తే పని సులువవుతుంది’ అని సలహా ఇచ్చింది జింక. ‘ఆ.. ఇప్పుడు నాకు గుర్తుకు వచ్చింది. ఒకసారి ఇద్దరు దొంగలు బంగారు నాణేల కోసం కత్తులతో పొడుచుకుని చనిపోయారు. అప్పుడు నేను అక్కడ నేలమీద పడి ఉన్న ఓ నాణెం తీసుకుని ఒక చెట్టు తొర్రలో దాచాను’ అని పరుగున వెళ్లి దాన్ని తెచ్చి జింకకు చూపించింది.

ఈలోగా చిలుక ఆయాసపడుతూ వారి ముందుకు వచ్చి వాలి, వేటగాడి ఇల్లు ఎక్కడుందో చెప్పింది. ‘ఇప్పుడు చీకటి పడబోతోంది. రేపు నువ్వు దారి చూపిస్తే వెళ్లి ఆ వేటగాడికి ఈ నాణెం ఇచ్చి, నెమలిని తీసుకు వద్దాం’ అని చిలుకతో కోతి అంది. ‘రేపు నేనూ వస్తాను’ అంది జింక. మరుసటి రోజు జింక వీపు మీద కోతి కూర్చుని కొమ్ములు పట్టుకుంది. చిలుక, కోతి భుజం మీద వాలి దారి చూపసాగింది. అలా వేటగాడి ఇంటికి చేరుకున్నాయి. నెమలితో పిల్లాడు ఆడుకుంటున్నాడు. స్నేహితురాళ్లను చూడగానే నెమలికి ఆనందం కలిగింది.

జింక, కోతి, చిలుక రావడాన్ని చూసిన వేటగాడు ఆశ్చర్యపోయాడు. ‘అయ్యా! ఈ బంగారు నాణెం తీసుకుని నెమలిని విడిచిపెట్టండి’ అంది కోతి. బంగారు నాణెం చూడగానే వేటగాడి కళ్లు మెరిశాయి. ‘అవునయ్యా! నెమలిని సంతలో అమ్మితే మనకు ఒక్క వెండి నాణెం కూడా రాదు’ అంది అతని భార్య. ‘అవును ఇక మీద వేట మానేసి.. ఈ బంగార నాణెంతో మనం ఏదైనా వ్యాపారం చేసుకుందాం’ అన్నాడు వేటగాడు. కాసేపటికి నెమలిని వదిలేశాడు. నెమలి, జింక, కోతి, చిలుక ఎంతో సంతోషంగా అడవి బాట పట్టాయి.

- యు.విజయశేఖరరెడ్డి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని