అనుకుంటే కానిది ఏమున్నది!

ఒకప్పుడు విద్యాధరపురం పొలిమేరలో గురుకుల విద్యాలయం ఉండేది. దానికి అధిపతి త్రివేది ఆచార్య. అక్కడకు పలుప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి విద్య నేర్చుకుంటుండేవారు. విద్యాబోధనలో ఆదర్శ

Updated : 12 Jun 2021 00:46 IST

ఒకప్పుడు విద్యాధరపురం పొలిమేరలో గురుకుల విద్యాలయం ఉండేది. దానికి అధిపతి త్రివేది ఆచార్య. అక్కడకు పలుప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి విద్య నేర్చుకుంటుండేవారు. విద్యాబోధనలో ఆదర్శ గురువుగా ప్రసిద్ధికెక్కాడు త్రివేది ఆచార్య.  
ఒకసారి విద్యాధరపురం నుంచి గోవిందయ్య అనే రైతు తన కొడుకును తీసుకుని గురుకులానికి వచ్చాడు. గురువు త్రివేది ఆచార్యను కలిశాడు ‘గురుదేవా! నా పేరు గోవిందయ్య. నేను ఒక సామాన్య రైతును. వీడు నా కొడుకు నందనుడు. చదువుపై శ్రద్ధ ఎక్కువ. తొందరగానే నేర్చుకోగలడు. ప్రస్తుతం మా పశువులను ఇక్కడే తమ గురుకులం చుట్టుపక్కల మేపుతున్నాడు. ఈ క్రమంలో మీ దగ్గర విద్యార్థులను చూసి.. తాను కూడా విద్య నేర్చుకోవాలని ఉబలాటపడుతున్నాడు. నా కొడుకును మీ శిష్యుడిగా స్వీకరించండి’ అని వినయంగా అడిగాడు.

ఆ మాటలు విన్న ఆచార్యులు ‘ఇప్పటికే నా వద్ద శిష్యుల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రస్తుతానికి అవకాశం లేదు. ఎలాగూ పశువులను కాస్తున్నాడు అని అంటున్నావుగా.. అది కూడా ఒక విద్యే. నా దగ్గర ఉన్న నాలుగు పశువులనూ మేపమని చెప్పు. నెలకింత అని జీతం కూడా ఇస్తాను’ అని గురువు చులకనగా మాట్లాడారు. ఆ మాటలు విన్న గోవిందయ్య చిన్న బుచ్చుకున్నాడు. తన కొడుకును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
నందనుడు మాత్రం పశువులు కాస్తూనే, ఆ గురుకులం విద్యార్థులు నేర్చుకునే విద్యలన్నింటినీ శ్రద్ధగా ఆలకించేవాడు. ఒకసారి వింధ్య పర్వతాల్లోని గురుకులం ప్రధాన గురువైన వేదదత్తుడు విద్యాధరపురం బయలుదేరాడు. దారిలో పశువుల కాపరి నందనుడిని చూశాడు. ఆ పిల్లాడు చక్కగా శ్లోకాలు చదువుతూ పశువులను కాస్తున్నాడు. అది చూసి వేదదత్తుడు చాలా ఆశ్చర్యపోయాడు.
విద్యాధరపురం గురుకులానికి చేరుకున్న తర్వాత వేదదత్తుడు స్నేహపూర్వకంగా త్రివేది ఆచార్యని కలిశాడు. అక్కడ శిష్యులను చూసి సంతోషించాడు. ఆ పశువుల కాపరి గురించి వాకబు చేయాలని చూశాడు. కానీ.. ‘ఆ పశువులు కాసుకునే కుర్రవాడి గురించి మనకెందుకులే’ అని తేలికగా అన్నాడు త్రివేది ఆచార్య. ఇక మారు మాట్లాడలేకపోయాడు వేదదత్తుడు.
ఆరోజు అక్కడే బస చేసి మరుసటి రోజు వేదదత్తుడు తన గురుకులానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో నందనుడి గురించి తెలుసుకుని, ఆ బాలుడి తండ్రి అనుమతితో తనతోపాటు తీసుకెళ్లాడు. ఆ బాలుడు ఏకసంథాగ్రాహి అని వేదదత్తుడు తెలుసుకుని, సకల విద్యలూ నేర్పాడు. గురుకులంలో నందనుడే ప్రథముడిగా నిలిచాడు.
ఒకసారి విద్యానగర గురుకులంలో పాండిత్య పోటీలు జరిగాయి. అక్కడకు అనేక విద్యాలయాల నుంచి శిష్యులు పోటీలకు వచ్చారు. వారందరిలో నందనుడే ప్రతిభ చాటి ప్రథమస్థానంలో నిలిచాడు. ఒకప్పుడు పశువుల కాపరిగా ఉన్న నందనుడిని చూసిన త్రివేది ఆచార్యకు అంతులేని ఆశ్చర్యం వేసింది. మనసులో పశ్చాత్తాపం కూడా కలిగింది. నందనుని తీర్చిదిద్దినందుకు వేదదత్తుడిని అభినందించాడు. అదే సమయానికి అక్కడికి వచ్చిన నందనుడు వేదదత్తుడితోపాటు త్రివేది ఆచార్యకు కూడా పాదాభివందనం చేసి ఆశీస్సులు అందుకున్నాడు.

- బెహరా ఉమామహేశ్వరరావు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని