ఏది ఏమైనా.. మా ఊరు.. మావూరే!

ఒక అడవిలో చెట్టు కింద కూర్చొని పిల్లి బోరున ఏడుస్తోంది. అది విని చుట్టుపక్కల ఉన్న జంతువులు, పక్షులు అక్కడకు చేరాయి. ‘మిత్రమా.. నువ్వెవరు? ఎక్కడ నుంచి వచ్చావు. ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగింది కుందేలు. ‘నేను ఒక ఎలుకను పట్టుకోవడానికి, దాన్ని వెంబడిస్తూ ఇక్కడకు వచ్చేశాను. ఇక్కడ ఆ ఎలుక దట్టమైన పొదల్లో దూరిపోయింది. నేను మాఊరికి తిరిగి వెళ్లడానికి దారి మర్చిపోయాను’ అని చెప్పి పిల్లి మళ్లీ ఏడుపు మొదలు పెట్టింది....

Updated : 15 Jun 2021 05:38 IST

క అడవిలో చెట్టు కింద కూర్చొని పిల్లి బోరున ఏడుస్తోంది. అది విని చుట్టుపక్కల ఉన్న జంతువులు, పక్షులు అక్కడకు చేరాయి.
‘మిత్రమా.. నువ్వెవరు? ఎక్కడ నుంచి వచ్చావు. ఎందుకు ఏడుస్తున్నావు?’ అని అడిగింది కుందేలు.
‘నేను ఒక ఎలుకను పట్టుకోవడానికి, దాన్ని వెంబడిస్తూ ఇక్కడకు వచ్చేశాను. ఇక్కడ ఆ ఎలుక దట్టమైన పొదల్లో దూరిపోయింది. నేను మాఊరికి తిరిగి వెళ్లడానికి దారి మర్చిపోయాను’ అని చెప్పి పిల్లి మళ్లీ ఏడుపు మొదలు పెట్టింది.
‘ముందు ఆ ఏడుపు ఆపి.. మీది ఏ ఊరో చెప్పు? అక్కడ నిన్ను దిగబెడతాం’ అని అంది ఎలుగుబంటి. ‘నాది మావూరే. నన్ను వెంటనే అక్కడ దిగబెట్టండి’ అంటూ అది తిరిగి ఏడుపు మొదలుపెట్టింది

‘ఇది బాగా అమాయక జీవిలా ఉంది. దీని ఊరు పేరేంటో కూడా చెప్పలేకపోతోంది’ అంది జింక. ‘ఇదో పిల్లి. పిల్లులు మనుషులకు పెంపుడు జంతువులుగా ఉంటాయి’ అని కాకి, చిలుక, ఉడుత, పావురం, పిచ్చుక, తొండ, కోతి అన్నాయి.
‘అది సరేగానీ ఇది ఎక్కడ నుంచి వచ్చిందో చెప్పలేకపోతోంది కదా! దీన్ని అడవిలోనే పెంచుకుందామంటే, ఇది అమ్మమీద దిగులు పెట్టుకుంది’ అంది ఏనుగు.
‘హాయ్‌ బుజ్జీ.. నువ్వు ఎటు వైపు నుంచి వచ్చావు. నీ చిరునామా చెప్పు. నిన్ను అక్కడకు చేర్చుతాం’ అని గోముగా అడిగింది నెమలి. ‘నాది మావూరు. అక్కడే మా అమ్మ, మా తమ్ముళ్లు, అన్నలు, అక్కలు, చెల్లెళ్లు అందరూ ఉంటారు’ అంది పిల్లి. ‘సరేగానీ ఉదయమనగా ఇక్కడకు వచ్చినట్లు ఉన్నావు. ఏదైనా తింటావా!’ అని అడిగింది ఏనుగు. ‘పాలబువ్వ’ అని అంది పిల్లి ఏడుస్తూ. ‘పాలు, బువ్వ ఇప్పుడెక్కడ నుంచి వస్తాయి. ఏ ఆకో, కాయో, పండో, దుంపనో కోరుకో’ అని గద్దించింది గద్ద. ‘అయ్యో! దాన్నలా భయపెట్టకండి. ముందు దానికి కాసిన్ని నీళ్లు పట్టనివ్వండి’ అంటూ పక్కనున్న సెలయేటి నీటిని తొండంతో తెచ్చి పిల్లితో తాగించింది ఏనుగు.
ఇంతలో దున్న, నక్క, పులి, సింహం అక్కడకు చేరుకుని ‘ఏం జరుగుతుందిక్కడ’ అని అడిగాయి. పిల్లి గురించి చెప్పాయి అక్కడున్న పక్షులు, జంతువులు. ‘చిట్టీ.. నువ్వెక్కడ నుంచి వచ్చావు.. ఎవరితో వచ్చావు?’ అని అడిగింది పులి. ‘ఎలుకను తరుముతూ దాని వెనుక మావూరు నుంచి వచ్చాను’ అని అంది పిల్లి. ‘ఇంతకీ నీది ఏ ఊరు’ అని మరోసారి ప్రశ్నించింది పులి. ‘నాది మావూరు’ అని చెప్పింది పిల్లి అమాయకంగా.
‘అసలు ఆ ఎలుక దొరికితే, కనీసం దాన్ని అడిగైనా దీని చిరునామా తెలుసుకోవచ్చు’ అని అంది సింహం. ‘అందరమూ తలుచుకుంటే ఈ అడవిలో ఎక్కడున్నా ఆ ఎలుకను పట్టుకోవడం ఏమంత పని?’ అంది నక్క.
‘అబ్బా.. ఆశ, దోశ, అప్పడం, వడ.. నేను దొరకనుగా..’ అని కిచకిచ నవ్వుతూ పక్కనే ఉన్న పొదలోంచి తలను బయటకు పెట్టి అంది ఎలుక. పక్షులు, జంతువులు, కీటకాలన్నీ ఆశ్చర్యపోయాయి. ‘ఈ ఎలుక ఇంతవరకూ పిల్లి అమాయకత్వాన్ని చూస్తూ ఆనందపడుతోందన్నమాట’ అని నోరెళ్లబెట్టాయి.
‘ఎలుక మిత్రమా! ఈ పిల్లి చాలా అమాయకంగా ఉంది. దీని వల్ల నీకు హాని జరగదు. దీన్ని దాని ఊరు పంపించడానికి దయచేసి సహకరించు’ అని ఎలుకను బతిమిలాడింది తాబేలు.
‘అ పిల్లిది, నాదీ ఒక ఊరే. అది వచ్చినదారి మర్చిపోయి ఉంటుంది. కానీ నాకు మాత్రం మా ఊరు దారి తెలుసు’ అంది ఎలుక గర్వంగా.
‘ఇంతకీ మీ ఇద్దరిదీ ఏ ఊరు’ అని అడిగింది కొంగ. ‘మావూరు’ అని చెప్పింది ఎలుక. ‘ఓసి తింగరీ.. మీ ఊరు మీదే, కాదని ఎవరన్నారు. దానికి ఒక పేరు ఉంటుంది కదా! అది చెప్పు’ అని అంది హంస. ‘ఓసి నా వయ్యారీ.. మా ఊరు పేరే మావూరు’ అంది ఎలుక.
‘అదే కదా! ఈ పిల్లి మొదటి నుంచీ చెబుతోంది. మనమే వెర్రివాళ్లం అయిపోయాం’ అని గుసగుసలాడుకున్నాయి అక్కడున్న జీవులన్నీ. ‘నాకు అమ్మకావాలి.. అమ్మ కావాలి’ అని అంది పిల్లి ఏడుస్తూ. ‘సరే.. సరే.. ఆ ఏడుపు ఆపి నా వెంటరా’ అంటూ ఎలుక పొద నుంచి బయటకు వచ్చి. ‘మా ఊరే మావూరు.. మా ఊరే మావూరు’ అనుకుంటూ మావూరు వైపు నడిచింది. పిల్లి అడవిలోని జీవులన్నింటికీ ధన్యవాదాలు చెప్పి ఎలుకను అనుసరించింది. ‘హమ్మయ్య..!’ అని ఊపిరి పీల్చుకొని అక్కడి నుంచి కదిలాయి.. ఆ జీవులన్నీ.

 - ఎం.వి.స్వామి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని