Updated : 18 Jun 2021 00:25 IST

ఎంత మంచి మనసో నీది!

నగనగా ఒక అడవిలో కింజరి అనే కాకి, మంజరి అనే కోకిల ఎంతో స్నేహంగా ఉండేవి. ఒక రోజు చెట్టు మీద కింజరి దిగులుగా కూర్చుని ఉండటం చూసి ‘మిత్రమా! ఏమిటి ఈ రోజు దిగులుగా ఉన్నావు’ అని అడిగింది మంజరి.
కింజరి నిట్టూర్పు విడుస్తూ.. ‘ఏమీ లేదు మిత్రమా! ఈ రోజు అందాల నెమలి ప్రతిభను ప్రత్యక్షంగా చూశాను. తన అందాల పురిని విప్పి ఎంతో చక్కగా నాట్యమాడింది. రామ చిలుక కూడా చాలా అందంగా ఉండటమే కాకుండా, ముచ్చటగా మాట్లాడటం విన్నాను. చివరికి నువ్వూనేను రంగులో ఒకేలా ఉన్నా.. ఎంతో మధురంగా పాడే గొప్ప ప్రతిభ నీకు మాత్రమే ఉంది. కానీ నాలో ఏ ప్రత్యేకతా లేదు. నన్ను కానీ, నా గొంతును కానీ ఎవరూ ఇష్టపడరు. నేనెందుకూ పనికి రాను. నాకు ఈ జీవితం మీద విరక్తి కలుగుతోంది’ అని తనలో తాను కుమిలిపోతూ.. మంజరితో తన మనసులో బాధను చెప్పుకొంది.

‘చూడు మిత్రమా! ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికీ ఏదో ఒక గొప్ప ప్రతిభను దేవుడు ఇస్తాడు. అది నువ్వు గ్రహించక ఇలా మాట్లాడుతున్నావు. నువ్వు ఆలోచించే విధానం తప్పు’ అని మంజరి ఎన్నో విధాలుగా చెప్పి చూసింది. కానీ కింజరి అవేమీ పట్టించుకోలేదు.
ఆ మరుసటి రోజు కింజరి ఆ దిగులుతోనే తిరుగుతుండగా ఒక గోరింక ఎండదెబ్బకు సొమ్మసిల్లి పడిపోయి ఉంది. అది చూసి కింజరి చలించిపోయింది. కాస్త దూరంలో ఉన్న మడుగులోని నీటిని తన నోటితో తెచ్చి గోరింక నోట్లో పోసింది. వెంటనే గోరింకకు ప్రాణం లేచి వచ్చింది. కాకి చేసిన సాయానికి ఎంతో సంతోషించి.. కృతజ్ఞతలు చెప్పి వెళ్లిపోయింది.
మరోసారి రామచిలుక రెక్కలు ముళ్లపొదలో చిక్కుకుని ఎగరలేక ఎంతో ఇబ్బంది పడుతోంది. అది చూసి వెంటనే తన ముక్కుతో కాకి దాన్ని తొలగించింది. కింజరి చేసిన ఉపకారానికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి ఎగిరిపోయింది చిలుక.
మరో రోజు వాగులో కొట్టుకుపోతున్న పిచ్చుకను తన కాళ్లతో పట్టుకుని ఎంతో తెలివిగా రక్షించింది. అలా ఏదో ఒక విధంగా పక్షులన్నింటికీ సాయం చేస్తూ ఉంది. కానీ తన మనసులో ఉన్న వెలితిని మాత్రం రోజూ తలుచుకుని ఏడుస్తూనే ఉంది.
ఒక రోజు అడవిలోని పక్షులు సమావేశం అవ్వాలని పక్షిరాజు ఆదేశం జారీ చేసింది. అన్నట్లుగానే పక్షులన్నీ ఓ పెద్ద మర్రిచెట్టు మీదకు వచ్చి చేరాయి. గద్ద పక్షులన్నింటినీ ఉద్దేశించి.. ‘మిత్రులారా! ఈ రోజు మన పక్షులన్నింటికీ సుదినం. ఏటా మనం జరుపుకొనే ఈ పండగలో మన పక్షి
జాతుల్లో వాటికి ఉన్న ప్రతిభతో బహుమతులు అందుకుంటున్నాయి. ఈ ఏడాది మన ప్రియ మిత్రుడు కింజరి ఆ బహుమతిని గెలుచుకుంది’ అని చెప్పగానే ఒక మూలగా దిగులుగా కూర్చుని ఉన్న కాకి ఆశ్చర్యంగా తన కళ్లను తానే నమ్మలేకపోయింది. తనలో వాటికి ఏమి ప్రతిభ కనిపించిందో దానికి అర్థం కాలేదు.
ఆ తర్వాత కాసేపటికి చక్కని బహుమానాన్ని కింజరికి పక్షిరాజు అందించింది. ‘చూడండి.. మన మిత్రుడు కింజరిది ఎంతో మంచి మనసు. ఆపదలో ఉన్న రామచిలుక, గోరింక, పిచ్చుకను కాపాడింది. కాకికి ఉన్న మంచి మనసును మనం అందరం అభినందించాలి’ అని గద్ద ఎంతో పొగిడింది. అంటే తాను ఇతర పక్షులకు చేసిన సాయం వల్ల తనను బహుమతికి ఎంపిక చేశారని తెలుసుకుని కింజరి ఎంతో సంతోషించింది.
‘చూశావా.. మిత్రమా! నీలో ఉన్న ప్రతిభ మా అందరికంటే ఎంతో గొప్పది. ఇప్పటికైనా నేను ఎందుకూ పనికిరాను. నాకు ఏ ప్రతిభా లేదు. అని నిన్ను నువ్వు తక్కువగా అంచనా వేసుకోకుండా ఉన్నతమైన నీ వ్యక్తిత్వాన్ని అభినందించుకుంటూ ఆనందంగా ఉండు. అదే నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. నీలో నీకు తెలియకుండా ఉన్న కొన్ని మంచి లక్షణాలే నీకు గొప్ప విలువైన ఆభరణాలు అని తెలుసుకో’ అని మంజరి చెప్పింది. కాకి ఆనందంతో అరిచింది.

- గెడ్డం సుశీలరావు


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts