Updated : 25 Jun 2021 02:07 IST

మృగరాజుకు సంబరం.. అడవంతటికీ ఆనందం!

ల్లంపల్లి అడవికి మహారాజైన సింహం పేరు కేసరి. అది ఒక రోజు భవిష్యత్తు గురించి దీర్ఘంగా ఆలోచిస్తోంది. కోతుల నాయకుడైన రామకము గమనించి విషయం ఆరా తీసింది. కేసరి ఆలోచనలను సఫలం చెయ్యడానికి ఒక ఉపాయం చెప్పింది.

‘మహారాజా..! దీంతో మీ కీర్తి ప్రతిష్టలు మన అడవిలోనే కాక, పక్క అడవులకూ పాకిపోతాయి. దానికి మీరు ఏం చేయాలో విన్నవించుకుంటాను’ అంది. తన ప్రాణ స్నేహితుడైన రామకము ధైర్యవచనాలతో కేసరి తృప్తి పడింది.

‘మహారాజా..! మనం మనుషుల్లాగా పండుగలు, పబ్బాలు జరుపుకోం. మీరు ఆ కొత్త సంప్రదాయం ప్రవేశపెట్టాలి. ముందుగా మీ పుట్టిన రోజు వేడుకతో ప్రారంభిద్దాం. అదే రోజు మన ప్రణాళికలు వివరిస్తాను. దాంతో మీ పేరు నలుదిశలా పాకిపోతుంది’ అంటూ తానీ మధ్య మల్లంపల్లి ఊళ్లో చూసిన పుట్టినరోజు వేడుక గురించి వివరించింది.

కేసరికి ఇది బాగా నచ్చింది. ‘మరి నా పుట్టిన రోజు ఎప్పుడో ఎలా తెలుసుకునేది?’ అని అడిగింది. ‘భలేవారు మహారాజా మీరు! మీ మాటకు ఎదురు ఉంటుందా? మీరు ఏ రోజు అంటే ఆ రోజే మీ పుట్టిన రోజు’ అంది. కేసరి ముందు కాళ్లతో మీసాలు దువ్వుతూ.. ‘అయితే వచ్చే ఆదివారమే నా పుట్టిన రోజు. ఆ వేడుక నిర్వహణ పనులన్నీ నువ్వు చూసుకో’ అని రామకానికి పెత్తనమిచ్చింది.

రామకము సంబరపడిపోయింది. ఈ విషయాన్ని అడవిలో చాటింపు చేసింది. తన మిత్ర బృందంతో పక్క అడవుల్లోని మృగరాజులకు ఆహ్వానాలు తెలిపి రండని పంపించింది. మరునాడు వేదిక అలంకరణ పనులు జింకలు, ఏనుగులకు అప్పగించింది. నెమళ్లు నృత్యాలు చేయాలని, కోకిలలు పాటలు పాడాలని ఆదేశించింది.

ఆదివారం సాయంత్రం కేసరి తన ముందు వేదికను చూసి అబ్బుర పడింది. ఇది తన జీవితంలో మరిచిపోలేని రోజని సంబరపడింది. కోతులు ఇల్లు పీకి పందిరి వేస్తాయని అంటారు కానీ, రామకము పనితనం స్వయంగా చూసి ప్రశంసించింది.

మృగరాజు కేసరి పుట్టిన రోజు వేడుక కోయిల రాగాలతో ఆరంభమైంది. నెమళ్లు నృత్యాలు చేస్తూ కదులుతుంటే.. వాటి వెనకాల అట్టహాసంగా అడుగులు వేస్తూ.. వేదిక పైకి ఎక్కింది. కేసరి ఠీవిగా నిలబడి తన పాలనలోని జంతుసముదాయాన్ని చూసింది. ముందు వరుసలో ఆసీనులైన అతిథి సింహాలను తన వద్దకు పిలుచుకుంది.

‘ఈ సంతోష సమయంలో.. మన మన రాజ్యాల్లో మనుగడ సవ్యంగా కొనసాగాలంటే ఏం చెయ్యాలో నా మిత్రుడు రామకము వివరిస్తాడు’ అంటూ ప్రకటన చేసింది కేసరి. రామకము వేదికనెక్కి.. గొంతు సవరించుకుంది. ‘ప్రణామం.. ప్రణామం.. సమస్త ప్రకృతికి ప్రణామం..’ అని గీతం పాడింది. తర్వాత.. ‘వాస్తవానికి ఇది మన మహారాజైన కేసరి ఆలోచన. మన భవిష్యత్తు, భద్రత కోసం మనం వనాలను కీకారణ్యాలుగా మార్చుకోవాలి. రోజూ ఒకరి పుట్టిన రోజుగా భావించి మొక్కలను నాటుదాం. పర్యావరణ పరిరక్షణ గురించి జీవులన్నింటికీ అవగాహన కల్పిద్దాం. ‘చెట్లు ప్రగతికి మెట్లు’.. వంటి నినాదాలను అక్కడక్కడా రాసి పెడదాం. చెట్లను నరకడానికి వచ్చిన మనుషులతో మమ్మల్ని బతకనివ్వండి అని వేడుకుందాం’ అని వివరించింది. ‘ఈ రోజు మన మృగరాజు కేసరి తన వంతుగా పది మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తారు’ అని ముగించింది.

జంతువులన్నీ తమ సమ్మతిని తెలుపుతూ.. ‘సింహరాజా జేజేలు... తమరికి పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని నినదించాయి. పర్యావరణ పరిరక్షణ కోసం తామూ పాటుపడతాం అని ప్రమాణం చేశాయి. అవీ తలా కొన్ని మొక్కలు నాటాయి.

- చెన్నూరి సుదర్శన్‌


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని