ఇదిగో కుక్కపిల్ల.. అదిగో పాలబువ్వ!

చింటు మూడో తరగతి చదువుతున్నాడు. అమ్మానాన్నలు చెప్పినమాట వింటూ బుద్ధిగా నడుచుకోవడంతో ఇరుగు పొరుగువాళ్లు ‘చింటు మంచి పిల్లవాడు’ అంటూ పొగిడేవారు.

Updated : 03 Jul 2021 06:17 IST

చింటు మూడో తరగతి చదువుతున్నాడు. అమ్మానాన్నలు చెప్పినమాట వింటూ బుద్ధిగా నడుచుకోవడంతో ఇరుగు పొరుగువాళ్లు ‘చింటు మంచి పిల్లవాడు’ అంటూ పొగిడేవారు.

ఓ రోజు అమ్మకు టాటా చెప్పి బడికి బయలుదేరాడు. దారిలో నడుస్తూ కొంత దూరం పోయాక కుక్కపిల్ల కనిపించింది. అది ముద్దుగా, బొద్దుగా భలే ఉంది. దాన్ని చూసిన చింటుకు ముచ్చటేసింది. బడి విషయం మరిచిపోయి దాని వెంటపడ్డాడు. కుక్క పిల్ల మాత్రం బిత్తరచూపులతో అడ్డదిడ్డంగా పరుగులు పెడుతోంది.
అయినా చింటు వెనక్కి తగ్గలేదు. దాని వెంటే పరుగు తీశాడు. కానీ అది చేతికి దొరకడం లేదు. చింటుకు మాత్రం కుక్కపిల్లను చేతిలోకి తీసుకుని ముద్దాడాలనే కోరిక ఇంకా పెరిగింది. వెనక్కి వేలాడుతున్న పుస్తకాల సంచి బరువునూ లెక్కచేయలేదు. వేగం పెంచాడు. ఎలాగైతేనేం చివరికి దాన్ని పట్టేశాడు. కుక్కపిల్ల మాత్రం బాధతో ‘కుయ్‌.. కుయ్‌..’ అని మూలుగుతూ ఉంది.

ఓ చేతిలో కుక్కపిల్లను పట్టుకుని రెండో చేతితో దాన్ని నిమురుతూ నడుస్తున్నాడు చింటు. కుక్కపిల్ల మాత్రం మొరుగుతూనే ఉంది. పుస్తకాల సంచిలో దాచుకున్న బిస్కట్లను తీసి కుక్కపిల్ల నోటికి అందించాడు. అది ముట్టుకోలేదు. మూలగడం ఆపనేలేదు. బుజ్జగించి చూశాడు. ప్చ్‌..! ఫలితం కనిపించలేదు. బాగా ఆలోచించిన చింటు ఇంటివైపు అడుగులు వేశాడు. అమ్మను అడిగి పాలబువ్వ పెట్టాలనుకున్నాడు.

ఇల్లు చేరుకున్నాడు, కానీ ఇంటికి తాళం వేసి ఉంది. వెంటనే భయం వేసింది. అమ్మ ఎక్కడికి వెళ్లుంటుంది? ఆలోచనలో పడ్డాడు. పక్కింటికి వెళ్లాడు. ‘మా అమ్ముందా?’ అని అడిగాడు.

చేతిలో కుక్కపిల్ల, పుస్తకాల సంచిని చూసిన పక్కింటావిడ ‘చింటూ! నువ్వు బడికి వెళ్లలేదేంటి? అయినా చేతిలో ఆ కుక్క పిల్ల ఏంటి?’ అని అడుగుతూనే ‘మీ అమ్మ మా ఇంటికి రాలేదు’ అని చెప్పింది. చింటు ఆందోళన మరింత పెరిగింది. పొరుగింటికి వెళ్లి కూడా ఆరా తీశాడు. అక్కడా అమ్మలేదని తేలింది. మరో ఇంటికి వెళ్లాడు. అక్కడ కూడా అమ్మ కనిపించలేదు. కళ్ల నుంచి నీరు ఆగలేదు. ఇప్పుడు కుక్కపిల్ల మీద కన్నా అమ్మ మీద ధ్యాసే ఎక్కువయ్యింది.

‘నాకు చెప్పకుండా అమ్మ ఎటు వెళ్లిపోయింద’ని ఆలోచిస్తూ ఏడుపు అందుకున్నాడు. చేతిలో కుక్కపిల్ల నానా తంటాలు పడుతోంది. చింటు బిగ్గరగా ఏడవడంతో ఇరుగుపొరుగువాళ్లు ఏమైందోనని ఆందోళనగా వచ్చారు. మేడపై నుంచి అమ్మ కూడా ‘చింటూ..’ అనుకుంటూ కంగారుగా కిందకు దిగింది. ఇంతలో కుక్కపిల్ల తల్లి మిగతా పిల్లలను వెంటేసుకుని అక్కడకు వచ్చింది. చింటు చేతిలో పిల్లను చూసి మొరగడం ప్రారంభించింది. తల్లిని చూసిన కుక్కపిల్ల చింటు చేతిని వదిలించుకొని జారిపోయింది. తల్లిని చూసిన ఆనందంలో కుక్కపిల్లను చింటు పట్టించుకోలేదు.

క్షణాల్లో కుక్కపిల్ల తల్లిని చేరుకుని కాళ్లలోకి దూరిపోయింది. తల్లి కుక్క కూడా పిల్లను నాలుకతో నాకుతూ ఊపిరి పీల్చుకుంది. చింటు కూడా అమ్మను గట్టిగా హత్తుకున్నాడు. నువ్వు కనిపించకపోయేసరికి నేనెంత గాబరా పడ్డానో అని వెక్కి వెక్కి ఏడ్చాడు.

నిన్ను విడిచి నేనెక్కడికి వెళ్తాను కన్నా! చీరలు ఆరేయడానికి మేడపైకి వెళ్లాను. అవునుగానీ.. నువ్వు బడికి వెళ్లలేదేంటి? అని తల నిమురుతూ లాలనగా అడిగింది అమ్మ.

అప్పుడు కుక్కపిల్ల జ్ఞాపకం వచ్చి దాని గురించి చెప్పడం ప్రారంభించాడు. ‘కుక్క పిల్ల ఒంటరిగా కనిపిస్తే ముద్దుగా ఉందని పెంచుకోవడానికి తీసుకువచ్చాను. నేను చేసింది తప్పని ఇప్పుడు తెలిసింది. అమ్మ ఎవరికైనా అమ్మే అని అర్థమైంది’ అని బాధపడుతూ చెప్పాడు చింటు.

‘ఏమైతేనేం.. తప్పు తెలుసుకున్న నిన్ను అభినందిస్తున్నాను. మూగజీవాలపై జాలి ఉండాలి కానీ, తల్లీపిల్లను వేరుచేసి ప్రేమ చూపడం సరైన పద్ధతి కాదు. పిల్లలతో పాటు వచ్చిన కుక్కకు పాలబువ్వ పెడుదువురా.. అంటూ తాళం తీసి చింటును లోపలకు తీసుకెళ్లింది అమ్మ.

కాసేపటికి అమ్మ ఇచ్చిన పాలబువ్వను కుక్కల ముందు ఉంచాడు చింటు. అవి తోకలు ఊపుకుంటూ తింటున్నాయి. తాను ఎత్తుకొచ్చిన కుక్కపిల్ల మాత్రం అప్పుడప్పుడు తల పైకెత్తి ఇంకా భయంభయంగానే చింటును చూస్తూనే ఉంది.

- బి.వి.పట్నాయక్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని