చందనం.. నీకు వందనం!

చంపక అరణ్యంలో చందనం అనే కోతి ఉండేది. దానికి తల్లి ద్వారా వైద్యం తెలిసింది. అడవిలో మంచి గుర్తింపూ వచ్చింది. దాంతో నాలుగు కోతులు స్నేహంగా ఉండేవి. ఆ అడవిలో ఒక ఎలుగుబంటి కూడా వైద్యం చేసేది. ఆ అడవికి రాజైన సింహం తండ్రికి ముసలితనం వల్ల ఆరోగ్యం దెబ్బతింది. మృగరాజు చందనానికి కబురంపింది. అది వచ్చి వైద్యసేవలు అందించింది. కానీ ఫలితం లేకపోయింది.

Published : 06 Jul 2021 01:54 IST

చంపక అరణ్యంలో చందనం అనే కోతి ఉండేది. దానికి తల్లి ద్వారా వైద్యం తెలిసింది. అడవిలో మంచి గుర్తింపూ వచ్చింది. దాంతో నాలుగు కోతులు స్నేహంగా ఉండేవి. ఆ అడవిలో ఒక ఎలుగుబంటి కూడా వైద్యం చేసేది. ఆ అడవికి రాజైన సింహం తండ్రికి ముసలితనం వల్ల ఆరోగ్యం దెబ్బతింది. మృగరాజు చందనానికి కబురంపింది. అది వచ్చి వైద్యసేవలు అందించింది. కానీ ఫలితం లేకపోయింది.
తండ్రి మరణించడంతో మృగరాజుకు కోపం వచ్చింది. ‘ముసలితనం వల్ల కోలుకోలేదు. నా ప్రయత్న లోపం ఏమీ లేదు’ అని కోతి విన్నవించుకున్నా సింహం వినిపించుకోలేదు. ‘నీ చేతకాని తనం వల్లే ఇలా జరిగింది. నీ వల్ల కాదని ముందే చెప్పి ఉంటే ఎలుగుబంటిని పిలిపించి వైద్యం చేయించేదాన్ని. ఇకముందు నువ్వు ఈ అడవిలో వైద్యం చేయవద్దు’ అంటూ కోతితో అవమానకరంగా మాట్లాడింది సింహం.
ఈ విషయం అక్కడే ఉన్న నక్క ద్వారా జంతువులన్నింటికీ తెలిసింది. మృగరాజు కోపానికి, నిరాదరణకు గురైన చందనాన్ని మిత్రులు ఓదార్చకపోగా పలకరించను కూడా లేదు. ఇక అది అక్కడ ఉండలేక అడవి వదలి వెళ్లిపోయింది. ఒకసారి నాలుగు కోతుల్లో ఒక దానికి జబ్బు చేసింది. ఎలుగుబంటి ఎంత ప్రయత్నించినా నయం చేయలేకపోయింది. వాటికి అప్పుడు చందనం గుర్తుకొచ్చింది. తాము దాన్ని చిన్నచూపు చూసిన తీరు మదిలో మెదిలింది.
‘చందనం తమను పలకరిస్తుందా?’ అనే సందేహంతోనే జబ్బుపడ్డ కోతిని అది ఉంటున్న అడవికి తీసుకెళ్లాయి. వాటికి ఒక పెద్దపులి కనిపిస్తే తమ గురించి చెప్పి.. చందనం ఎక్కడ ఉంటుందని అడిగాయి. ‘చందనం ఈ అడవిలోకి వచ్చిన సమయానికి మా సింహం రాజు వీపుపైన రాక్షసపుండు పుట్టి చాలాకాలంగా బాధపడుతోంది. ఇక్కడున్న ఇద్దరు వైద్యులు బాగు చేయలేకపోయారు. విషయం తెలుసుకున్న చందనం మా మృగరాజును కలిసి పుండును పరీక్షించి, ఏవో ఆకు పసర్లు వాడి అతి తక్కువ కాలంలోనే నయం చేసింది. ఎంతోకాలంగా ఉన్న తన బాధను పోగొట్టిన ఆ కోతిని మా మృగరాజు ఆస్థాన వైద్యులుగా నియమించింది’ అని చెప్పింది పులి. అనారోగ్యంతో ఉన్న కోతిని పులి తన వీపుపై ఎక్కించుకుని చందనం దగ్గరకు తీసుకెళ్లింది. ఉన్నతస్థానంలో ఉన్న అది తమను అవమానించి పంపుతుందేమో అని అనుమానంగా నాలుగు కోతులు వెళ్లాయి. చందనం వాటిని చూసి క్షేమ సమాచారాలు అడిగింది. వాటిరాకకు కారణం తెలుసుకుంది.
జబ్బుతో ఉన్న కోతిని పరీక్షించి తాను సాయం చేస్తానని ధైర్యం చెప్పింది. దాని ఆరోగ్యం కుదుటపడేంత వరకు నలుగురు మిత్రులకూ సకల సౌకర్యాలు కల్పించింది. ఆరోగ్యం కుదుటపడ్డాక చంపక అరణ్యానికి వెళ్లడానికి నాలుగుకోతులూ ప్రయాణమయ్యాయి. ‘మిత్రమా! మేము నీకున్న గుర్తింపును చూసి నీకు దగ్గరయ్యాం. నీ ప్రాముఖ్యం తగ్గగానే ముఖం చాటేశాం. అవేమీ మనసులో పెట్టుకోకుండా నిస్వార్థంగా ఈ రోజు మమ్మల్ని ఎంతో ఆదరించావు. మమ్మల్ని క్షమించు’ అని చెప్పి సెలవు తీసుకున్నాయి. 

- డి.కె.చదువుల బాబు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని