ఎవరి గోల వారిది!

గోదావరి నదీ తీరంలో పెద్ద అడవి, అక్కడి మడుగులో ఒక అడవి బాతు తన పిల్లలతో కలిసి నివసించేది. అందులో ఒక బాతు పిల్ల చాలా అల్లరిది. అది తల్లి మాట అస్సలు వినేది కాదు. దానికి అడవిలో మిగతా పక్షుల్లా గాల్లో ఎగరాలని, ఎంచక్కా పండ్లు తింటూ చెట్ల కొమ్మల మీద కూర్చోవాలని ఆశ ఉండేది. తల్లి మేతకు వెళ్లిన ప్రతిసారీ చెట్ల మీదకు ఎగిరే ప్రయత్నం చేస్తూ ఉండేది. ఎత్తైన రాళ్లగుట్ట ఎక్కి, అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగరాలని చూసేది. కిందపడి ఒళ్లంతా దెబ్బలు తగిలించుకునేది.

Published : 19 Jul 2021 01:13 IST

గోదావరి నదీ తీరంలో పెద్ద అడవి, అక్కడి మడుగులో ఒక అడవి బాతు తన పిల్లలతో కలిసి నివసించేది. అందులో ఒక బాతు పిల్ల చాలా అల్లరిది. అది తల్లి మాట అస్సలు వినేది కాదు. దానికి అడవిలో మిగతా పక్షుల్లా గాల్లో ఎగరాలని, ఎంచక్కా పండ్లు తింటూ చెట్ల కొమ్మల మీద కూర్చోవాలని ఆశ ఉండేది.
తల్లి మేతకు వెళ్లిన ప్రతిసారీ చెట్ల మీదకు ఎగిరే ప్రయత్నం చేస్తూ ఉండేది. ఎత్తైన రాళ్లగుట్ట ఎక్కి, అక్కడి నుంచి ఆకాశంలోకి ఎగరాలని చూసేది. కిందపడి ఒళ్లంతా దెబ్బలు తగిలించుకునేది. పిల్లబాతుకు ఇది నిత్యకృత్యంగా మారింది.

తల్లి తిడుతుంటే మౌనంగా ఉండేది. ఆ దెబ్బల నొప్పులు తగ్గగానే మళ్లీ తన ప్రయత్నం మొదలు పెట్టేది. తల్లి ఎంత చెప్పినా పిల్లబాతు వినేది కాదు. అలా చాలా రోజులు గడిచాయి. దాని వయసైతే పెరిగింది కానీ దాని కోరిక మాత్రం నెరవేరలేదు. పెద్దయ్యాక తనే తెలుసుకుంటుందిలే అని తల్లి కూడా పట్టించుకోవడం మానేసింది.

యథాలాపంగా ఒక రోజు బాతు పిల్ల పొద్దున్నే గోదావరి నదికి ఆనుకునే ఉన్న పెద్ద మడుగు దగ్గరకు వెళ్లింది. అక్కడ ఓ కాకి పిల్ల ఒళ్లంతా తడిసి సొమ్మసిల్లి పడిపోయి ఉంది. దాని తల్లి   రెక్కలు ఊపుతూ పిల్లకాకికి సపర్యలు చేస్తోంది. మిగతా కాకులన్నీ చుట్టూ ఎగురుతూ రెక్కలాడిస్తూ గోలగోల చేస్తున్నాయి.
‘ఏమైంది? మీ పిల్ల నీళ్లలో ఎలా పడింది?’ అని ఆసక్తిగా అడిగింది బాతుపిల్ల, తల్లికాకిని. ‘ఏం చెప్పనమ్మా! మీ బాతులు నీళ్లల్లో దిగి రయ్‌.. రయ్‌మని ఈదుతాయిగా.. తనకూ అలా ఈదాలని కోరిక. ఎంత చెప్పినా వినదు. ఎక్కడ నీళ్ల మడుగు కనిపించినా అందులో దిగి ఈదబోతుంటుంది. ఇవాళ నా కళ్లు కప్పి ఇదిగో.. ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంది’ అంది తల్లికాకి తన పిల్లకు సేవలు చేస్తూ.

‘అయినా కాకులు నీళ్లలో ఎలా ఈదగలవు. దీని పిచ్చికాకపోతే’ అని బయటకు అందాం అనుకుంది పిల్ల బాతు. కానీ తానూ ఇన్నాళ్ల నుంచి చేస్తున్న పని గుర్తుకు వచ్చి ఆగిపోయింది బాతుపిల్ల. ‘జాతి లక్షణానికి అనుగుణంగా ప్రయత్నించి అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. కానీ అందుకు వ్యతిరేకంగా చేసే ప్రతి ప్రయత్నం వ్యర్థమే’ అని ఆనాటి సంఘటనతో అర్థం చేసుకుంది బాతుపిల్ల. అప్పటి నుంచి గాల్లో ఎగరాలనుకునే తన అసహజ ఆలోచన మానుకుంది. కాకిపిల్లతో స్నేహం చేసి, దాన్ని రోజూ తన వీపున కూర్చోబెట్టుకుని ఆ పెద్ద మడుగులో షికారు చేస్తూ నీళ్లలో తిరిగే ఆనందాన్ని దానికి అందించేది. అది చూసిన తల్లి కాకి, తన బిడ్డ మిత్రుని కోరిక తెలుసుకుని తన వీపున ఎక్కించుకుని గాల్లో చక్కర్లు కొట్టేది. అలా బాతుపిల్లకు గాల్లో ఎగిరిన ఆనందం దక్కింది.

- శ్రీనివాసరాజు అమ్మిన


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని