పచ్చని స్నేహం తోడుంటే...!

రాజుగా ఉన్న ఒక అడవిలో అన్ని జంతువులతోపాటు కొంగ, నక్క కూడా ఉండేవి. కొంగ అన్ని జంతువులతోనూ స్నేహం చేసేది. కానీ అది ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా నక్క పట్టించుకోకుండా వెళ్లిపోయేది.

Updated : 21 Jul 2021 06:28 IST

సింహం రాజుగా ఉన్న ఒక అడవిలో అన్ని జంతువులతోపాటు కొంగ, నక్క కూడా ఉండేవి. కొంగ అన్ని జంతువులతోనూ స్నేహం చేసేది. కానీ అది ఎంత మాట్లాడాలని ప్రయత్నించినా నక్క పట్టించుకోకుండా వెళ్లిపోయేది. ఒక రోజు కొంగ తన బాధను స్నేహితులైన నెమలి, పావురం, ఏనుగు.. మొదలైన వాటితో వెళ్లబోసుకుంది.

‘ఈసారి మనమందరం కలుసుకున్న సమావేశానికి నక్కను ముఖ్య అతిథిగా పిలిచి సరదాగా విందు ఏర్పాటు చేసుకుందాం. ఈలోగా నేను నక్కను కలిసి నీతో ఎందుకు స్నేహంగా ఉండటం లేదో అడుగుతాను’ అని కుందేలు పెద్దరికం తీసుకుంది.

ఓ రోజు నక్కను కలిసి, కొంగతో స్నేహంగా ఉండకపోవడానికి గల కారణం అడిగింది కుందేలు. దానికి నక్క ఇలా చెప్పింది.. ‘మా మధ్య వైరం ఈనాటిది కాదు. మా పూర్వీకుల నుంచీ ఉన్నదే. నీకు తెలీదేమో..!’ అంది. ‘అరె.. నాకు తెలీదే. అదేమిటో చెప్పవా?’ అని అడిగింది.
‘పూర్వం ఒకసారి మా ముత్తాత నక్క కొంగను విందుకు ఆహ్వానించి పళ్లెంలో పాయసం వడ్డించి తినమంది. కొంగ తన పొడవాటి ముక్కుతో తినలేక పోయింది. ప్రతీకారంగా మా ముత్తాతను విందుకు ఆహ్వానించి, పొడవైన కూజాలో పాయసం వడ్డించి, తినమంది. తానూ తినలేకపోవడం వల్ల ఇక అప్పటి నుంచి కొంగలతో స్నేహం చేయవద్దని మా ముత్తాత నక్క తీర్మానం చేసింది. అప్పటి నుంచి మా వంశంలో అందరం దాన్ని పాటిస్తున్నాం’ అని చెప్పింది.

‘ఆనాటి పరిస్థితులు వేరు. ఏదో కోపంలో తాత్కాలిక నిర్ణయం తీసుకుని అదే తరతరాలు పాటించాలంటే తప్పుకదా! పైగా ముందు మీ ముత్తాత నక్కే కొంగను విందుకు ఆహ్వానించి అవమానించింది. అందుకే దానికి కొంగ కూడా ప్రతీకారం తీర్చుకుంది. అక్కడితో ఆ కథ ముగిసింది’ అని కుందేలు అంది.
కుందేలు చెప్పిన మాటలు నక్కకు సమంజసంగానే అనిపించాయి. ‘నువ్వు చెప్పిన మాట నాకు నచ్చింది. ఒకరి అవసరం మరొకరికి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. నాకు కొంగతో స్నేహం చేయడానికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ నా అంతట నేనుగా దాంతో మాట్లాడలేను. నాకు అహం అడ్డు వస్తోంది’ అంది నక్క.

‘రేపు పౌర్ణమినాడు సాయంత్రం అడవిలో జంతువులన్నింటినీ సమావేశానికి పిలుస్తాను. ఆ కార్యక్రమానికి నువ్వు ముఖ్యఅతిథిగా వచ్చి, మనందరి మధ్య స్నేహం కలకాలం ఉండేలా నువ్వు నాలుగు మంచి మాటలు చెప్పు. ఆ తర్వాత జరిగేది నేను చూసుకుంటాను’ అని చెప్పింది కుందేలు.

‘నాకు అంత గౌరవం ఇస్తానంటే తప్పక వస్తాను’ అని చెప్పింది నక్క. అనుకున్న పౌర్ణమి రానే వచ్చింది. సమావేశానికి అడవిలోని జంతువులన్నీ హాజరయ్యాయి. మృగరాజు సింహం అధ్యక్షత వహించింది. కార్యక్రమమంతా కుందేలు నడిపించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన నక్క అక్కడ తనకు లభించిన గౌరవానికి ఎంతో సంతోషించింది. అనంతరం మాట్లాడుతూ ‘అందరి మధ్యా స్నేహం కొనసాగాలంటే అందరూ ఆప్యాయంగా పలకరించుకోవాలి’ అని చెప్పింది. కాసేపటి తర్వాత ముగింపు మాటలు పలుకుతూ కుందేలు ఇలా అంది.. ‘ఈ రోజు నుంచి నక్క, కొంగ రెండూ మంచి స్నేహితులు. వాటి స్నేహానికి గుర్తుగా అందరం తలా ఒక మొక్కను నాటుదాం. అవి పెద్దవయ్యాక చెట్ల మీద పక్షులు, చెట్ల నీడలో జంతువులు సేద తీరతాయి’ అని చెప్పి ముగించింది. అప్పటి నుంచి ఆ అడవిలో జీవులన్నీ కలసిమెలసి జీవిస్తున్నాయి.

- కొత్తపల్లి ఉదయబాబు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని