అమ్మ మాట.. బంగారు బాట!

‘అమ్మా!’ అని బిగ్గరగా అరుస్తూ ఇంట్లో అడుగు పెట్టాడు చంద్రం. ‘ఏంటి బాబూ?’ అంటూ కంగారు పడుతూ సుగుణమ్మ కొడుక్కు ఎదురెెళ్లింది. చంద్రం ముక్కుపుటాలు ఎగిరిపడుతున్నాయి.

Updated : 25 Jul 2021 01:13 IST

‘అమ్మా!’ అని బిగ్గరగా అరుస్తూ ఇంట్లో అడుగు పెట్టాడు చంద్రం. ‘ఏంటి బాబూ?’ అంటూ కంగారు పడుతూ సుగుణమ్మ కొడుక్కు ఎదురెెళ్లింది. చంద్రం ముక్కుపుటాలు ఎగిరిపడుతున్నాయి. కొడుకు వాలకం చూసి తల్లి ఆందోళన పడింది. ‘ఏమి జరిగింది?’ అని అడిగింది. ‘ఈ మధ్య వాసూ వాళ్లు కారు కొన్నారు. దర్జాగా వాసు కార్లో స్కూలుకు వస్తున్నాడు. మొన్న పరీక్షల్లో మొదటి ర్యాంక్‌ కూడా వచ్చింది. తెగ గర్వపడిపోతున్నాడు’ అన్నాడు చంద్రం పుస్తకాలను బల్ల మీద విసురుగా పడేస్తూ.
సుగుణమ్మ కొడుకు మాటలను తేలికగా తీసుకుంటూ.. ‘‘వాళ్లకు కారుంది కాబట్టి దానిలో వాళ్ల నాన్న గారు స్కూళ్లో దిగబెడుతున్నారు. మొన్న నేను కూడా చూశాను. ‘హాయ్‌ ఆంటీ’.. అని నన్ను చంద్రం పలకరించాడు కూడా! నాకు అతనిలో గర్వం కనిపించలేదు. నువ్వేమో గర్వపడిపోతున్నాడని చెబుతున్నావు. ఏం స్నేహితులతో మాట్లాడడం మానేశాడా?’ అని అడిగింది ఆమె.

‘ఆ... మాట్లాడతాడు! వాడు మాట కలిపితే నాకే ఒళ్లు కంపరమెత్తుతోంది!’ జవాబిచ్చాడు చంద్రం. కొడుకు వైపు తల్లి అదోలా చూసింది. చంద్రం మాటలు ఆగలేదు. ‘దినేష్‌కు కూడా గర్వం! వాళ్లు పెద్ద టీవీ కొన్నారు కదా! ఈ మధ్య వాడికి పరీక్షల్లో రెండో ర్యాంక్‌ వచ్చింది!’ అన్నాడు.

తల్లి, కొడుకు వైపు విచిత్రంగా చూసింది. ‘ఆ పెద్ద టీవీ చూడడానికి నిన్ను ప్రేమతో దినేష్‌ పిలిచాడే.. నువ్వే వెళ్లలేదు!’ గుర్తు చేసింది తల్లి. ‘దినేష్‌ను చూస్తే నాకు ముఖం తిప్పాలనే అనిపిస్తుంది! అదీ కాక వాడికి ఈ మధ్య రెండో ర్యాంక్‌ వచ్చింది. వాడు పలకరిస్తుంటే నాకు వెక్కిరిస్తున్నట్టు అనిపిస్తుంది’ అన్నాడు చంద్రం. ఆ మాటలంటున్నప్పుడు చంద్రం ముఖం ఎరుపెక్కడం సుగుణమ్మ గమనించింది. ఈసారి కొడుకును చూసి భయపడిపోయింది. కొడుకును వెంటనే దగ్గరకు తీసుకొని ‘ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు చెప్పే మాటలు వింటున్నాను. తప్పు వాసులో కనిపించలేదు. దినేష్‌లోనూ కనిపించలేదు. నాకు నీలోనే తప్పు కనిపిస్తోంది. వాళ్లు ఎప్పటిలాగే ఉన్నారు. అందువల్లే నీతో మాట్లాడుతున్నారు. నీలో ప్రమాదకరమైన అసూయ గుణం పుట్టింది. అది మంటలాంటిది. శరీరాన్నీ మనస్సునూ ఎప్పుడూ మండిస్తూనే ఉంటుంది. నువ్వు చిన్న పిల్లాడివి. అసూయ ఎంత చెడుగుణమో నీకు తెలియదు. నా అనుభవంతో చెబుతున్నా... అసూయతో రగిలిపోయే వారు జీవితంలో ఏమీ సాధించలేరు. మొగ్గగా ఉన్నప్పుడే దాన్ని తెంపి పారేయ్‌! అసూయ స్థానంలో పట్టుదల పెంచుకో. మనసును నిర్మలంగా ఉంచుకో. వాళ్లలాగ నేనెందుకు కాకూడదు అనే ఆలోచనతో ఉండు. కష్టపడు. శ్రద్ధ పెట్టు. నువ్వు కూడా మంచిస్థాయికి చేరుకుంటావు. అందరి మెప్పునూ పొందుతావు. పెద్ద ఉద్యోగం సాధించి కారూ, పెద్ద టీవీ నువ్వూ కొంటావు. నాన్నను, నన్నూ బాగా చూసుకోగలవు. తెలిసిందా?’ అంది సుగుణమ్మ.

మళ్లీ అంతలోనే... ‘అంతేకాని అసూయతో నీ బుర్ర పాడుచేసుకొని మా ఆశలు వమ్ము చేయకు!’ అని బోధ చేసింది. అమ్మమాట చంద్రం ఆలోచనలో మార్పు తెచ్చింది. అసూయను మరిచిపోయాడు. విజయం సాధించిన వారిని మనసారా ప్రశంసించడం అలవాటు చేసుకున్నాడు. వాళ్లు ఎలా విజయం సాధించారో తెలుసుకొని ఆ బాటలో వెళ్లడం నేర్చుకున్నాడు. కొన్నాళ్లకు చంద్రం తన క్లాసులో మొదటి స్థానంలో నిలిచాడు. అందరూ తనను మెచ్చుకున్నప్పుడు అమ్మ తనను ఎంత పెద్ద ఆపద నుంచి గట్టెక్కించిందో గుర్తు చేసుకున్నాడు. అమ్మకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకొన్నాడు.

- బెలగాం భీమేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు