Published : 31 Jul 2021 01:37 IST

పనికి రాని పాపన్న!

నగనగా ఓ ఊరు. దానిలో పాపన్న అనే అనాథ ఉండేవాడు. ఏ పనీపాటా చేసేవాడు కాదు. ఎవరైనా నాలుగు ముద్దలు పెడితే తిని హాయిగా కాలం గడపడానికి అలవాటు పడ్డాడు. కొంతకాలానికి అందరూ అతడిని అసహ్యించుకోసాగారు. ఎవ్వరూ నాలుగు మెతుకులు కూడా పెట్టడం లేదు. దాంతో జీవితం మీద విరక్తి కలిగి ఏ నుయ్యో.. గొయ్యో.. చూసుకోవాలని బయలుదేరాడు.

కొంతదూరంలో పాపన్నకు ఓ ఆలయం దగ్గర నుయ్యి కనిపించింది. దాని దగ్గరకు వెళ్లి చూశాడు. అందులో నీళ్లు లేకపోవడంతో ఆలోచనలో పడ్డాడు. ఇదంతా కాస్త దూరం నుంచి జోగులు గమనించాడు. అతడు ఆ గుడి ముందు అరటిపండ్లు, కొబ్బరికాయలు, పువ్వులు అమ్ముతుంటాడు. పాపన్న దగ్గరకు వెళ్లి.. ‘ఏం కావాలి నీకు? ఎందుకలా బావిని పరీక్షగా చూస్తున్నావు?’ అని అడిగాడు పాపన్న గురించి తెలిసి కూడా! ‘నేను చనిపోవాలనుకుంటున్నాను’ అన్నాడు పాపన్న. ‘ఏ.. ఎందుకు?’ ఆతృతగా అడిగాడు జోగులు.

‘నన్ను అందరూ చీదరించుకుంటున్నారు. నేను ఎందుకూ పనికి రానివాడినంటున్నారు. తినడానికి నాలుగు మెతుకులు కూడా దొరకడం లేదు. అలాంటప్పుడు బతికి ఏం లాభం?’ అన్నాడు. ‘ఓహో.. అయితే నీ నిర్ణయం మంచిదే. కానీ ఈ రోజు సాయంకాలం వరకు వర్జ్యంతోపాటు యమగండం కూడా ఉందంట. శాస్త్రిగారు ఎవరికో చెబుతుంటే విన్నాను. ఈ వేళలో ఏ పని చేసినా సవ్యంగా జరగదంట. ఈ సమయంలో చనిపోతే ఏ దెయ్యంగానో, భూతంగానో మారిపోతారంట. నువ్వు ఎలాగూ చనిపోవాలనుకుంటున్నావు.. కాబట్టి నాకు ఒక సాయం చేసి కాస్త పుణ్యం కట్టుకో’ అన్నాడు. ఏమిటది? అడిగాడు పాపన్న. ‘ఈ దినం ఎండ ప్రభావం తీవ్రంగా ఉంది. అమ్మకం నా చేత కావడం లేదు. అమ్మకపోతేనేమో ఇల్లు గడవదు. నేను ఆ అరుగు మీద విశ్రాంతి తీసుకుంటాను. నువ్వు కాస్త ఈ సరకులు అమ్మిపెట్టు’ అన్నాడు.

పాపన్నకు జాలి పుట్టి అమ్మకం ప్రారంభించాడు. సాయంత్రం అయ్యే సరికల్లా సరకు అమ్ముడుపోయి బోలెడన్ని డబ్బులు వచ్చాయి. వాటిని కళ్లజూడగానే పాపన్నకు కళ్లు చెదిరాయి. జోగులు ఇచ్చే ధనంతో కడుపు నింపుకోవచ్చు. అప్పుడు గానీ ఈ ఆకలి మంట తీరదు’ అనుకుని జోగులు ఇవ్వాల్సిన డబ్బుల గురించి ఆశగా ఎదురు చూశాడు.

జోగులు డబ్బంతా మూటగట్టుకొని ‘చాలా సంతోషం నాయనా! సాయంత్రం కావొచ్చింది. వర్జ్యం, యమగండం పోయింది. ఇక నువ్వు నిశ్చింతగా నీ ప్రయత్నం కొనసాగించుకోవచ్చు’ అని బయలుదేరబోయాడు. ఈ మాటలకు పాపన్న తెగ ఆశ్చర్యపోయాడు. కాస్త బాధగా కూడా అనిపించింది. ‘అదేమిటి... ఆ ఎండలో అంత కష్టపడి మరీ బేరాలు చూశాను. తిండి లేక కళ్లు సైతం తిరుగుతున్నాయి. చూడు ఒళ్లంతా ఎలా కందిపోయిందో. నాకు కొంత ధనం ఇవ్వాలి కదా’ అన్నాడు.

‘అలా అని ఒప్పందం కుదరలేదు కదా’ అని జోగులు అన్నాడు. ‘అయితే ఈ విషయం గ్రామపెద్ద దగ్గర తేల్చుకుందాం’ అని వెళ్లారు. గ్రామపెద్ద విచారించాడు. కొంత డబ్బు జోగులు పాపన్నకు ఇవ్వాల్సిందే అని చెప్పాడు. ‘కొంతేం.. అవసరమైతే మొత్తం ధనం ఇచ్చేస్తా. పాపన్నను ఒక చిన్న దుకాణం పెట్టుకొని దర్జాగా బతకమనండి’ అని జోగులు అన్నాడు.

జోగులు చెప్పింది సబబుగానే ఉందని.. పాపన్న అలాగే చేయాలని గ్రామపెద్ద తీర్పు ఇచ్చాడు. దీంతో పాపన్న ఓ చిన్న దుకాణం పెట్టుకున్నాడు. కష్టపడి పని చేసుకుంటూ జీవితంలో స్థిరపడ్డాడు. ఏ ఊరి జనమైతే చీదరించుకున్నారో.. వాళ్లే పాపన్నను చాలా మెచ్చుకున్నారు.

- ఆరుపల్లి గోవిందరాజులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని