మార్పు మంచిది కాదు!

అది ఒక అడవి. సింహం దానికి రాజు. అయితే అది అన్ని సింహాల వంటిది కాదు. అడవిలోని అన్ని జంతువులతో స్నేహంగా ఉండేది. కనిపించిన జంతువునల్లా వేటాడి తినకుండా తన ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే వేటాడేది. అయినా సింహం సింహమే కదా. అడవిలో జంతువులన్నీ అదంటే భయపడి పారిపోయేవి.

Updated : 04 Aug 2021 05:48 IST

ది ఒక అడవి. సింహం దానికి రాజు. అయితే అది అన్ని సింహాల వంటిది కాదు. అడవిలోని అన్ని జంతువులతో స్నేహంగా ఉండేది. కనిపించిన జంతువునల్లా వేటాడి తినకుండా తన ఆకలి తీర్చుకోవడానికి మాత్రమే వేటాడేది. అయినా సింహం సింహమే కదా. అడవిలో జంతువులన్నీ అదంటే భయపడి పారిపోయేవి.

అందుకే సింహానికి, చెంగుచెంగున పరిగెత్తే లేడిని చూసినా, చెట్ల కొమ్మల మీద కొమ్మచ్చిలాడే కోతులను చూసినా, స్వేచ్ఛగా ఎగిరే పక్షులను చూసినా, తెల్లగా ముద్దుగా అందంగా ఉండి మిగతా అన్ని జంతువులు గారంగా చూసే కుందేలును చూసినా ఎంతో అసూయగా ఉండేది. అవన్నీ హాయిగా తిరుగుతూ స్నేహంగా ఉంటున్నాయి. మరి తానేమో గుహలో ఒంటరిగా ఉండాలి. పోనీ వాటితో కలుద్దాం అంటే తనను చూస్తేనే జంతువులన్నీ దూరంగా పారిపోతున్నాయని బాధపడింది సింహం.  

ఓ రోజు ఆ అడవికి ఓ ముని తపస్సు చేసుకోవడానికి వచ్చాడు. ఆయన రోజూ అడవిలోని జంతువులన్నింటి తోటి కాసేపు మాట్లాడేవాడు. సింహం ఆయన దగ్గరకు వెళ్లి ‘స్వామీ.. నాది ఒక కోరిక తీర్చగలరా..’ అంటూ అడిగింది. ‘చెప్పు’ అన్నారాయన. ‘నాకు ఇలా సింహంలా ఉండాలని లేదు. హాయిగా స్వేచ్ఛగా అందరితో కలసి మెలసి తిరిగే ఆ కుందేలుగా మారిపోవాలని ఉంది. నన్నలా మారుస్తారా స్వామీ..’ అని అడిగింది.

‘నువ్వు అడవి అంతటికీ రాజువు.. మృగరాజువు. అలాంటిది ఓ చిన్నదైన పిరికి కుందేలుగా మారిపోవాలి అనుకుంటున్నావా? మనుషులు సైతం సింహంలా బతకాలి అని కోరుకుంటారు. మరి నువ్వు ఇలా ఓ అల్పప్రాణిగా మారాలి అనుకుంటున్నావు. ఎందుకు?’ అని అడిగాడు ఆ ముని.

‘లేదు స్వామీ.. నాకిలా మృగరాజులా కాకుండా, అలా చెంగుచెంగున గెంతే ఆ చిన్న కుందేలులా బతకాలని ఉంది’ అంది సింహం. ‘సరే అయితే.. కుందేలుగా మారుస్తాను’ అని వెంటనే మంత్రించిన జలం సింహం మీద చల్లాడు ఆ ముని. సింహం కుందేలుగా మారిపోయింది. తెల్లగా.. ముద్దుగా.. పెద్ద పెద్ద చెవులతో, చిన్న చిన్న నల్లని కళ్లతో అటూ ఇటూ పరిగెడుతూ, ఆ ముని ఆశ్రమం చుట్టూ గంతులేస్తూ కుందేళ్లు, ఇతర జంతువులతో ఆటలాడుకుంటూ సంతోషించింది.

కుందేలుగా మారిన సింహం.. సాయంత్రం వరకూ తిరిగి తిరిగి అలసి పోయి దొరికిన ఆహారాన్ని తిని హాయిగా సేద తీరింది. ఈలోగా వేటగాళ్లు వస్తున్నట్లుగా అలికిడి కావడంతో మిగతా జంతువులన్నీ తలో దిక్కుకు పారిపోయాయి. ఎలా పారిపోవాలో తెలియని కుందేలు మాత్రం వేటగాళ్లకు దొరికిపోయింది. దాని రెండు చెవులూ పట్టుకొని లేపాడు ఒక వేటగాడు. ‘భలేగున్నావ్‌! ఈ రోజు నాకు పండగే’ అంటూ దాన్ని భుజానికున్న సంచిలో వేసుకుని ముందుకు నడిచాడు.

ఇంతలో మరో జంతువు కనబడడంతో దాన్ని వేటాడటం కోసం భుజానికున్న సంచిని కిందకు దించాడు. ఇదే అదనుగా కుందేలు సంచిలోంచి ఒక్క దూకు దూకి పారిపోయింది. వెంటనే ముని దగ్గరకు వెళ్లింది. ఆయన కాళ్లమీద పడి తను ప్రాణభయంతో ఎలా గిజగిజలాడిందో చెప్పింది. తనను ముందులాగే సింహంగా మార్చేయమని వేడుకుంది.

‘ఇప్పటికైనా అర్థమైందా? ప్రకృతి ప్రతి జీవికీ కొన్ని లక్షణాలను ఇస్తుంది. అలా కాదని వేరొకరిలా ఉండాలి అనుకుంటే ఇలాగే జరుగుతుంది. ఇక ముందునుంచైనా నువ్వు నీలాగే ఉండు. వేరొకరిలా మారాలని ప్రయత్నించకు..’ అంటూ మంత్రజలం కుందేలు మీద చల్లాడు. అది సింహంగా మారి గర్జిస్తూ తన గుహలోకి వెళ్లిపోయింది.

- గంటి ఉషాబాల ‘


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు