చిట్టి చేతులు.. పెద్ద మనసులు!

బాలు అయిదో తరగతి చదువుతున్నాడు. టీచరు పద్యం చదివి.. ‘ఇతరులకు సాయం చేయడంలోనే మనిషి గొప్పతనముంది. పరోపకారం గొప్ప గుణం..’ అంటూ ఆసక్తిగా పాఠం చెబుతున్నారు. ఎంత విందామని ప్రయత్నించినా బాలు ఆలోచనలు మాత్రం ఉదయం తాను చూసిన అబ్బాయి చుట్టూనే తిరుగుతున్నాయి.

Published : 05 Aug 2021 06:13 IST

బాలు అయిదో తరగతి చదువుతున్నాడు. టీచరు పద్యం చదివి.. ‘ఇతరులకు సాయం చేయడంలోనే మనిషి గొప్పతనముంది. పరోపకారం గొప్ప గుణం..’ అంటూ ఆసక్తిగా పాఠం చెబుతున్నారు. ఎంత విందామని ప్రయత్నించినా బాలు ఆలోచనలు మాత్రం ఉదయం తాను చూసిన అబ్బాయి చుట్టూనే తిరుగుతున్నాయి.

అతని ఒంటి మీద చొక్కా కూడా లేదు. కళ్లు లోతుగా ఉండి మొహం చాలా నీరసంగా ఉంది. టీచరు చెప్పింది నిజమే. ఇతరులకు సాయం చేయడమే గొప్ప గుణం. పాపం.. ఆ అబ్బాయి తాను బడికి నడిచొస్తుంటే వెనకాలే నడుస్తూ వచ్చి బడి బయటే ఆగిపోయాడు. అక్కణ్నుంచే తనకు కనిపిస్తున్న మిగతా పిల్లలవైపు చూస్తూ అలాగే ఉండిపోయాడు. పాపం తనకూ చదువుకోవాలనుందేమో.. మరి బళ్లో ఎందుకని చేరలేదో.. ఇలా ఆలోచనలు సాగుతుండగా బెల్‌ మోగింది.

లంచ్‌బాక్స్‌ తీసుకుని స్నేహితుడు రవితో కలిసి భోజనం తినడం ప్రారంభించాడు. ఎంత తిందామని చూసినా ఆ అబ్బాయి ముఖమే గుర్తొస్తోంది. కడుపు వీపును అంటిపెట్టుకుని ఎంత లోతుగా ఉందో.. ఎన్నాళ్లయిందో పాపం ఆ అబ్బాయి భోజనం చేసి. మనసుకు బాధగా అనిపించి ఓ కప్పు తిని మరో కప్పు భోజనం తినకుండా వదిలేశాడు. ‘బాలూ..! ఒంట్లో బాలేదా? సరిగా తినలేదేం?’ అని రవి అడిగాడు. తాను చూసిన బాబు విషయం చెప్పాడు బాలు.

‘సరే..! ఇంకా బయట వున్నాడేమో చూద్దాం..’ అంటూ ఇద్దరూ స్కూలు గేటు వైపు నడిచారు. ఆ అబ్బాయి గేటు బయట దూరంగా ఉన్నాడు. బాలు వెంటనే గేటు బయటకు వెళ్లి ‘తమ్ముడూ!’ అంటూ కేకేశాడు. ఆ పిలుపునకు ఆ అబ్బాయి తలపైకెత్తి ఆనందంతో పరుగెత్తుకుంటూ వచ్చాడు. ‘నీ పేరేంటి? నువ్వు చదువుకోవా?’ అని అడిగాడు బాలు. నా పేరు చక్రి. ఈ పేరు ఎవరు పెట్టారో కూడా నాకు తెలియదు. గుడి మెట్ల దగ్గర ఉన్న తాతయ్య నన్ను ఇలాగే పిలుస్తాడు’ బాధగా చెప్పాడు.

‘అదేంటి? నీకు అమ్మానాన్న ఎవరూ లేరా?’ అని బాలు వేసిన ప్రశ్న విని చక్రి కన్నీళ్లు పెట్టుకుంటూ.. ‘నాకెవరూ లేరు. నాకు చదువంటే చాలా ఇష్టం’ అంటూ బాధగా తలదించుకున్నాడు. అతని పరిస్థితి తెలిసిన స్నేహితులిద్దరికీ చాలా బాధ వేసింది. ‘మరి నీ భోజనం?’ రవి అడిగాడు.

‘మొన్నటి దాకా గుడి దగ్గర ఉన్న తాతయ్య తాను తినేదాంట్లో నాక్కొంచెం మిగిల్చి పెట్టేవాడు. ఇప్పుడతనూ లేడు. చనిపోయాడు’ అని చెప్పాడు. ‘అయ్యో! అంటూ పరిగెత్తుకుంటూ లోనికి వెళ్లి  తన లంచ్‌బాక్స్‌ తెచ్చి చక్రికి ఇచ్చాడు బాలు. తాను వదిలేసిన కప్పులోని అన్నాన్ని ఆతృతగా తిన్నాడు. అతని పరిస్థితిని చూసిన ఇద్దరు స్నేహితులూ అతనికి ఏదైనా చేయాలని గట్టిగా అనుకున్నారు. వెళ్లి తెలుగు టీచరుతో అతని గురించి చెప్పి.. ‘టీచర్‌.. అతనికి మనమేమన్నా సాయం చేయలేమా?’ అంటూ అమాయకంగా అడిగారు.
వారి సహకార గుణాన్ని మెచ్చుకుంటూ ఆమె ఆ ఇద్దరితోపాటు చక్రిని కూడా తీసుకొని ప్రిన్సిపల్‌ను కలిశారు. చక్రి నిస్సహాయ పరిస్థితిని విన్న ప్రిన్సిపల్‌ తనకు తెలిసినవారు నడుపుతున్న ఒక పిల్లల సంరక్షణ కేంద్రంలో పిల్లవాణ్ని చేర్పించడానికి అక్కడికక్కడే ఫోనులో మాట్లాడి ఏర్పాట్లు చేశారు. ‘చక్రీ.. నువ్వు రేపటి నుంచి ఇదే బళ్లో ఈ పిల్లలతోనే కలిసి చదువుకుంటున్నావు’ అంటూ అతని పేరును రిజిస్టరులో నమోదు చేశారు. అది విన్న చక్రి, ప్రిన్సిపల్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.

ఇంతమంచి చేసిన బాలు, రవిని ప్రిన్సిపల్‌ ఎంతగానో మెచ్చుకున్నారు. అంతేకాదు వారిద్దరి తల్లిదండ్రులను కూడా పాఠశాలకు ఆహ్వానించి ఒక ప్రత్యేక కార్యక్రమంలో సత్కరించారు. ‘మన విద్య పుస్తకాలతో ఆగిపోకూడదు. దాన్ని ఆచరణలో చూపాలి. అప్పుడే మన చదువు సార్థకమవుతుంది’ అంటూ బాలు, రవిని అభినందించారు.

- ఆదిత్య పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని