అందరి కోసం ఒక్కడు..!

మాధవుడు ఒక అనాథ. పగలంతా.. ఊళ్లోవాళ్లు ఏ పని చెప్పినా విసుక్కోకుండా చేసేవాడు. వారిచ్చిన తృణమో ఫణమో తీసుకునేవాడు. ఎవరేది పెట్టినా.. తిని, ఊరి బయట పాడుబడిన గుడి ముందర ఉన్న అరుగు మీద పడుకునేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉంది. ఉన్నట్లుండి ఊరిలో అంటువ్యాధి ఒకటి ప్రబలింది. మనిషిని చూసి, మరో మనిషి భయపడి దూరంగా వెళ్లిపోయేంతగా ఉంది పరిస్థితి.

Updated : 07 Aug 2021 06:22 IST

మాధవుడు ఒక అనాథ. పగలంతా.. ఊళ్లోవాళ్లు ఏ పని చెప్పినా విసుక్కోకుండా చేసేవాడు. వారిచ్చిన తృణమో ఫణమో తీసుకునేవాడు. ఎవరేది పెట్టినా.. తిని, ఊరి బయట పాడుబడిన గుడి ముందర ఉన్న అరుగు మీద పడుకునేవాడు. ఇలా కాలం గడుస్తూ ఉంది. ఉన్నట్లుండి ఊరిలో అంటువ్యాధి ఒకటి ప్రబలింది. మనిషిని చూసి, మరో మనిషి భయపడి దూరంగా వెళ్లిపోయేంతగా ఉంది పరిస్థితి.

అలాంటి విపత్కర సమయంలో వ్యాధి సోకిన వారిని పక్క గ్రామంలో ఉన్న వైద్యుడి దగ్గరకు ఎవరు తీసుకుపోతారు? ఆ సమయంలో మాధవుడు ధైర్యంగా ముందుకొచ్చాడు.

కొందరు అతనితో ‘ఏంటీ నీ ధైర్యం.. అది అంటువ్యాధి. సోకిందంటే అంతే సంగతులు’ అంటూ భయపెట్టారు. దానికి మాధవుడు ‘ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఎట్లా? సాటి మనిషి ఆపదలో ఉంటే అసహ్యించుకుని మొహం చాటేస్తామా? రేపు మన పరిస్థితి ఇదే అయితే..? మన జాగ్రత్తలో మనం ఉంటూ రోగులకు వీలైనంత సేవ చేయాలి’ అంటూ గుర్రపు బండి నొకదాన్ని తీసుకుని ఊళ్లో అంటువ్యాధి సోకిన వారిని ఒక్కొక్కరిని పక్క గ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయించాడు.

పక్క గ్రామంలోని ఆయుర్వేద వైద్యుడు తన దగ్గరకు తీసుకువచ్చిన రోగులందరికీ నయం చేశాడు. మాధవుడు ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు.

‘నాకెందుకు కృతజ్ఞతలు! నువ్వు ధైర్యంగా రోగులను తీసుకువచ్చావు కాబట్టి నేను వైద్యం చేయగలిగాను. లేకపోతే చేయలేను కదా! నిజానికి నీకే ఆ గ్రామస్థులంతా రుణపడి ఉన్నారు’ అన్నాడు.

తగ్గినట్లే తగ్గి కొద్ది రోజుల వ్యవధిలోనే ఆ వ్యాధి తిరగబెట్టింది. ఈసారి అది మాధవుడికి సోకింది. ‘చెబితే విన్నాడు కాదు. తనకు మాలిన ధర్మం.. పనికిరాదని పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడిక మాధవుడికి దిక్కెవరు?’ అంటూ కొందరు పెదవి విరిచారు.

‘మాధవుడు ఏ స్వార్థమూ లేకుండా గ్రామస్థులందరికీ సేవ చేశాడు. ఇప్పుడు మనం చేయాల్సింది విమర్శించడం కాదు. అతణ్ని కాపాడుకోవడం మన తక్షణ కర్తవ్యం. ప్రమాదాలు ఎప్పుడూ పొంచే ఉంటాయి. వాటికి భయపడి సాటిమనిషికి సేవ చేయకపోతే ఎలా?’ అని కొందరు యువకులు ఊరివారికి హితవు చెప్పారు. విమర్శించినవారు పశ్చాత్తాప పడ్డారు. చివరకు ఊరి వారందరూ ఒక్కటయ్యారు.

గుడి ముందు అరుగు మీద నీరసంగా పడి ఉన్న మాధవుణ్ని గుర్రపు బండి మీద పక్క గ్రామంలో ఉన్న వైద్యుడి వద్దకు తీసుకుపోయారు. ఎలా అయినా.. ఎంత ఖర్చైనా సరే వ్యాధి నయం చేయాలని కోరారు. వైద్యుడు తన శాయశక్తులా శ్రమించి మాధవుడికి నయం చేశాడు. గ్రామస్థులు ఆయనకు కృతజ్ఞతలు చెప్పి, ధనం ఇవ్వబోయారు. ఆయన దాన్ని తిరస్కరిస్తూ.. ‘మీ దగ్గర ధనం తీసుకోవాలనిపించడం లేదు.

ఎందుకంటే అందరి కోసం ఒక్కడు కష్టపడ్డాడు. మీరు దాన్ని మరిచిపోక అందరూ అతని కోసం ఆవేదన చెందారు. అతణ్ని ఆదుకున్నారు. నాకు ఈ విషయం ఎంతగానో నచ్చింది. అన్ని గ్రామాల్లో ఇలాంటి వాతావరణమే ఉంటే ఎంతో బాగుంటుంది’ అన్నాడు.

తర్వాత గ్రామస్థులు మాధవుడికి ఊర్లోనే చిన్న పాక ఒకటి వేసి ఇచ్చారు. వ్యవసాయం చేసుకొమ్మని కొంత పొలం కౌలుకు ఇచ్చారు. చక్కగా సాగు చేసుకుంటూ జీవితంలో స్థిరపడ్డాడు. అది చూసి అతనికి తన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఓ రైతు ముందుకొచ్చాడు. కష్టించి పనిచేస్తూ ఆ ఊళ్లో పెద్ద రైతుగా మారాడు మాధవుడు.

- గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని