పిసినారి చేసిన సాయం!

చందాపురం అనే ఊళ్లో చంద్రయ్య, శీనయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు. చంద్రయ్య వ్యాపారస్థుడు. శీనయ్య వ్యవసాయదారుడు. చంద్రయ్యకు  పిసినారి అని పేరు.

Updated : 09 Aug 2021 01:06 IST

చందాపురం అనే ఊళ్లో చంద్రయ్య, శీనయ్య అనే ఇద్దరు స్నేహితులుండేవారు. చంద్రయ్య వ్యాపారస్థుడు. శీనయ్య వ్యవసాయదారుడు. చంద్రయ్యకు  పిసినారి అని పేరు. తన సొమ్మును వృథాగా పోగొట్టుకునేవాడు కాదు. పరులను ఏదీ ఆశించడు. ఎవరినీ పట్టించుకోడు. శీనయ్య కష్టపడి పనిచేస్తాడు. కానీ వచ్చిన సొమ్మును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేసేవాడు.

ఊళ్లో చంద్రయ్యను పిసినారి అని తెగ ఆడిపోసుకుంటారు. ‘మనిషన్నాక ప్రేమ, కరుణ, జాలి, దయ కాస్తయినా ఉండాలి. మరీ అంత పట్టుబడితే ఎలా’ అంటుండేవాడు శీనయ్య. చంద్రయ్య మాత్రం నవ్వి ఊరుకునేవాడు. ఊళ్లో కొంతమంది ‘పోయేటప్పుడు ఏం తీసుకుపోదామని ఇంత పట్టుదలగా ఉన్నావు, ఇలా ఉన్నావ్‌ కాబట్టే నిన్ను ఎవరూ పట్టించుకోరు. శీనయ్యను చూడు ఎంత పేరు సంపాదించాడో! తనకు ఉన్నదాంట్లో కొంతయినా ఖర్చు చేస్తాడు. నువ్వు ఎప్పుడు మారతావో ఏమో!’ అని అంటుండేవారు. అలా అన్నా కూడా బదులు మాట్లాడేవాడు కాదు చంద్రయ్య.

‘ఇంతమంది ఇన్ని రకాలుగా నిన్ను అంటున్నా కూడా ఎందుకు భరిస్తున్నావు. ఇప్పటికైనా నీ పిసినారితనాన్ని మానుకోవచ్చు కదా!’ అంటుండేవాడు శీనయ్య. అయినా చంద్రయ్యలో మార్పు వచ్చేది కాదు. అయితే ఊళ్లో ఏ కార్యక్రమం జరిగినా ముందుండి బాగా ఖర్చు పెట్టి నడిపేవాడు కాబట్టి శీనయ్యను అందరూ బాగా మెచ్చుకునేవాళ్లు.

కొన్ని రోజులు పోయాక అంతటా కరవు వచ్చింది. వర్షాలు పడలేదు, పంటలు పండలేదు. ఒకరోజు శీనయ్య తన స్నేహితుడు చంద్రయ్యను కలిశాడు. ‘ఈ ఏడాది పంటలు పండలేదు. చేతిలో చిల్లి గవ్వ లేదు. రేపు మా ఇంటికి చుట్టాలు వస్తారు. ఇంతకు ముందు బాగా ఉన్నతంగా కనిపించాను. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవని తెలిస్తే పరువు పోతుంది. అందుకే అప్పుగా అయిదు వేలు కావాలి చంద్రయ్య. పదిరోజుల్లోగా తిరిగి చెల్లిస్తాను’ అని అడిగాడు శీనయ్య.

చిన్ననాటి స్నేహితుడు కాబట్టి తన బాధను అర్థం చేసుకుంటాడనుకున్నాడు. ‘ఇప్పుడు నా దగ్గర అంత సొమ్ము లేదు. కరవు నీకే కాదు నాక్కూడా వచ్చింది. వ్యాపారం జరగక సంపాదన లేదు’ అంటూ ఒక బుట్టెడు గింజలు ఇచ్చి తీసుకుని పొమ్మన్నాడు. ‘నీ దగ్గర ధనం లేదంటే ఎవరూ నమ్మరు. స్నేహితుడివి అయ్యుండి కూడా సహాయం చేయడానికి వెనకాడుతున్నావు. నీ స్నేహం నాకు వద్దు’ అంటూ ధాన్యం అక్కడే వదిలేసి వెళ్లి పోయాడు శీనయ్య. తనకు చంద్రయ్య ప్రాణ స్నేహితుడైనా సరే సహాయం చేయలేదని అందరితో చెప్పుకున్నాడు.

కొద్దిరోజులు పోయాక శీనయ్య ఆరోగ్యం దెబ్బతింది. పాతిక వేలు పెట్టుకుంటే కానీ ఆరోగ్యం కుదుటపడదని, ఆలస్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదమని వైద్యుడు చెప్పడంతో చాలా భయపడ్డాడు శీనయ్య. తెలిసిన వాళ్లందరినీ అడిగి చూశాడు. ఎవరూ పైసా కూడా ఇవ్వలేదు.  

విషయం చంద్రయ్యకు తెలిసి స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. శీనయ్య మంచంపైన పడుకుని బాధపడుతున్నాడు. వెంట తెచ్చిన  ధనం శీనయ్య చేతిలో పెట్టాడు. ఆశ్చర్యపోయాడు శీనయ్య.  ‘నేను పిసినారినే అని ఒప్పుకొంటున్నాను. కానీ జనాలు ఊహించినంత అయితే కాదు. సహాయం చేసే గుణం నాలో కూడా ఉంది. కానీ చేసే సహాయం విలువైనదిగా ఉండాలి. అవసరం లేని దానికి ధనం ఖర్చు చేయడం వల్ల ప్రయోజనం లేదు. ఆరోజు నువ్వు నా దగ్గరకు వచ్చినప్పుడు నీ అవసరానికి ధాన్యం ఇచ్చాను. ధనం ఇచ్చి ఉంటే విలాసానికి ఖర్చు చేసేవాడివి. ముందు చూపు కూడా అవసరమే కదా శీనయ్యా!’ అన్నాడు చంద్రయ్య. మిత్రుడికి రెండు చేతులు జోడించి మొక్కాడు శీనయ్య.

- నరెద్దుల రాజారెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని