కోనేరు తల్లికి కోటి దండాలు!

తాతయ్య, అమ్మమ్మలున్నప్పుడు కోటిబాబు తన బాల్యంలో కోనేటివాడకు తరచూ వెళ్లేవాడు. ఆ తర్వాత వెళ్లే అవకాశం రాలేదు. ఊరినోసారి చూడాలని కోరిక ఉన్నా.. అమెరికాలో ఉద్యోగం వల్ల అది తీరలేదు.

Published : 11 Aug 2021 04:31 IST

తాతయ్య, అమ్మమ్మలున్నప్పుడు కోటిబాబు తన బాల్యంలో కోనేటివాడకు తరచూ వెళ్లేవాడు. ఆ తర్వాత వెళ్లే అవకాశం రాలేదు. ఊరినోసారి చూడాలని కోరిక ఉన్నా.. అమెరికాలో ఉద్యోగం వల్ల అది తీరలేదు. కోనేటివాడ కోనేరు, అందులో విచ్చుకునే తామరపూలు, ఎగిరిపడే చేపలు, బాతులు, కొంగలు, లకుముకి పిట్టలు, గట్లు, గట్లమీద ఉడుతలు భలే ఉండేవి.

ఆ మధ్య పనిబడి రెండుసార్లు అమెరికా నుంచి స్వదేశం వచ్చినా కోనేటివాడ చూడటానికి వీలు చిక్కలేదు. ఆ అవకాశం మళ్లీ వచ్చినప్పుడు కోటిబాబు పట్టు వదలలేదు. నగరంలో పని పూర్తి చేసుకుని ఒకరోజు వేకువజామునే బాడుగ కారులో కోనేటివాడకు బయలుదేరాడు. ఉదయం వేళ కోనేరు పరిసరాలు, పల్లె సందడులు చూడాలని అతడి కోరిక.

కారు కోనేటివాడ పరిసరాలకు చేరింది. గట్ల మీద చెట్లు కనిపించలేదు. దారి వెంబడి పచ్చని పొలాలు లేవు. నిరాశగా కోటిబాబు కారు దిగాడు. రేవు మెట్లు పాడైపోయి ఉన్నాయి. ఎక్కడా నీటి చుక్కలేదు. బాధగా ఊళ్లో అడుగు పెట్టాడు.

పెద్దవాళ్లు కొందరు ‘ఎవరు బాబూ నువ్వు..!’ అని అడిగారు. రామ్మూర్తిగారి మనవడిని అని తనను తాను పరిచయం చేసుకున్నాడు. పెద్దవాళ్లంతా కోటిబాబు చుట్టూ చేరారు. ఆ ఊరి కోనేరును కోటిబాబు ముత్తాత విశ్వనాథం తవ్వించారు. ఆ కోనేరు వల్లే ఆ ఊరికి కోనేటివాడ అనే పేరు వచ్చింది.

కోనేరు ఎందుకు పాడైందని కోటిబాబు అడిగాడు. ‘నాయనా..! వినాశకాలే విపరీత బుద్ధి.. అంటారు కదా.. అదే జరిగింది. ఊరిలో కుళాయిలు వేశారని కోనేరును అశ్రద్ధ చేశారు జనం. ఇక మాకు కోనేరుతో ఏం పని అని వర్షాకాలంలో ఊరవతల నుంచి వెళ్లే వాగు ప్రవాహాన్ని కోనేరులోకి తిప్పడం మానేశారు. వర్షం నీరే కోనేరుకు ఆధారమైంది. వానాకాలం పోగానే ఆ నీరు ఇంకిపోయేది. దిగువున పొలాలున్న రైతులు కూడా శ్రద్ధ తీసుకోలేదు. రెండుమూడేళ్లు వర్షాలు పడకపోయేసరికి ఏకంగా వ్యవసాయమే వదిలేసి కూలిపనులకు పట్నం పోవడం ప్రారంభించారు. ఇదేమి ఖర్మో.. ఊళ్లో బావులెండిపోయాయి. ఒకప్పుడు చెట్లతో పచ్చగా.. చల్లగా ఉండే ఊరు ఇప్పుడు కళ తప్పింది’ అని తన మనసులోని బాధనంతా ఓ ముసలాయన ఏకరవు పెట్టాడు.

ఆ రోజు రాత్రి ఊళ్లోనే కోటిబాబు ఉండిపోయాడు. ఆ రాత్రి గ్రామస్థులందరినీ ఆ వృద్ధుడు సమావేశపరిచాడు. ఊరికి పూర్వవైభవం తెద్దామన్నాడు కోటిబాబు. ‘ఎలా?’ అని కొందరు అడిగారు. ‘కోనేరు పూర్వంలా తయారు చేసుకుంటే అన్ని పరిస్థితులు చక్కబడతాయి. కోనేరులో నీరుంటే చుట్టుపక్కల నేలలో చెమ్మదనం ఉంటుంది. ఒక్కోసారి వర్షాలు పడకపోయినా కోనేరు నీటిని వాడుకోవచ్చు. గట్లు శుభ్రం చేసి చెట్లు పెంచండి. కోనేరులో నీరు, గట్టు మీద చెట్లు ఉంటే పురుగులు, కీటకాలు, వానపాములు చేరతాయి. వాటిని తినడానికి పక్షులు వస్తాయి. అవీ.. ఇవీ కలిసి వ్యవసాయానికి మేలు చేస్తాయి. అప్పుడు ఏ రైతూ పట్నం వలస వెళ్లాల్సిన అవసరమే రాదు. కోనేరు బాగు చెయ్యడానికి కావాల్సిన ధనం నేనిస్తాను. నా బాల్యంలో ఊరందించిన తీపి జ్ఞాపకాలకు రుణం తీర్చుకుంటాను’ అని గ్రామస్థులను సిద్ధం చేశాడు.

మర్నాటి నుంచే పనులు ప్రారంభమయ్యాయి. కోటిబాబు అమెరికా వెళ్లిన తర్వాత కూడా పట్టుదల వదల్లేేదు. కోనేటివాడకు డబ్బు పంపి.. కోనేరుకు పూర్వవైభవం తీసుకువచ్చాడు. కొన్నాళ్లకు కోనేటివాడ పూర్వంలాగే కళకళలాడసాగింది. పర్యావరణ పరిస్థితులు చక్కబడ్డాయి. వ్యవసాయానికి నీటి భరోసా కనిపించింది. ఊళ్లో బావులకు ఊటలేర్పడ్డాయి. కోనేరు చుట్టూ పచ్చిక పెరగడంతో పశుపోషణ, కోనేరులో నీరుండడం వల్ల చేపల పెంపకం సులభమైంది. రైతులకు అదనపు ఆదాయం ఇచ్చే వనరైంది కోనేరు. కోటిబాబు ఆశయం ఫలించింది. ప్రజలు ఊళ్లో వచ్చే మార్పునకు కోనేరే కారణం అని గ్రహించారు. అప్పటి నుంచి కోనేరు తల్లికి కోటి దండాలు అని దాన్ని పవిత్రంగా చూడసాగారు.

- బెలగాం భీమేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని