నీ పేరేంటి?

ఒక సోమరిపోతు కోతి.. వయసు వచ్చినా పనీపాటా లేకుండా తల్లి మీదే ఆధారపడేది. దానికి కష్టపడటం ఇష్టం ఉండేది కాదు. అది అన్ని జంతువులను పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి విసిగించేది. వాటి పేరు తెలిసి ఉండి కూడా కావాలని వాటిని ‘నీ పేరేంటి?’ అని అడిగేది.ఒక రోజు అది అడవిలో ఓ దారి గుండా వెళుతోంది. అప్పుడు ఏనుగు ఎదురైంది. దానికి అది ఏనుగు అని తెలిసినా, అది దాన్ని ‘నీ పేరేంటి?’ అని ప్రశ్నించింది. తనెవరో తెలిసినా.. కావాలనే కోతి ఇలా అడుగుతోంది అని ఏనుగుకు అర్థమైంది. అందుకే కాస్త గడుసుగా నా పేరు ‘పంచదార’ అని సమాధానం ఇచ్చింది.

Updated : 12 Aug 2021 00:49 IST

క సోమరిపోతు కోతి.. వయసు వచ్చినా పనీపాటా లేకుండా తల్లి మీదే ఆధారపడేది. దానికి కష్టపడటం ఇష్టం ఉండేది కాదు. అది అన్ని జంతువులను పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి విసిగించేది. వాటి పేరు తెలిసి ఉండి కూడా కావాలని వాటిని ‘నీ పేరేంటి?’ అని అడిగేది.

ఒక రోజు అది అడవిలో ఓ దారి గుండా వెళుతోంది. అప్పుడు ఏనుగు ఎదురైంది. దానికి అది ఏనుగు అని తెలిసినా, అది దాన్ని ‘నీ పేరేంటి?’ అని ప్రశ్నించింది. తనెవరో తెలిసినా.. కావాలనే కోతి ఇలా అడుగుతోంది అని ఏనుగుకు అర్థమైంది. అందుకే కాస్త గడుసుగా నా పేరు ‘పంచదార’ అని సమాధానం ఇచ్చింది. ‘ఓహో.. పంచదారనా! అయితే నువ్వు తియ్యగా ఉంటావన్నమాట. నీతో ఎంచక్కా మిఠాయిలు చేసుకుని తినొచ్చు’ అని నవ్వుతూ అంది. దాని మాటలు విని ఏనుగూ నవ్వుకుంది.

ఆ తర్వాత దానికి దారిలో ఓ బుజ్జి కుందేలు ఎదురైంది. అది కుందేలును కూడా ఏనుగును అడిగినట్లే.. ‘నీ పేరేంటి?’ అని అడిగింది. అప్పుడు కుందేలు కూడా ఈ కోతికి  తెలిసి ఉండి కూడా తన పేరు కావాలనే అడుగుతోందని భావించి తన పేరు ‘బెల్లం’ అని చెప్పింది.

అప్పుడు కోతి.. ‘అయితే నువ్వు కూడా తియ్యగానే ఉంటావు’ అంది. తర్వాత దానికి ఒక ఒంటె ఎదురైంది. దాన్ని కూడా కోతి... ఏనుగు, కుందేలును అడిగినట్లే ‘నీ పేరేంటి?’ అని ప్రశ్నించింది. ఒంటె కూడా ఇది కావాలనే తనను ఇలా అడుగుతోందని అనుకుని.. ‘నా పేరు తేనె’ అని చెప్పింది. ‘మరి నీ తుట్టె ఎక్కడ?’ అని కోతి మళ్లీ అడిగింది ‘ఇదిగో! నా పైన ఉంది చూడు’ అని తన పైన ఎత్తుగా ఉన్న తన మూపురాన్ని చూపించింది ఒంటె.

‘ఓహో.. అయితే నువ్వు కూడా తియ్యటి దానివే’ అంటూ ముందుకు సాగింది కోతి. ఆ తర్వాత అది వీటన్నింటినీ అడిగినట్లే చెట్టుపైకి పాకుతున్న ఒక గండుచీమను కూడా ‘నీ పేరేంటి?’ అని అడిగింది. అప్పుడు అది ‘నా పేరు చీమ.. నీకు తెలియదా..’ అని సమాధానం చెప్పింది. ‘అయ్యో! నీ పేరు చీమనా! నువ్వు ఏదో లడ్డూ అనో.. జిలేబీ అనో.. ఇలా ఏదైనా మిఠాయి పేరు చెబుతావని అనుకున్నానే! నీ పేరు ఏం బాగాలేదు’ అని అంది.

చీమకు కోతి స్వభావం అర్థమైంది. ‘మరి నీ పేరేంటి?’ అని ఆ కోతిని ఎదురు ప్రశ్నించింది. అది తన పేరు కోతి అని కాకుండా.. గొప్పలకు పోయి ‘అమృతం’ అని చెప్పింది. వెంటనే ఆ చీమ దాని ఒంటి మీదకు పాకి.. దానికి గిలిగింతలు పెట్టసాగింది. ఆ కోతి దానికి తాళలేక నవ్వుతూ.. ‘నా పేరు అమృతం కాదు. కోతి.. కోతి’ అని అరిచింది. అప్పుడు చీమ ‘కాదు... నీ పేరు అమృతమే’ అని అంది.

చివరికి కోతి.. ‘నా పేరు నిజంగా కోతే. అమృతం కాదు. ఏదో గొప్పలకు పోయి అలా చెప్పాను. నన్ను క్షమించు చీమా! ఇకనైనా నాకు గిలిగింతలు పెట్టడం మానేయ్‌’ అని వేడుకుంది. అప్పుడు చీమ ‘ఏమీ పనీపాటా లేకుండా జులాయిగా తిరుగుతూ గొప్పలకు పోయి, దారిలో అందరినీ ప్రశ్నిస్తూ అమృతం నీ పేరని చెబుతావా! అసలు నువ్వు అమృతాన్ని చూశావా? లేక ఎవరైనా చెబితే విన్నావా? నేను నిన్ను కుట్టానంటే నువ్వు భరించలేవు. నా గిలిగింతలకే తట్టుకోలేకపోతున్నావు. ఇంకా మా దండు అంతా కదిలి వచ్చి నిన్ను కుడితే నీగతి ఏమవుతుందో ఆలోచించావా? ఇంత పెరిగినా నీకు బుద్ధి రాలేదు’ అని అంది చీమ. ఆ మాటలకు కోతి తనను క్షమించమని వేడుకుంది.

అప్పుడే అక్కడకు వచ్చిన ఒక ముసలి కోతికి ఆ చీమ జరిగిన సంగతంతా చెప్పింది. అప్పుడు ముసలి కోతి.. ఆ కోతి తన మిత్రుడి బిడ్డే అని తెలుసుకుంది. ‘నువ్వు సోమరిగా తిరగడమే తప్పైతే.. అందరి పేర్లు తెలిసి కూడా వాటిని మళ్లీ అడిగి ఆట పట్టించడం పెద్ద తప్పు. అంతేకాకుండా గొప్పలకు పోయి నీ పేరు అమృతం అని చెప్పడం ఇంకా తప్పు. ఇప్పటికైనా నువ్వు ఇటువంటి పనికిమాలిన ప్రశ్నలు వేయకుండా కాయకష్టం చేసుకుని జీవించు. కష్టపడి ఆహారాన్ని సంపాదించుకో!’ అని దానికి హితోపదేశం చేసింది.

అప్పుడు ఆ సోమరిపోతు కోతి.. ‘నీవన్నది నిజమే మావయ్యా! మీరిద్దరూ తగిన గుణపాఠం చెప్పారు. నాకు బుద్ధి వచ్చింది’ అని అంది. అప్పటి నుంచి అది కష్టపడి ఆహారాన్ని సంపాదించుకోసాగింది. త్వరలోనే మంచి పేరు తెచ్చుకుంది. ఇంకెప్పుడూ ఇతర జంతువులను పిచ్చిపిచ్చి ప్రశ్నలతో ఇబ్బంది పెట్టలేదు.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని