ఉడుత సాయం

ఒక కోతి తన స్నేహితులతో దాగుడు మూతల ఆట ఆడుతూ అడవి నుంచి చాలా దూరం వచ్చేసింది. వెనక్కి చూస్తే తన స్నేహితులెవ్వరూ కనబడలేదు. తాను అడవి నుంచి ఏదో పల్లెటూరికి వచ్చానని అప్పుడు గ్రహించింది.

Published : 21 Aug 2021 01:46 IST

క కోతి తన స్నేహితులతో దాగుడు మూతల ఆట ఆడుతూ అడవి నుంచి చాలా దూరం వచ్చేసింది. వెనక్కి చూస్తే తన స్నేహితులెవ్వరూ కనబడలేదు. తాను అడవి నుంచి ఏదో పల్లెటూరికి వచ్చానని అప్పుడు గ్రహించింది. అమ్మానాన్న, స్నేహితులు అందరికీ దూరమై పోయానని బాధ పడింది. ఆటలాడి అలసి పడిపోవడంతో ఆకలి కూడా వేస్తోంది. తినడానికి ఏమైనా దొరుకుతాయేమోనని చుట్టూ చూసింది. దగ్గరలో జామ చెట్టు కనిపించింది.. ప్రాణం లేచి వచ్చింది. ఆకలి తీర్చుకుని అడవిలోకి వెళ్లిపోవాలనుకుంది.

జామ చెట్టు దగ్గరకు వెళ్లేటంతలో రెండు వీధి కుక్కలు కోతి మీదకి దాడిచేశాయి. కోతికి భయం వేసింది. లేని ఓపికను కూడ దీసుకుని ఒక్క గెంతులో జామ చెట్టు మీదకు దూకింది. వీధి కుక్కలు చెట్టు కిందనే కోతి కోసం కాచుకుని ఉన్నాయి. భౌ..భౌ..మంటూ గట్టిగా మొరుగుతున్నాయి. ‘పొరపాటున కిందకి దిగితే మీ చేతిలో చచ్చేలా ఉన్నాను. చచ్చినా దిగకూడదు’ అని మనసులో అనుకుంది. కానీ నీరసం, ఆకలి ఎక్కువ అయ్యాయి. చెట్టు పైకొమ్మల మీద దోర జామ పండ్లున్నాయి. కానీ కోసుకుని తెచ్చుకునే ఓపిక లేదు. దాంతో కూర్చున్న కొమ్మకు జారబడి పోయింది. పై కొమ్మ మీదున్న ఒక ఉడుత కోతిని చూసి, జామ కాయలు తెచ్చి తినమంది.

కోతికి ‘కొత్తవారిని నమ్మరాద’ని అమ్మచెప్పిన మాట గుర్తుకొచ్చింది. అందుకే జామ కాయలను తీసుకోకుండా ఉడుత కేసి అనుమానంగా, భయంగా చూడసాగింది. అప్పుడు ఉడుత కోతితో.. ‘అదేంటి? నేనెవరో తెలియనట్టు చూస్తున్నావే?నా పేరు చిట్టి అని, నువ్వూ నేను కలసి ఈ జామ చెట్టుమీద ఉంటున్నామని మరచిపోయావా? రోజూ దిక్కులకేసి దూక్కుంటూ వెళ్లి అన్నీ మరచిపోతున్నావు. ఈ జామ పండు తిను.. ఆకలి తీరితే అన్నీ గుర్తు కొస్తాయి’ అంటూ జామపండును కోతి చేతికిచ్చింది. కోతి జామ పండు తీసుకుంటూ కిందకు చూసింది. కుక్కలు ఇంకా అక్కడే ఉన్నాయి. వాటిని చూసి ఉడుత ఇలా అంది. ‘పక్క వీధి కుక్క వస్తేనే తరిమి, తరిమి కొట్టే ఈ కుక్కలు, మరో జాతి జీవిని చూసి మొరగకుండా ఉంటాయా? అవి చెట్టు ఎక్క లేవని నీకు తెలుసుగా.. నువ్వు పండు తిని ఆకలి తీర్చుకో’ అంది. అప్పుడే కుక్కలు వెళ్లిపోయాయి.

కోతి ‘హమ్మయ్య’ అనుకుంది. నీరసం తగ్గింది. జామ పండు తినడంతో ఆకలి కూడా తగ్గింది. ఉడుత కేసి కృతజ్ఞతా పూర్వకంగా చూస్తూ ‘నేను అడవి నుంచి తప్పిపోయి వచ్చాను. నీ మిత్రుడును కాను. నన్ను నమ్ము! నువ్వు ఎవరిని చూసి ఎవరను కున్నావో?’ అంది. కోతి మాటలకు ఉడుత నవ్వింది. ‘నిజం చెబుతుంటే ఎందుకు నవ్వుతున్నావ్‌?’ అని కోతి ఆశ్చర్యపోతూ అడిగింది. ఉడుత, కోతి చేతికి మరో జామ పండు ఇస్తూ ‘నిన్ను చూడగానే అడవి నుంచి వచ్చావని అర్థమైంది. కుక్కలను చూసి భయపడినట్టే నన్ను కూడా అనుమానంగా చూశావు. అయితే ఆకలితో ఉన్నావు. నీ ఆకలి తీర్చడానికే నువ్వు నాకు తెలిసినట్టుగా నటించాను. ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అడవి నుంచి దారి తప్పి  ఇలా వచ్చాను. ఆ బాధ నాకు తెలుసు. అప్పుడు ఈ జామ చెట్టే నాకు దిక్కైంది. నా ఆకలి తీర్చింది. నాకు నీడ నిచ్చింది’ అని చెప్పింది. ఉడుత మాటలు విన్న కోతి ‘మిత్రమా! నీ మంచితనం నాకు తెలిసింది. ఆపదలో ఉన్న నాకు ధైర్యాన్ని కలిగించావు. ఆప్యాయంగా మాట్లాడావు. పండ్లు  ఇచ్చి ఆకలి తీర్చావు. చిట్టీ! నీ వాళ్ల దగ్గరకు నేను తీసుకు వెళతాను. నాతో పాటు అడవికి రా!’ అంది. ‘వద్దు మిత్రమా! నేను నీతో రాలేను. ఈ చెట్టుకు ప్రాణం ఉంది కానీ కదల లేదు. నాతో పాటు రాలేదు. అయితే పరోపకారానికి తరువులే గురువులు. చెట్టును వదలి నేను రాలేను!’ అంది ఉడుత. ఉడుత మాటలకు, మంచి గుణానికి కోతి మళ్లీ ఆశ్చర్యపోయింది.

‘తోటి జీవులు ఆపదలో ఉన్నప్పుడు,  చేతనైన సాయం చేయాలి. సాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఈ విషయాలు అడవిలోని వాళ్లందరికీ చెబుతాను. నీ సాయం నేనెప్పటికీ మరచి పోను’ అని ఉడుత కేసి ఆప్యాయంగా చూస్తూ అంది కోతి. ‘మరి నేను వెళ్లిరానా?’ అని ఉడుతను అడిగింది కోతి. ‘జాగ్రత్తగా వెళ్లు! వీలున్నప్పుడు మళ్లీ రా మిత్రమా!’ అంది ఉడుత నవ్వుతూ. ‘తప్పకుండా వస్తాను!’ అంటూ కోతి, చిట్టి ఉడుతకు వీడ్కోలు పలుకుతూ ముందుకు కదిలింది.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని