మనవడి మాట.. బంగారు బాట!

అప్పుడే బడి నుంచి వచ్చాడు సోము. లోనికి వస్తూనే పుస్తకాల సంచిని అక్కడ ఉన్న కుర్చీలో పెట్టి.. ‘నాయనమ్మా.. నాయనమ్మా..!’ అని అరిచాడు చుట్టూ వెదుకుతూ. వంటింట్లో ఉన్న సోమువాళ్ల నాయనమ్మ ఆ పిలుపు విని ‘వంటింట్లో ఉన్నానురా.. ఇలారా.. ఏమిటీ విషయం? ఇలా వచ్చి చెప్పు’ అంది మనవడి హడావుడికి తనలో తాను నవ్వుకుంటూ.. 

Published : 23 Aug 2021 00:52 IST

ప్పుడే బడి నుంచి వచ్చాడు సోము. లోనికి వస్తూనే పుస్తకాల సంచిని అక్కడ ఉన్న కుర్చీలో పెట్టి.. ‘నాయనమ్మా.. నాయనమ్మా..!’ అని అరిచాడు చుట్టూ వెదుకుతూ. వంటింట్లో ఉన్న సోమువాళ్ల నాయనమ్మ ఆ పిలుపు విని ‘వంటింట్లో ఉన్నానురా.. ఇలారా.. ఏమిటీ విషయం? ఇలా వచ్చి చెప్పు’ అంది మనవడి హడావుడికి తనలో తాను నవ్వుకుంటూ..

అరుపులకు కారణం ఏంటో అని కంగారుగా పరిగెత్తుకుంటూ వచ్చింది పెరట్లో మొక్కలకు నీళ్లు పోస్తున్న సోము వాళ్లమ్మ రాధ. ‘ఇక్కడేం చేస్తున్నావు నాయనమ్మా?’ అంటూ వంటింట్లోకి వచ్చాడు సోము. ‘నువ్వు బడి నుంచి ఆకలిగా వస్తావని రొట్టెలు చేస్తున్నానులే. ఇంతకీ విషయం ఏంటో చెప్పు’ అంది పెద్దావిడ పిండి కలుపుతూ.

‘నువ్విప్పుడు మందులు వేసుకోవాలి!’ అన్నాడు నాయనమ్మనే చూస్తూ.. ‘ఏం మందులు? అయినా నేనిప్పుడు మందులు వేసుకోవడం ఏంటిరా?’ అంది నవ్వుతూ. ‘ఉహూ.. వేసుకోవాలి. అంతే. నీ మందుల పెట్టె తీసుకురానా?’ అంటూ నాయనమ్మ పడగ్గదిలోకి పరుగెత్తబోయిన సోమును గట్టిగా పట్టుకుని ఆపింది రాధ.

‘నాయనమ్మ.. ఉదయం, రాత్రి మాత్రమే మందులు వేసుకుంటుంది. ఈ సమయంలో వేసుకునేవి లేవు. అయినా నీకు నాయనమ్మ మందుల సంగతి ఎందుకు?’ అంది కొడుకు వైపు చూస్తూ...

‘నాయనమ్మకు ఓ సంగతి చెప్పాలి’ అన్నాడు వాళ్లమ్మతో. మళ్లీ వెంటనే నాయనమ్మ వైపు తిరిగి.. ‘నాయనమ్మా! రాత్రి నువ్వు మందులు వేసుకునేటప్పుడు నాకు చెప్పు.. సరేనా?’ అన్నాడు. ‘సరే.. కానీ ఆ చెప్పేదేదో ఇప్పుడే చెప్పొచ్చుగా.. మీ అమ్మ కూడా వింటుంది’ అంది నాయనమ్మ లోలోన నవ్వుకుంటూ.

‘ఉహూ.. అప్పుడే చెప్తా..’ అంటూ స్నానానికి వెళ్లిపోయాడు. ఆ సాయంత్రం బయటకు వెళ్లి ఆడుకుంటూనే మధ్యమధ్యలో లోనికొచ్చి నాయనమ్మకు గుర్తు చేస్తూనే ఉన్నాడు మందుల సంగతి.

‘ఇప్పుడే కాదు.. అన్నం తిన్నాక’ అని చెబుతూనే ఉంది మనవడికి మురిపెంగా. ఆ రాత్రి భోజనాలయ్యాక మందుల పెట్టె తెరుస్తూ.. ‘సోమూ..’ అని పిలిచింది గారంగా నాయనమ్మ. హాల్లో చదువుకుంటున్న కథల పుస్తకాన్ని మూసేసి పరుగు పరుగున వచ్చి..
‘హమ్మయ్య.. మందుల పెట్టె తీశావా.. వేసుకో.. ఎలా వేసుకుంటావో చూస్తాను’ అన్నాడు మందులను, నాయనమ్మనూ మార్చిమార్చి చూస్తూ..

‘అట్ట నుంచి ఒక్కొక్క బిళ్లనూ విడివిడిగా కత్తిరించకూడదు నాయనమ్మా. అలా చేస్తే ఆ చిన్ని చిన్ని అల్యూమినియం ముక్కలు నీటిలో కరగవు. గేదెలు, ఆవులు వాటిని తింటే వాటికి చాలా ప్రమాదం. ఆ అట్టను అలా ఉంచి దాన్నుంచే నీక్కావాల్సినప్పుడల్లా ఒక్కొక్కటీ వలుచుకున్నావనుకో.. అది పెద్దగా ఉండి మళ్లీ దాన్ని కరిగించడానికి, మళ్లీ అలాంటిదే తయారు చేయడానికి వీలవుతుందంట. మా బళ్లో మాస్టారు చెప్పారు’ అన్నాడు.

తెల్లబోయి చూశారు అంతా సోము వైపు. ‘నిజమేరా సోము నువ్వు చెప్పింది.. పాపం బిళ్లలన్నీ ఇప్పటిదాకా ఒకే అట్టమీద అంతా కలిసి ఉన్నాయి. అలా ఒక్కోదాన్ని విడగొట్టేస్తే అవి బాధపడవూ. బాధపడతాయ్‌’ అని కొడుకుతో చెప్పి... తల్లివైపు చూస్తూ.. ‘ఇది చాలా గొప్ప విషయం. నువ్వు వాడు చెప్పినట్లే చెయ్యమ్మా..’ అన్నాడు సోము తండ్రి బాలు.

‘తప్పకుండా అలాగే చేస్తా. సోము చిన్నవాడైతేనేమి. బుజ్జి గురువులా మారి పెద్ద మాట చెప్పాడు’ అంటూ సోమును దగ్గరకు రమ్మని.. నుదుటి మీద ముద్దు పెట్టింది నాయనమ్మ. అది చూసి చప్పట్లు కొట్టారు సోమును అభినందిస్తున్నట్లు అమ్మానాన్న. సోము బోలెడంత ఆనందంతో గంతులేస్తూ.. వీధిలోకి పరుగెత్తాడు తన స్నేహితులతో విషయం చెప్పడానికి!

- కన్నెగంటి అనసూయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని