Updated : 06 Sep 2021 06:34 IST

వంద నోటు

కిట్టు, హరి పాఠశాలకు బయలుదేరారు. వారి ఇద్దరి దగ్గరా చెరో వందరూపాయల నోటు ఉంది. అది బడిలో పరీక్ష ఫీజు కట్టమని ఇంటి దగ్గర ఇచ్చినవి. కాసేపటికి వారిద్దరూ బడికి చేరారు. ఇంతలో కిట్టు తన జేబులో చెయ్యి పెట్టి చూసుకున్నాడు. నోటు అతని జేబులో లేదు. ఆ జేబుకు రంధ్రం ఉంది. ‘అయ్యో!’ అంటూ తన పుస్తకాల సంచిని హరికి ఇచ్చి, నోటు కోసం మళ్లీ వెనక్కి పరుగు పరుగున వెళ్లాడు. ఎంత వెదికినా దొరకలేదు. తిరిగి ఏడ్చుకుంటూ బడి దగ్గరకు వచ్చాడు.

అప్పుడు గోపి అనే స్నేహితుడు ఏమైందని కిట్టూను అడిగాడు. ‘ఒరేయ్‌ గోపీ! నా వంద రూపాయల నోటు ఎక్కడో పడిపోయిందిరా!’ అన్నాడు. ‘అయ్యో! నువ్వు తిరిగి వెళ్లి దారిలో చూశావా’ అని అడిగాడు గోపి. ‘చూశాను. ఎంత వెదికినా దొరకలేదురా’ అని కిట్టు కళ్లనీళ్లు పెట్టుకొన్నాడు. ఇంతలో హరి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ‘గోపీ! నా వంద రూపాయల నోటు కూడా పోయిందిరా’ అని అన్నాడు. ‘నేను చేతిలో పట్టుకుని కిట్టుతో మాట్లాడుకుంటూ రాగా అది దారిలో ఎక్కడో పడిపోయింది. దాని కోసం ఆ దారి అంతా గాలించాను. మా అమ్మ తిడుతుంది’ అంటూ ఏడవడం మొదలు పెట్టాడు. ఆ విషయం విని కిట్టు ఆశ్చర్యపోయాడు.

ఇంతలో ఒక రైతు అక్కడికి వచ్చి ‘బాబూ! నాకు దారిలో ఈ వంద రూపాయల నోటు దొరికింది. ఇప్పుడో అబ్బాయి డబ్బులు పోయాయని ఏడ్చుకుంటూ వెళ్లాడని దారిలో కొందరు చెబితే ఇటు వచ్చాను’ అని ఆ వందనోటు గోపికి ఇచ్చాడు. అప్పుడు కిట్టు, హరి ‘ఆ నోటు నాది అంటే నాది’ అని పోట్లాడుకున్నారు.

‘మీ ఇద్దరూ డబ్బులు పోయాయి అంటున్నారు. ఒక్క నోటు మాత్రమే దొరికింది. ఇది ఎవరిదో తెలియడం లేదు. ఓ పనిచేద్దాం. చెరో యాభై తీసుకోండి’ అన్నాడు గోపి. కిట్టు, హరి ఇద్దరూ ఒప్పుకోలేదు. వాళ్లు మరింతగా ఏడవసాగారు. ఇంతలో అటుగా పోతున్న ధర్మయ్య తాత అక్కడకు వచ్చి ‘ఈ పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు?’ అని ప్రశ్నించాడు. గోపి జరిగిన సంగతంతా చెప్పాడు. ఆ తాత వెంటనే.. ‘అయ్యో.. నా మతి మరుపు మండా! నాకు దారిలో ఈ వంద కాగితం దొరికింది. ఇది మీదే కావొచ్చు. తీసుకోండి’ అని ఇచ్చాడు. ఆ నోటు తీసుకున్న గోపి అతనికి కృతజ్ఞతలు తెలిపాడు.

ఇంతలో రాము అనే బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి ‘నేను పాఠశాలకు వచ్చేటప్పుడు నాకు దారిలో ఒక వంద రూపాయల నోటు దొరికింది. ఇదిగో.. తీసుకో’ అంటూ వీళ్లకు ఇచ్చి వెళ్లాడు. గోపి ఆశ్చర్యపోయాడు. ‘పోయినవి రెండు నోట్లు. దొరికినవి మాత్రం మూడు. ఇందులో ఒకటి వేరే వారిది అయి ఉండాలి’ అని అనుకున్నారు. కాసేపు ఎదురు చూశారు. ఎవరూ వందనోటు పోయిందని రాలేదు.

గోపి వెంటనే కిట్టు, హరిని పిలిచి ‘ఈ మూడు నోట్లలో ఏవి మీవి’ అన్నాడు. కిట్టు, హరి తమ నోట్లను గుర్తించారు. ఎందుకంటే రెండూ పాత నోట్లు. మిగిలింది మాత్రం కొత్త వందరూపాయల నోటు. వెంటనే గోపికి విషయం అర్థమై పోయింది. అక్కడ ఎవరితోనో మాట్లాడుతున్న ధర్మయ్య తాతను పిలిచి. ‘తాతా! మీ వంద రూపాయల నోటు ఇదిగో’ అని ఇచ్చాడు. తాత ఆశ్చర్యపోయి ‘ఇది నాది అని ఎలా గుర్తు పట్టగలిగావు బాబూ!’ అని అడిగాడు. ‘తాతగారూ! మీరు మా పిల్లల వంద రూపాయల నోటు పోయిందని చెప్పినప్పుడు వెంటనే మీకు దొరికినట్లు, ఆ విషయం మరిచిపోయినట్లు చెప్పారు. అప్పుడే మీ జేబులోంచి తీసి కొత్త వందనోటు ఇచ్చారు. కానీ పోయింది పాత నోటు. వాళ్ల ఏడుపు మానిపించడానికే మీరు మీ నోటు ఇచ్చారు’ అన్నాడు.

ధర్మయ్య తాత ఓ నవ్వు నవ్వి.. సరేలే.. ఆ నోటు మీరే పంచుకోండి అన్నాడు. వాళ్లు ఒప్పుకోకుండా ఆయన నోటు ఆయనకే ఇచ్చేశారు. కిట్టూ, హరి, గోపి ఆనందంగా బడి లోపలకు వెళ్లిపోయారు. ఇంకెప్పుడూ డబ్బుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు అనుకున్నారు.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts