నక్క వెక్కిరింతలు!

ఒక అడవికి సింహం రాజుగా ఉండేది. అది తన కుమారుడి పుట్టినరోజు వేడుకను ఘనంగా జరపాలని నిర్ణయించింది. జంతువులు, పక్షులు వాటి ప్రతిభను తన కుమారుడి పుట్టిన రోజున ప్రదర్శించి సందడి చేయాలని ఆజ్ఞాపించింది. ఆ అడవిలో కందకం అనే నక్క ఉండేది. అది వెళ్తూ ఉంటే ఒక చోట నెమలి పురి విప్పి నాట్యం చేస్తూ కనిపించింది......

Updated : 07 Sep 2021 02:08 IST

క అడవికి సింహం రాజుగా ఉండేది. అది తన కుమారుడి పుట్టినరోజు వేడుకను ఘనంగా జరపాలని నిర్ణయించింది. జంతువులు, పక్షులు వాటి ప్రతిభను తన కుమారుడి పుట్టిన రోజున ప్రదర్శించి సందడి చేయాలని ఆజ్ఞాపించింది. ఆ అడవిలో కందకం అనే నక్క ఉండేది. అది వెళ్తూ ఉంటే ఒక చోట నెమలి పురి విప్పి నాట్యం చేస్తూ కనిపించింది. ‘అబ్బో! నీలాంటి అందమైన పింఛాలతో తోక ఎవరికీ లేదని, నీలాగా ఎవరికీ నాట్యం రాదని విర్రవీగకు. నేను తల్చుకుంటే నీ కంటే గొప్పగా నాట్యం చేయగలను’ అంటూ కేకలేసి వెళ్లిపోయింది.

ఒక కోకిల చెట్టుమీద కూర్చుని వినసొంపుగా రాగాలు తీస్తూ నక్కకు కనిపించింది. నక్క తల పైకెత్తి ‘ఏయ్‌! కోకిలా! ఈ అడవిలో నీలాగా ఎవరూ మధురంగా పాడలేరని తల ఎగరేయకు. నేను తల్చుకుంటే నీకంటే వందరెట్లు వినసొంపుగా పాడగలను. కూసింది చాలు. ఇక నోరుముయ్యి’ అంటూ దబాయించి వెళ్లింది.

కాసేపటికి నక్కకు దారిలో ఒక లేడి తన అందమైన కళ్లను తిప్పుతూ గెంతులేస్తూ కనిపించింది. ‘ఓ లేడీ.. అందమైన కళ్లున్నాయని, అందంగా చిందులేయగలనని మిడిసిపడకు. నేను నీకంటే అందంగా చిందులేయగలను. ఇక చాలించు’ అని అరిచి వెళ్లింది. ఇంకాస్త దూరంలో ఒక కోతి చెట్ల మీద దూకుతూ కొమ్మలు పట్టుకుని వేలాడుతూ రకరకాల విన్యాసాలు చేస్తూ కనిపించింది. ‘ఏయ్‌! కోతీ.. నీలాగా విన్యాసాలు ఈ అడవిలో ఎవరికీ చేతకావనే అహంకారంతో ఎగిరెగిరి పడకు. నా ముందు నీ కుప్పిగంతులెంత? ఎగిరింది చాలు. కుదురుగా కూర్చో’ అని వెళ్లిపోయింది నక్క.

దారిలో దానికి ఒక చిలుక ముద్దుముద్దుగా చెట్టుతో మాట్లాడుతూ కనిపించింది. నీ అంత ముద్దుగా మాట్లాడటం ఎవరికీ రాదని గర్వపడకు. నేను తల్చుకుంటే నీ కంటే బాగా మాట్లాడగలను. ఇక నోర్ముయ్‌!’ అని అరిచి వెళ్లిపోయింది. నక్కకు దారిలో ఒక గుర్రం నాట్యం చేస్తూ కనిపించింది. గుర్రాన్ని కూడా అరిచి వెళ్లింది. అలాగే ఉడుత, కుందేలు, సీతాకోకచిలుకనూ నిందించింది.

రెండు రోజుల తర్వాత మృగరాజు కుమారుడి పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆ వేడుకల్లో నెమలి, కోకిల, లేడి, కోతి, చిలుక, గుర్రం మొదలైన జంతువులు, పక్షులు వాటి వాటి విద్యలను ప్రదర్శించాయి. చక్కటి ప్రతిభను చాటి బహుమతులు అందుకున్నాయి. సింహం నక్కను పిలిచి ‘నీకు ఎందులో ప్రతిభ ఉందో ప్రదర్శించి, అందరికీ వినోదాన్ని కలిగించు’ అంది. ఏ ప్రతిభాలేని నక్క పిచ్చిచూపులు చూస్తూ.. ‘మహారాజా! ఈ రోజు నా ఆరోగ్యం సరిగాలేదు. అందుకే ఏ విద్యలనూ ప్రదర్శించలేకపోతున్నా’ అంది.

సింహం నవ్వి.. ‘అసలు నువ్వు ఏ రోజైనా ఏ పనైనా నేర్చుకుని, నైపుణ్యం పెంచుకునే ప్రయత్నం చేశావా? నీ గడిచిపోయిన జీవితకాలమంతా ఇతరులను విమర్శించడానికి, నీ గురించి లేనిపోని గొప్పలు చెప్పుకుంటూ తిరగడానికే సరిపోయింది. ఏ పనైనా నేర్చుకుని దానిలో నైపుణ్యం పెంచుకోవడానికి ప్రయత్నించలేదు. నీలాగ పనికిరాని పనులకు సమయాన్ని వృథా చేసేవారు దేనికీ పనికిరారు’ అంది సింహం.

జంతువులు, పక్షులు వాటి ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి సాధన చేస్తుంటే తాను వాటిని విమర్శిస్తూ కాలం గడిపానని సింహానికి తెలిసిందని నక్కకు అర్థమైంది. ‘జరిగిపోయిన కాలమంతా ఇతరులను అసూయతో విమర్శిస్తూ, హేళన చేస్తూ, కాలం వృథా చేస్తూ తిరిగాను. ఆ సమయాన్ని చక్కగా ఉపయోగించుకుని ఉంటే అందరి ముందూ పరువు పోయేది కాదు’ అని బాధ పడింది. అప్పటి నుంచి బుద్ధిగా ఉండాలి అనుకుంది నక్క.

- డి.కె.చదువుల బాబు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని