మర్రి చెట్టు తెచ్చిన మార్పు!

చాలాకాలం కిందట గోపవరంలో సదానందుడు అనే రైతు ఉండేవాడు. తనకున్న రెండెకరాలను సాగు చేసుకుంటూ ఉన్నంతలో తృప్తిగా జీవిస్తుండేవాడు. సదానందుడి దూరపు బంధువు రామానందుడు బతుకుతెరువు వెతుక్కుంటూ గోపవరం వచ్చాడు. అక్కడికి పదిమైళ్ల దూరాన ఉన్న గ్రామంలో వారానికి ఒకసారి జరిగే సంతలో సరకులు తెచ్చి ఊర్లో అమ్ముకుని జీవనం

Updated : 12 Sep 2021 02:15 IST

చాలాకాలం కిందట గోపవరంలో సదానందుడు అనే రైతు ఉండేవాడు. తనకున్న రెండెకరాలను సాగు చేసుకుంటూ ఉన్నంతలో తృప్తిగా జీవిస్తుండేవాడు. సదానందుడి దూరపు బంధువు రామానందుడు బతుకుతెరువు వెతుక్కుంటూ గోపవరం వచ్చాడు. అక్కడికి పదిమైళ్ల దూరాన ఉన్న గ్రామంలో వారానికి ఒకసారి జరిగే సంతలో సరకులు తెచ్చి ఊర్లో అమ్ముకుని జీవనం సాగించేటట్లు ఏర్పాట్లు చేశాడు సదానందుడు. అందుకు తగ్గ ధనాన్ని రుణం కింద ఇచ్చాడు.

రామానందుడు శ్రద్ధగా వ్యాపారం చేసుకోసాగాడు. ఆయనకు ఆ వ్యాపారం బాగా కలిసివచ్చింది. త్వరలోనే వృద్ధిలోకి వచ్చాడు. గ్రామంలోనే చక్కని ఇల్లు కట్టుకున్నాడు. నాలుగు రాళ్లు వెనకేసుకున్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ధనం వచ్చి చేరేసరికి రామానందుడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. పూర్తి డబ్బు మనిషిగా మారాడు.

ఒకసారి ఊళ్లో పెద్దలు గుడి దగ్గర అన్నదాన కార్యక్రమానికి చందా కోసం రామానందుడి దగ్గరకు వచ్చారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వారిని  పంపేశాడు. పూరిపాకలో నడుస్తున్న వైద్యశాలకు పక్కా భవంతి నిర్మిద్దామని ఓసారి ఊరిపెద్దలు వస్తే ‘ససేమిరా’ అన్నాడు. మరొకసారి పాడుబడ్డ బడికి మరమ్మతులు చేద్దామంటే రామానందుడు సహకరించనన్నాడు. ఆ తర్వాత విరాళాల కోసం అతని దగ్గరకు గ్రామస్థులు రావడం మానేశారు. అలా కొంతకాలం జరిగింది. రామానందుడు ఒకసారి సంతకు వెళుతూ సదానందుణ్ని తోడు పిలిచాడు.

వ్యవసాయ పనులేమీ ఆ సమయంలో లేకపోవడంతో సదానందుడు సరేనని బయలుదేరాడు. ఇద్దరూ మధ్యాహ్న వేళకు పెద్ద మర్రిచెట్టు, దాని పక్కన ఉన్న కొలను వద్దకు చేరారు. కొలనులో కాళ్లు, చేతులు కడుక్కుని అన్నం మూటలు విప్పి తినడం ప్రారంభించారు. అంతలో ఆ దారిన పోతున్న యాత్రికులు కొందరు అక్కడే భోజనాలు చేసి సేదతీరారు.

ఎండనబడి వచ్చిన అంతమందికి ఆ చెట్టే చల్లని నీడనిచ్చింది. ‘నేను పదేళ్ల క్రితం వ్యాపారం మొదలుపెట్టాను. అప్పుడు ఈ చెట్టు చిన్న మొక్క. ఈ రోజు చూడు ఎంతగా ఎదిగిందో? ఎంతమందికి ఆశ్రయం ఇస్తోందో.. చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతోంది’ అన్నాడు రామానందుడు.

వెంటనే సదానందుడు అందుకుని ‘చెట్లు అంతే ఎంత ఎదిగితే అంత ఎక్కువ మందికి నీడనిస్తాయి. అంతేగాక వాటి పళ్లు, ఆకులు, బెరడు, వేర్లు ఒకటేమిటి.. అన్నీ మనుషులకు పనికి వస్తాయి. ప్రాణవాయువును ఇచ్చి అన్ని జీవుల ప్రాణాలు నిలబెడతాయి. అందుకే వృక్షో రక్షతి రక్షితః అంటారు. అంతేగాక చెట్లను భక్తిభావంతో పూజిస్తారు. మనిషి అలా కాదు. ఎంత ఎదిగితే అంత సంకుచితంగా ఆలోచిస్తాడు. ముందుతరాల వారసుల కోసం దాచిపెడుతూ తనతో కలిసి బతుకున్న వారిపై నిర్దయగా ప్రవర్తిస్తాడు’ అన్నాడు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడో కానీ అది రామానందుని గుండెను తాకింది. పనులన్నీ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి చేరేదాకా అవే ఆలోచనలతో గడిపాడు రామానందుడు. ఇంటికి చేరాక గట్టి నిర్ణయం తీసుకున్నాడు. మర్రిచెట్టునే ఆదర్శంగా తీసుకుని బతకాలనుకున్నాడు. తన సంపాదనలో కొంత పేదల కోసం కేటాయించాలనుకున్నాడు. అప్పటి నుంచి తోటివారికి తనకు తోచిన సాయం చేయడం ప్రారంభించాడు. అది చూసి సదానందుడు సంతోషించి రామానందుడితో ‘నువ్వు చాలా మారావు’ అన్నాడు. ‘నేను మారలేదు. ఆ రోజు నీ మాటలే నన్ను మార్చాయి. జీవిత సత్యం తెలుసుకున్నాను. మర్రి చెట్టునే ఆదర్శంగా తీసుకున్నా. ఇదంతా నీ వల్లే. జీవనోపాధి చూపించావు. జీవితాన్ని ఎలా గడపాలో సున్నితంగా చెప్పావు. దీనంతటికీ కారణం నువ్వే’ అన్నాడు రామానందుడు.

- గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని