ష్‌.. ఎవ్వరికీ చెప్పకు మిత్రమా!

ఒక అడవి సమీపంలో ఒక పెద్ద కొంగల కొలను ఉండేది. కొంగల మధ్య ఐక్యత ఎక్కువ. కాబట్టి వాటిని వేటాడడానికి ఏ జంతువు కూడా అటు వైపునకు వెళ్లేవి కావు. ఒకరోజు ఉదయాన్నే మృగరాజు హడావిడిగా కొలను దగ్గరకు వచ్చింది. కొంగలన్నీ ఏకమై సింహాన్ని చుట్టుముట్టాయి. సింహం.. చిరునవ్వు నవ్వి ‘మిత్రులారా! శాంతించండి.. నేను ఇక్కడకు వేటకు రాలేదు. మీ గురువు దగ్గరకు ఒక పని మీద వచ్చాను’

Updated : 01 Oct 2021 01:03 IST

క అడవి సమీపంలో ఒక పెద్ద కొంగల కొలను ఉండేది. కొంగల మధ్య ఐక్యత ఎక్కువ. కాబట్టి వాటిని వేటాడడానికి ఏ జంతువు కూడా అటు వైపునకు వెళ్లేవి కావు. ఒకరోజు ఉదయాన్నే మృగరాజు హడావిడిగా కొలను దగ్గరకు వచ్చింది. కొంగలన్నీ ఏకమై సింహాన్ని చుట్టుముట్టాయి. సింహం.. చిరునవ్వు నవ్వి ‘మిత్రులారా! శాంతించండి.. నేను ఇక్కడకు వేటకు రాలేదు. మీ గురువు దగ్గరకు ఒక పని మీద వచ్చాను’ అని చెప్పింది కొంగల సమూహంతో.

కాసేపటికి కొంగల గురువు సింహం సమీపానికి వచ్చి ‘చెప్పండి.. మృగరాజా! మాతో మీకు ఏం పని పడింది’ అని అడిగింది. సింహం కొంగల గురువు చెవిలో ఏదో విషయాన్ని చెప్పింది. ‘ఓ.. నా బంధుమిత్రులారా! ప్రియ శిష్యులారా..! ఈ మృగరాజు వల్ల మనకు రానున్న ఆపద ఏమీ లేదు. మీరు నిశ్చింతగా ఉండండి’ అని చెప్పింది కొంగల సమూహానికి.

సింహాన్ని కొలను పక్కనే ఉన్న ఒక గుహలోకి తీసుకుని వెళ్లింది కొంగల గురువు. కాసేపటి తర్వాత గురువు గుహ బయటకు వచ్చి కొంగల సమూహాన్ని పిలిచి, వాటి సాయంతో గుహద్వారాన్ని మూసివేసింది.
కొంత సమయం గడిచాక అడవి జంతువులన్నీ కొంగల కొలను వైపు దూసుకు వస్తుండటం గమనించింది కొంగల గురువు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా మృగరాజు ఉన్న గుహ బయట రక్షణ కవచంగా కొన్ని కొంగలను నిలబెట్టింది. జంతువులన్నీ బిగ్గరగా అరుస్తూ.. ‘ఓ దొంగ జపం కొంగల్లారా..! మీరు మా మృగరాజు సింహాన్ని ఈ గుహలో బంధించినట్లు మాకు సమాచారం ఉంది. వెంటనే విడిచిపెట్టండి. లేదంటే.. మేము మీతో పోరాడి మా రాజును మాతో తీసుకునిపోతాం’ అని అన్నాయి.

‘మీ మృగరాజుకు ఏ అపకారమూ జరగలేదు.. జరగదు కూడా. ఒక్కరోజు ఓపిక పట్టండి. మీ మృగరాజు మీ అడవికి వస్తారు’ అని చెప్పింది కొంగల గురువు. అంతలో అడవి జీవుల నుంచి ఒక నక్క ముందుకు వచ్చి ‘ఈ రోజు ఉదయం మృగరాజు నిద్రమత్తులో పొరపాటున మీ కొలను వైపు వచ్చింది. దాన్ని మీ కొంగల సమూహం చుట్టుముట్టింది. ఆ తర్వాత మీరు మీ కొంగలకు ఏవో సూచనలు చేసి మా మృగరాజును ఆ గుహలో బంధించడం నేను కళ్లారా చూశాను’ అని గొంతు చించుకుని అరిచింది.

‘నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదు. దయచేసి నా మాట నమ్మి రేపు ఈ సమయానికి వచ్చి మీ మృగరాజును మీరు తీసుకువెళ్లండి’ అని జంతువులను కోరింది కొంగల గురువు.

‘మీ మాట మీద నమ్మకంతో మేం ఇప్పుడు వెళ్లిపోతున్నాం. రేపు ఇదే సమయానికి మేం మా మృగరాజును తీసుకెళ్లడానికి వస్తాం. ఏమైనా తేడా జరిగితే పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి’ అని హెచ్చరించి వెళ్లిపోయాయి జంతువులు.

రెండోరోజు అనుకున్న సమయానికి అడవి జంతువుల సమూహం మృగరాజు ఉన్న గుహ దగ్గరకు వచ్చింది. గురువుగారి సూచనతో కొంగల సమూహం గుహ తలుపులు తెరిచింది. మృగరాజు సింహం హుందాగా నడుచుకుంటూ గుహ బయటకు వచ్చి, బయట ఉన్న అడవి జీవులు, కొంగల  సమూహాన్ని చూసి ఆశ్చర్యపోయింది. ‘మిత్రమా! కొంపదీసి వీటికి అసలు విషయం తెలిసిపోలేదు కదా!’ అని కొంగల గురువు చెవిలో అడిగింది. ‘లేదు.. లేదు.. మీరు నిశ్చింతగా వెళ్లండి’ అని చిరునవ్వుతో సింహం చెవిలోనే సమాధానం ఇచ్చింది కొంగల గురువు.

‘నా గురించి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను కేవలం ఒకరోజు విశ్రాంతి కోసమే గుహలో కొంగల గురువు అనుమతితో ఉన్నా. ఇక మీరంతా మీ పనులు చూసుకోవడానికి వెళ్లిపోండి’ అని జంతువులను ఆదేశించింది సింహం. ఏదో అనుమానంగా ఉన్నా... సింహం ఆదేశాలను కాదనలేక అడవివైపు కదిలాయి జంతువులు. కొంగల గురువు కూడా తన కొంగల బృందాన్ని తీసుకుని కొలనువైపు వెళ్లిపోయింది.

కొన్ని రోజుల క్రితం మృగరాజు చేపల్ని వేటాడి తింది. అప్పుడు చేపముళ్లు కొన్ని దాని గొంతుకు అడ్డంగా ఇరుక్కున్నాయి. ఈ విషయం మిగతా జంతువులకు తెలిస్తే తన పరువు పోతుందని మృగరాజు అనుకుంది. అందుకే వీటిని తొలగించడంలో నైపుణ్యం ఉన్న కొంగల గురువు దగ్గరకు రహస్యంగా వెళ్లి చికిత్స తీసుకుంది. ఈ విషయం మాత్రం చివరి వరకు మృగరాజు, కొంగల గురువు మధ్యే ఉండిపోయింది.

నేస్తాలూ..! మీరు కూడా ఈ విషయాన్ని ఎవరికీ చెప్పకండేం.

- మీగడ వీరభద్రస్వామి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు