మనిషిని చూసి వాతలు పెట్టుకున్న కుందేలు!

అనగనగా ఒక అడవి. అందులో సాధుజంతువులు మాత్రమే ఉండేవి. చుట్టుపక్కల ప్రజలు తరచూ అడవికి వెళ్లి పండ్లు, వంట కలప తెచ్చుకునేవారు. దగ్గర్లోని ఊర్లో.. కట్టెలు అమ్ముకునే రంగన్న ఉండేవాడు. వీలైనప్పుడల్లా అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి దగ్గరి ఊళ్లలో అమ్ముకుని జీవించేవాడు.

Updated : 03 Oct 2021 06:08 IST

నగనగా ఒక అడవి. అందులో సాధుజంతువులు మాత్రమే ఉండేవి. చుట్టుపక్కల ప్రజలు తరచూ అడవికి వెళ్లి పండ్లు, వంట కలప తెచ్చుకునేవారు. దగ్గర్లోని ఊర్లో.. కట్టెలు అమ్ముకునే రంగన్న ఉండేవాడు. వీలైనప్పుడల్లా అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తెచ్చి దగ్గరి ఊళ్లలో అమ్ముకుని జీవించేవాడు. ఒకసారి రంగన్న కట్టెల మోపుతో వెళ్తుండగా ఓ కుందేలు చూసింది. రాళ్లు, ముళ్ల మీద నడుస్తున్నా అతడికేమీ కాకపోవడం ఆశ్చర్యంగా గమనించింది. ‘ఓ మనిషీ.. నువ్వు రాళ్లమీద, ముళ్ల మధ్య నడుస్తున్నా నీకేమీ కాదా?’ అంది.

‘కాళ్లకు చెప్పులేసుకుంటే ఏమీ కాదు. హాయిగా నడవొచ్చు’ అన్నాడు రంగన్న చెప్పులు చూపిస్తూ. అప్పటి నుంచి తనకీ చెప్పులుంటే బాగుండు అనుకుంది కుందేలు. ఆ సంగతి మిత్రుడైన కోతికి చెప్పి సాయమడిగింది. ‘ఇప్పుడే తాడిచెట్టెక్కి కాయలు పడేస్తాను. కాయల్లోపలి గుజ్జు తినేసి మిగిలింది కాళ్లకు వేసుకుని నడువు. చెప్పుల్లానే కాళ్లకు బాగుంటాయి’ అంది కోతి. కుందేలు సరేననడంతో కోతి తాటికాయల్ని ఇచ్చింది. అది చెప్పినట్లే కుందేలు చేసింది. కానీ నడక కుదరలేదు. ఆ కాయలు గుండ్రంగా, బరువుగా ఉన్నాయి. చక్రాల్లా దొర్లుకుంటూ వెళ్లాయి. ముందుకు పడిపోయింది కుందేలు.

కోతి పరుగున వచ్చి కుందేలును లేవదీసింది. ఈసారి మర్రి ఆకుల్ని ఇచ్చి వాటితో నడవమంది. ముళ్లు, తుప్పల్లోకి వెళ్లేసరికి ఆకులు చిరిగిపోయాయి.

‘ఇక నావల్ల కాదు’ అని చేతులెత్తేసింది కోతి. కుందేలు, కోతుల ప్రయత్నాన్ని చూసింది ఓ వడ్రంగిపిట్ట. అది వాటికి సాయం చేస్తానంది. ఒక చెట్టు కొమ్మ మీద కూర్చుని చెప్పులకు సరిపడే కర్రను బయటకు తీసింది. ఎలుగుబంటితో పావుకోళ్లలాగా చేయించి కుందేలుకిచ్చింది. పచ్చికర్రతో చెయ్యడంతో అది బరువెక్కువై కుందేలు అడుగులు సరిగా వెయ్యలేకపోయింది. మళ్లీ బాధపడింది కుందేలు.

రంగన్న చెప్పుల్లాంటివే కావాలంటే అతడినే అడగాలని ఎదురు చూసింది కుందేలు. కొన్ని రోజుల తర్వాత రంగన్న కనబడగానే అతడ్ని కలిసి చెప్పుల కోసం తాను పడిన కష్టాలు చెప్పింది. చర్మంతో చేసిన చెప్పులైతే నడవడానికి బాగుంటాయి అన్నాడు రంగన్న. చర్మంతో చెప్పులనగానే ఎలుక గుర్తొచ్చింది కుందేలుకు. ఎలుకను కలిసి.. ‘చెప్పుల కోసం సరిపడే చర్మం తెస్తావా? అని అడిగింది. ‘చనిపోయిన జంతువు కనబడగానే తెస్తాను’ అంది ఎలుక. పదిరోజులైనా చర్మం తెచ్చివ్వలేదు ఎలుక. రోజూ ఎలుకను ఆశగా అడిగేది కుందేలు. ‘నీకు చర్మం తేవాలంటే ఏదైనా చచ్చిన జంతువు కనబడాలి కదా’ అనేది ఎలుక.  కుందేలు మళ్లీ బాధపడింది. కొన్ని రోజులకు రంగన్న కనిపిస్తే ఎలాగైనా తననే సాయం చేయమని అడిగింది. ఈసారి వచ్చేటప్పుడు తీసుకొచ్చి ఇస్తానన్నాడు. అన్నట్లుగానే తన చిన్న కొడుకు వాడే చిన్ని చిన్ని చెప్పుల్ని తెచ్చి కుందేలుకు ఇచ్చాడు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న చెప్పులు చేతికి వచ్చే సరికి కుందేలు చాలా సంతోషించింది. వాటిని వేసుకుని అటూఇటూ నడిచింది. ఆహారం వెతుక్కోవడానికి వెళ్లింది.

తర్వాత రోజు వర్షం పడి బురదగా ఉంది నేల. నీళ్లు తాగడానికి చెరువుకు వెళ్లింది కుందేలు. చెప్పులతో నడక అలవాటులేక జారిపోయి చెరువులో పడింది కుందేలు. నీట్లో మునకలు వేస్తూ రక్షించమని అరిచింది. నీళ్లు తాగడం కోసం అప్పుడే చెరువుకు వచ్చి ఏనుగు కుందేలును తన తొండంతో రక్షించి ఒడ్డు మీద వేసింది. దాని కాళ్లకు ఉన్న చెప్పులను చూసి ‘అవేంటి?’ అని అడిగింది ఏనుగు. చాలా గొప్పగా చెప్పింది కుందేలు వాటి గురించి.

‘ఓహో.. అదా సంగతి. అవే లేకపోతే చెరువులో జారి పడేదానివే కాదు. మనుషులకూ, మనకూ చాలా తేడా ఉంది. వాళ్లు సున్నితమైనవాళ్లు కాబట్టి వాళ్లకు చెప్పులు అవసరం. మనకు రాళ్లు, ముళ్ల మీద కాస్తోకూస్తో నడిచే విధంగా కాళ్లున్నాయి. ఎండకూ, వానకూ మనం వాళ్లకంటే బాగా తట్టుకోగలం. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు కొత్త కొత్త అలవాట్లు చేసుకుంటే ఇలాగే జరుగుతుంది. వాటిని పారెయ్‌. లేదంటే ఇంకేమైనా జరగొచ్చు’ అంది ఏనుగు. కుందేలు బుద్ధిగా వాటిని పక్కనపెట్టేసింది. మనుషుల్లాగా ఉండాలని అది ఇంకెప్పుడూ అనుకోలేదు.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని