బద్ధకం తెచ్చిన ముప్పు!

రంగయ్య కోళ్ల వ్యాపారం చేసేవాడు. గుడ్లను పొదిగించడం, వచ్చిన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడి, పెద్దయ్యాక వాటిని అమ్మడం.. ఇదే అతని పని. దాంతో అతని ఇల్లు ఎప్పుడూ కోళ్లతోనూ, వాటిని కొనడానికి వచ్చే వాళ్లతోనూ కళకళలాడుతూ ఉండేది. అయితే.. రంగయ్య కోళ్లలో ఒక చుక్కల కోడి ఉండేది. అది చాలా అందంగా ఉండేది. అందరూ దాన్నే చూసేవారు. దాంతో అందంగా ఉంటానని దానికి చాలా గర్వం పెరిగిపోయింది. అన్ని కోళ్లకంటే తాను ప్రత్యేకం అన్నట్లు ప్రవర్తించేది. అందరితో కలిసి తింటే తనకు నామోషీ అనుకునేది. దాంతో విడిగా, ఒంటరిగా వెళ్లి తింటూ ఉండేది. అయినా దాని వయసు కోళ్లు అదేమీ పట్టించుకోకుండా దాని వెనకే తిరిగేవి.

Updated : 04 Oct 2021 04:34 IST

రంగయ్య కోళ్ల వ్యాపారం చేసేవాడు. గుడ్లను పొదిగించడం, వచ్చిన పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడి, పెద్దయ్యాక వాటిని అమ్మడం.. ఇదే అతని పని. దాంతో అతని ఇల్లు ఎప్పుడూ కోళ్లతోనూ, వాటిని కొనడానికి వచ్చే వాళ్లతోనూ కళకళలాడుతూ ఉండేది. అయితే.. రంగయ్య కోళ్లలో ఒక చుక్కల కోడి ఉండేది. అది చాలా అందంగా ఉండేది. అందరూ దాన్నే చూసేవారు. దాంతో అందంగా ఉంటానని దానికి చాలా గర్వం పెరిగిపోయింది. అన్ని కోళ్లకంటే తాను ప్రత్యేకం అన్నట్లు ప్రవర్తించేది. అందరితో కలిసి తింటే తనకు నామోషీ అనుకునేది. దాంతో విడిగా, ఒంటరిగా వెళ్లి తింటూ ఉండేది. అయినా దాని వయసు కోళ్లు అదేమీ పట్టించుకోకుండా దాని వెనకే తిరిగేవి. కొన్ని కోళ్లు అయితే ఏదైనా పెద్ద పురుగు ఆహారంగా దొరికితే చుక్కలకోడికి కూడా కొంచెం పెడుతుండేవి. ఇదంతా తన అందం వల్లే అని అనుకునేది చుక్కలకోడి. వాళ్లస్నేహం, మంచితనాన్ని ఏ మాత్రం పట్టించుకునేది కాదు. అయినా అవి స్నేహం చేయడం మాత్రం మానేవి కాదు.

కష్టపడకుండా వచ్చే తిండి తింటూ బాగా ఒళ్లు చేసిందేమో.. దానికి బద్ధకం కూడా బాగా పెరిగిపోయిôది. దానికి తోడు అన్ని కోళ్లలా తానూ నిలబడి, తిరుగుతూ తింటే తన ప్రత్యేకత ఏముంటుందని అనుకునేది. అందుకే ఎంచక్కా కూర్చుని తినడం మొదలు పెట్టింది. అది గమనించిన మిగతా కోళ్లు, ఇదేదో బాగుందని అవి కూడా తిరిగి తినడం మానేశాయి. కూర్చుని తినడం మొదలు పెట్టాయి. అది చూసి పెద్ద కోళ్లకు బాగా కోపం వచ్చింది. వాటి దగ్గరకు వెళ్లి ‘ఏంటీ.. ఇలా కూర్చుని తింటున్నారు? అలా కూర్చుని తింటే ఒళ్లు పెరిగిపోతుంది. అసలు వయసు కంటే పెద్దవాళ్లుగా కనిపిస్తాం. మనలాంటి వాళ్లకు అది చాలా ప్రమాదం. ఎంత తిరిగితే మనకు అంత ఆరోగ్యం తెలుసా? తిరగ గలిగినంత దూరం తిరిగి.. దొరికినంత తిండి తినాలి. అయినా ఏ పొద చాటు నుంచి ఏ పిల్లి, ఏ దిక్కు నుంచి ఏ కుక్క దాడి చేస్తుందో తెలియని పరిస్థితి. నిత్యం అప్రమత్తంగా ఉండాలి. కానీ ఇలా కూర్చుని తినడం వల్ల ఒళ్లు బరువైపోయి వాటి చేతికి తేలిగ్గా చిక్కుతాం’ అని హెచ్చరించాయి.

దాంతో కూర్చుని తింటున్న కోళ్లలో కొన్ని సిగ్గు పడుతూ లేచి నిలబడి దూరంగా వెళ్లిపోయాయి. చుక్కల కోడి మాత్రం ‘మీరేంటి నాకు చెప్పేది?’ అన్నట్లు పొగరుగా తల ఎగరేసింది. కూర్చున్న చోటు నుంచి ఏమాత్రం లేవలేదు. మరికొన్ని కోళ్లు దాన్నే అనుసరించాయి. పెద్దవాళ్లంతా మళ్లీ మళ్లీ చెప్పారు. అయినా వాటి చెవికి ఎక్కలేదు. దాంతో.. ‘పెద్దవాళ్లం.. ఏదో తెలిసింది చెప్పాం.. వింటే బాగు పడతారు’ అని వాటికి వినపడేలా అంటూ వాటి దారిన అవి వెళ్లిపోయాయి. అయినా రోజురోజుకు చుక్కల కోడికి బద్ధకం పెరిగిందే కానీ తగ్గలేదు.

కొన్నాళ్లకు మరింతగా ఒళ్లు చేసి కదల్లేకుండా తయారైంది చుక్కలకోడి. చీకటి పడే వేళ లోపలికి వెళ్లాలన్నా బరువైన ఒంటితో నాలుగు అడుగులు కూడా వేయలేకపోయేది. అన్నింటికన్నా ఆఖరున వెళ్లేది. తట్టకింద ఇరుక్కుని కూర్చునేది. బాగా లావెక్కిన కోడిని గమనించాడు రంగయ్య. అది మిగతా కోళ్లలా తేలికగా నడవలేకపోవడం చూసి ‘అమ్మో! ఈ కోడి బాగా లావెక్కి కదలలేకపోతోంది. ఏ పిల్లి అయినా, కుక్కయినా దీన్ని చూశాయంటే అంతే. దీన్ని అమ్మేస్తే మంచిది’ అనుకున్నాడు మనసులో.

కొన్ని రోజుల తర్వాత అయిదారు ఇళ్ల అవతల ఉండే దానయ్య గబగబా రంగయ్య ఇంటికి వచ్చాడు. వస్తూనే.. ‘రంగయ్యా..! మా ఇంటికి బంధువులు వస్తున్నారు. మంచి కోడిని ఒకదాన్ని ఇవ్వు. బాగా లేతగా ఉండాలి’ అంటూ కంగారు పెట్టించాడు రంగయ్యను.

అలాగే.. నువ్వేం కంగారు పడకు దానయ్యా.. మంచి లేత కోడి ఒకటి ఉంది. చూడడానికి పెద్దగా కనిపిస్తుంది. కానీ తినడానికి చాలా లేతగా ఉండి, రుచిగా కూడా ఉంటుంది. కాకపోతే.. కాస్త ధర ఎక్కువ’ అంటూ రంగయ్య మెల్లగా వెళ్లి చుక్కలకోడిని పట్టుకున్నాడు. అది లావుగా ఉండటం, కూర్చుని తింటూ ఉండటం వల్ల రంగయ్యకు పెద్దగా శ్రమ లేకుండానే దొరికిపోయింది. దాని చుట్టూనే కూర్చుని తింటున్న కోళ్లన్నీ భయంతో పరుగులు తీశాయి. చుక్కల కోడి ఎంత గింజుకున్నా లాభం లేకపోయింది. దాంతో అరవటం మొదలు పెట్టింది. దాని అరుపులకు అక్కడక్కడే తిరుగుతున్న కోళ్లన్నీ భయం భయంగా చూస్తూ ఒక దగ్గర చేరాయి. దానికి వచ్చిన ప్రమాదాన్ని గ్రహించి అన్నీ చాలా కంగారు పడ్డాయి. ‘చూశారా పిల్లలూ..! మన బద్ధకం మనకెంత ముప్పో, చెప్పిన మాట వినలేదు.. కూర్చుని తిని ఒళ్లు పెంచుకుంది.. మనకంటే ముందే ప్రాణాలు పోగొట్టుకోబోతోంది’ అన్నాయి బాధగా. అవునన్నట్లు తలూపుతూ చుట్టూ చూశాయి... మిగతా కోళ్లు.

- కన్నెగంటి అనసూయ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని