ముళ్లపంది మంచి మనసు!

ఒక కొలను గట్టున ఒక కప్ప తన పిల్లలతో నివాసం ఉంటోంది. అది పిల్లలకు ఆహారం తినిపిస్తున్నప్పుడు దానికి కాస్త దూరంలో ఒక పెద్ద పాము కనిపించింది. దాన్ని చూసి దాని పిల్లలు భయంతో వణికిపోయాయి. కప్పకూడా భయపడి బిగ్గరగా ‘కాపాడండి! కాపాడండి!’ అని అరిచింది.

Updated : 07 Oct 2021 01:14 IST

క కొలను గట్టున ఒక కప్ప తన పిల్లలతో నివాసం ఉంటోంది. అది పిల్లలకు ఆహారం తినిపిస్తున్నప్పుడు దానికి కాస్త దూరంలో ఒక పెద్ద పాము కనిపించింది. దాన్ని చూసి దాని పిల్లలు భయంతో వణికిపోయాయి. కప్పకూడా భయపడి బిగ్గరగా ‘కాపాడండి! కాపాడండి!’ అని అరిచింది..

ఆ దారిలో వెళుతోన్న ముళ్లపంది ఒకటి.. కప్ప కేకలు విని వచ్చింది. అప్పుడు కప్ప ఆ పామును చూపించి ‘అదిగో! ఆ పాము ఇక్కడికే వస్తోంది. నేను దానికి ఆహారమైనా ఫర్వాలేదు. కానీ నా పిల్లలు కూడా దానికి ఆహారం అవుతాయి. అవి లేకుండా నేను బతకలేను’ అంది.

అది విన్న ముళ్లపంది ‘నీకేం భయం లేదు మిత్రమా! మీ ప్రాణాలకు నా ప్రాణం అడ్డు. నీ పిల్లలను ఆ రాయి కిందకు తీసుకుని వెళ్లు’ అని ధైర్యం చెప్పింది. ఇంతలో అక్కడికి వచ్చిన ఆ పెద్ద పాము కప్పల వైపు వెళ్లసాగింది. అది గమనించిన ముళ్లపంది దాన్ని అడ్డుకుంది. ఆ రెండింటికీ భీకర పోరాటం మొదలైంది.

అప్పుడే అక్కడికి వచ్చిన ముళ్లపంది నేస్తం తాబేలు, ఇది గమనించింది. తన స్నేహితుడైన ముంగిసను పిలుచుకొని రావడానికి మెల్లగా అక్కడి నుంచి వెళ్లింది. ఈ సంగతి పాము, ముళ్లపందికి తెలియదు. అవి రెండూ తీవ్రంగా పోరాడుతూ గాయపడ్డాయి. అప్పుడు పాము చాలా అలసి పోయి ‘ఈ ముళ్ల పంది ఉండగా నా పప్పులు ఉడకవు’ అనుకొని మళ్లీ వద్దామని అక్కడి నుంచి అప్పటికి పారిపోయింది.

పాము వెళ్లడం గమనించిన కప్ప, రాయి కింద నుంచి బయటకు వచ్చి ముళ్లపందికి కృతజ్ఞతలు చెప్పింది. ‘మిత్రమా! సాటివారు ఆపదలో ఉన్నపుడు చూస్తూ వెళ్లిపోవడం ధర్మం కాదు. వారిని కాపాడితే వారికి సాయం చేశామన్న సంతోషం ఎప్పటికీ ఉంటుంది. నువ్వింక నిశ్చింతగా నీ పిల్లలకు ఆహారం తినిపించు’ అని అంది.

అప్పుడు ఆ కప్ప ‘అవి ఇంకా భయపడుతున్నాయి మిత్రమా!.. కాసేపు ఇక్కడే ఉండు’ అంది. అప్పుడు ముళ్లపంది సరేనంది.  

ఇంతలో మళ్లీ తిరిగి వద్దామని మరలిపోతున్న ఆ పాముకు తాబేలు, ముంగిసలు దూరంగా కనిపించాయి. వెంటనే ఆ పాము చెట్టు చాటున నక్కింది. అది దాక్కున్న చెట్టు దగ్గరకు వచ్చిన తాబేలు, ముంగిసతో.. ‘మన మిత్రుడు ముళ్లపంది, పాముతో పోరాడి చాలా గాయపడి ఉండవచ్చు. దానిది అసలే జాలి గుండె. కప్ప పిల్లలు చాలా చిన్నవి. వాటిని కాపాడటానికి అది ఎంతకైనా తెగిస్తుంది. ఈ క్రమంలో దాని ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. నేను మెల్లగా వస్తాలే. నువ్వు తొందరగా వెళ్లు మిత్రమా!’ అని అంది. అప్పుడు ముంగిస ‘అలాగే’ అంటూ వేగంగా ముందుకు కదలడాన్ని చూసిన పాము ‘ఇక ఇక్కడికి మళ్లీ రాకూడదు. తాబేలు, ముంగిస ఆ ముళ్లపందికి సాయపడటానికి వెళుతున్నాయి. ఇక్కడుంటే నా ప్రాణాలు కచ్చితంగా ప్రమాదంలో పడతాయి. ఇప్పటికే చావు తప్పి కన్నులొట్టపోయింది’ అని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ముంగిస అక్కడకు చేరుకుని ముళ్లపందితో ‘ఆ పాము ఎక్కడ?’ అని కోపంగా అడిగింది. ‘అది గాయపడి పారిపోయింది’ అని ముళ్లపంది చెప్పింది. ఇంతలో తాబేలు అక్కడకు వచ్చి ‘మిత్రమా! క్షేమమా! మీ పోరాటం చూసి నేను మన మిత్రుడైన ముంగిసను తీసుకుని వచ్చాను’ అంది. ఆ కప్ప వాటి వద్దకు వచ్చి ‘ఈ ముళ్లపంది నా పిల్లలకు, నాకు ప్రాణ దానం చేసింది. మీరు వెళ్లిన వెంటనే అది మళ్లీ వస్తుందేమో!’ అని అనుమానం వ్యక్తం చేసింది.

‘నువ్వేమీ భయపడకు. నువ్వు, నీ పిల్లలు హాయిగా ఉండండి. మేం ఇకపై ఈ చుట్టుపక్కలే తచ్చాడుతుంటాం. నీకు ప్రమాదం వాటిల్లితే గట్టిగా కేకలు వేయి. మరుక్షణంలో ఇక్కడ ఉంటాం’ అంది. ఆ పాము మళ్లీ రాలేదు. కప్ప, కప్ప పిల్లలు హాయిగా జీవించాయి.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని