కోతి పీఁ..పీఁ.. కుందేలు ఢుం.. ఢుం..!

అడవిలో జంతువులన్నీ ఉదయాన్నే సమావేశమయ్యాయి. మృగరాజు సింహం ప్రసంగం గంభీరంగా సాగిపోతోంది. ‘ఎవరైనా.. ఏదైనా ఇతరులకు ఉపయోగపడే విద్య కానీ, కళ కానీ సాధన చేయండి. అది ప్రయోజనకరంగా ఉండాలి. అలా చేసిన వారికి నేను మంచి బహుమతి ఇస్తాను’ అంది.

Updated : 22 Oct 2021 00:34 IST

అడవిలో జంతువులన్నీ ఉదయాన్నే సమావేశమయ్యాయి. మృగరాజు సింహం ప్రసంగం గంభీరంగా సాగిపోతోంది. ‘ఎవరైనా.. ఏదైనా ఇతరులకు ఉపయోగపడే విద్య కానీ, కళ కానీ సాధన చేయండి. అది ప్రయోజనకరంగా ఉండాలి. అలా చేసిన వారికి నేను మంచి బహుమతి ఇస్తాను’ అంది.

చీకట్లు ముసురుతున్న సమయంలో కోతిబావ చెట్టు వద్దకు తల్లి, పిల్ల చిలుకలు వచ్చి ‘కోతిబావా.. ఆ కొమ్మకు వేలాడదీసి ఉంది, సన్నాయి కదా! గూడెంలో ఉండే అప్పన్నది అనుకుంటా కదూ!’ అంది  రామచిలుక. ‘ఏయ్‌.. తల్లి చిలుకా, పిల్ల చిలుకా! వెళ్లండి.. నేను ఉదయం బ్రహ్మముహూర్తంలో సన్నాయి సాధన ప్రారంభించాలి’ అంది కోతి.

‘అబ్బో.. నీ ముఖానికి సన్నాయి సాధనా? కొక్కుపంది’ అని అనేసి పిల్ల చిలుక, తల్లితో కలిసి వెళ్లిపోయింది. ‘దీని మాటే కాదు.. తిట్టు కూడా అర్థమై చావదు’ అనుకుంటూ నిద్రపోయింది కోతి. బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి సన్నాయికి నమస్కరించి పీఁ.. పీఁ.. అని ఊదసాగింది కోతి. ఆ సన్నాయి శబ్దానికి జంతువుల పిల్లలన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడి భయంతో ఏడుపు అందుకున్నాయి. పెద్ద జంతువులు, పక్షులు తలనొప్పితో గిలగిలలాడుతూ కోతి ఉన్న చెట్టు దగ్గరకు చేరాయి.

‘ఒరేయ్‌.. తింగరోడా.. నా బిడ్డ జడుసుకుంది. ఆపరా బాబూ నీ ఊదుడు’ అంది తల్లి చిలుక. ‘కుదరదు కాక కుదరదు.. కాసేపు ఆగండి కుందేలు మామ కూడా ఇంకాసేపట్లో డోలు సాధన చేయడానికి వస్తుంది. ఇద్దరం కలిసి ఉమ్మడిగా సంగీత సాధన చేస్తాం’ అంది కోతి.

ఇంతలోనే తన డోలు వాయించుకుంటూ వచ్చిన కుందేలు.. అక్కడ ఉన్న జంతువులను చూసి ‘ఆహా.. ఏమి ఆనందం.. ఏమి ఆనందం.. కోతి బావ సాధన చేస్తుంటే తొలిరోజే ఇన్ని జీవులు అభినందించడానికి వచ్చాయా? నాకు చాలా ఆనందంగా ఉంది’ అంది. కోపం ఆపుకోలేని గుర్రం ఎగిరి వెనక కాళ్లతో కుందేలును బలంగా ఒక్క తన్ను తన్నింది. ఆ దెబ్బకు కుందేలు డోలుతో సహా ఎగిరి చెరువు మధ్యలో పడింది.

‘కోతి బావ.. నీకు మర్యాదగా చెబుతున్నాం. ముందు ఆ సన్నాయి సాధన ఆపు. దాన్ని అప్పన్నకు అప్పజెప్పు. అతనికి ఇదే జీవనాధారం. ఏది ఏమైనా మన ఆనందం ఎదుటివారికి ఇబ్బంది కలిగించకూడదు. ఈ మాత్రం తెలియదా నీకు?’ అంది తల్లి చిలుక. ‘తెలియదా నీకు కోతి పిచ్చి!’ అంది వచ్చీ రాని మాటలతో పిల్ల చిలుక తన తల్లికి మద్దతుగా.

‘మీరు ఏమైనా అనండి.. ఎంతైనా అనండి. నేను సన్నాయి ఇవ్వను గాక ఇవ్వను. నేను సాధన చేయాల్సిందే. మృగరాజు ఇచ్చే బహుమానం సొంతం చేసుకోవాల్సిందే’ అంది పట్టుదలగా కోతి. అప్పటి వరకు ఎంతో సహనంతో ఉన్న ఏనుగు ఒక్కసారిగా తన తొండంతో కోతిని అమాంతం చుట్టేసి చెరువులోకి విసిరింది. ‘ఈ సన్నాయి అప్పన్నకు ఇవ్వకపోయినా.. నువ్వు మరోసారి ఊదినా నీకు చావు తప్పదు’ అని ఏనుగు హెచ్చరించి.. అడవంతా దద్దరిల్లేలా ఘీంకరించింది. దెబ్బకు జడుసుకున్న కోతి వెంటనే గూడేనికి పరుగు తీసి సన్నాయిని అప్పన్న ఇంట్లోకి కిటికీలోంచి విసిరేసి వచ్చేసింది.

- బెల్లంకొండ నాగేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని