అడవిలో అలజడి!

ఒక అడవిలో ఓ కోతి ఎప్పుడూ ఏదో ఒక వెర్రి పని చేసి మిగతా జంతువుల్ని విసిగించేది. అస్సలు కుదురుగా ఉండేది కాదు. ఒకసారి కోతికి కాలక్షేపం కాక అడవి బయటకు వెళ్లింది. పొలం కనబడితే అందులోకి పరుగు తీసింది. అక్కడొక అరటిచెట్టుకు అరటిపళ్లు ఉంటే తింది.

Updated : 02 Nov 2021 03:17 IST

క అడవిలో ఓ కోతి ఎప్పుడూ ఏదో ఒక వెర్రి పని చేసి మిగతా జంతువుల్ని విసిగించేది. అస్సలు కుదురుగా ఉండేది కాదు. ఒకసారి కోతికి కాలక్షేపం కాక అడవి బయటకు వెళ్లింది. పొలం కనబడితే అందులోకి పరుగు తీసింది. అక్కడొక అరటిచెట్టుకు అరటిపళ్లు ఉంటే తింది. నెమ్మదిగా గట్టెక్కింది. అక్కడ దానికొక బుట్ట కనబడింది. తినడానికి ఇంకేమైనా దొరుకుతుందన్న ఆశతో మూత తీసిన కోతికి, రైతు తెచ్చుకున్న భోజనం పొట్లం కనబడింది. రైతు దూరంగా పొలంలో ఎక్కడో ఉండడంతో కోతిని చూడలేదు. అన్నం పొట్లాన్ని విప్పిన కోతికి పెరుగన్నం, బెల్లంముక్క కనిపించాయి. బెల్లం చూడగానే కోతికి నోరూరింది. కడుపులో ఖాళీ లేకపోవడంతో తర్వాత తినొచ్చని దాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది.

చెట్టెక్కిన కోతి.. తెచ్చిన బెల్లం ముక్కను ఆకుల మధ్య పెట్టి కొమ్మ మీద దాచింది. చేతికి అంటిన బెల్లం జిగురును తోకతో తుడుచుకుంది. దానికి అనుకోకుండా నిద్రపట్టేసింది. కాసేపటికి చెట్టు కింద ఉన్న చీమలకు బెల్లం వాసన తగిలింది. అవి వరుసగా వెళ్లి బెల్లంముక్కను కొరుక్కుని పుట్టలోకి తీసుకుపోసాగాయి. కొన్ని చీమలు కోతి తోక మీద అంటుకున్న బెల్లం జిగురును తినాలనుకుని అటు వెళ్లాయి. వాటిలో ఒక చీమ, కోతి తోక మీద కుట్టింది.

అప్పుడే కోతి కలకంటోంది. కలలో దాన్ని కాటెయ్యడానికి ఒక పాము వచ్చింది. చీమ కుట్టిన బాధనే పాము కాటేసినట్టు భ్రమ పడింది కోతి. ఉలిక్కిపడి భయంతో చెట్టు మీద నుంచి దూకేస్తూ.. ‘అమ్మో.. పాము’ అని అరిచింది. చెట్టుకింద అప్పటికే ఒక జింక పడుకుని ఉంది. కోతి దాని మీద పడింది. జింకకు అసలే భయమెక్కువ. ఇలా హఠాత్తుగా కోతి మీద పడేసరికి మరింత భయపడిందది. ‘పాము’ అని కోతి అరవడం కూడా వింది. దాంతో పరుగు మొదలుపెట్టింది అది. వెనక్కు చూడకుండా పరిగెడుతున్న జింక, ఒక చెట్టు కింద నుంచి వెళుతుండగా కొమ్మ మీద నుంచి వేలాడుతున్న ఒక పాము దాని కొమ్ముల్లో చిక్కుకుంది. అది బుసలు కొట్టడం మొదలుపెట్టింది. పాము బుసలు తన తల మీద నుంచే వినబడేసరికి జింకకు భయం మరింత పెరిగి ఇంకా వేగంగా పరిగెత్తింది.

అప్పటికే పొద వెనుక నక్కి చూస్తున్న ఒక పులి అటే వస్తున్న జింకను అందుకోవాలనుకుంది. ఒక్క ఉదుటున ఎగిరింది పులి. కానీ జింక కొమ్ముల్లో వేలాడుతున్న పామును చూడగానే బెదిరిపోయి పక్కకు వెళ్లిపోయింది.

అలా వెళ్లిన పులి అక్కడే ఆహారం తింటున్న ఏనుగు మీద పడింది. తన మీద పడిన బరువుకు ఏనుగుకు చిరాకు పుట్టింది. అదేమిటో చూడకుండా తొండంతోలాగి గిరగిరా తిప్పి విసిరేసింది. పులి దూరంగా వెళ్లి అడవి దున్నను వేటాడుతున్న సింహానికి అడ్డంగా పడింది. దాంతో సింహం సరిగా వేటాడలేకపోయింది. అడవిదున్న తప్పించుకుని పారిపోయింది. వేట తప్పిపోవడంతో సింహానికి కోపం వచ్చింది. పులిని ఒక దెబ్బ వేసింది. ‘నా తప్పేమీ లేదు మృగరాజా! ఏనుగు విసిరితే వచ్చి పడ్డాను’ అంది గాయాన్ని తడుముకుంటూ పులి. ఏనుగును అడిగితే ‘నాకేమీ తెలియదు. ఏదో మీద పడితే విసిరేశాను. అది పులి అని తెలియదు’ అంది.

ఆ జవాబుతో సింహానికి కోపం పెరిగింది. ఏనుగు మీద దాడి చెయ్యబోగా ఒక చిలుక వచ్చి ‘ఆగండి మృగరాజా!.. ఏమి జరిగిందో చెబుతాను’ అంటూ కోతి జరిగిన సంగతి చెప్పింది. అంతేకాక ‘జింక ఇంకా పరిగెడుతోంది. దాన్ని పాము కాటేస్తుందేమో’ అంది చిలుక. ‘సరే.. నువ్వెళ్లి గద్దను పిలిచి జింక కొమ్ముల్లోని పామును తియ్యమను’ అని చిలుకను పంపింది సింహం. దగ్గర్లోని చెట్టు మీదున్న కొంగను పిలిచి ‘జింక పక్కనే ఎగిరి భయపడవద్దని చెప్పు’ అంది సింహం. అవతల జింక వేగానికి మరింత భయపడిపోయిన పాము కాటేయడం మరిచిపోయింది. దాని కాళ్లకింద పడిపోకుండా మెడ చుట్టూ గట్టిగా చుట్టుకుంది పాము. మెడచుట్టూ ఉచ్చు బిగుసుకున్నట్లు అవడంతో ఇంకా భయంతో పిచ్చెక్కినట్లు పరిగెత్తింది జింక.

ఈలోగా చిలుక వెళ్లి గద్దను పిలిచింది. కొంగ వెళ్లి.. భయపడొద్దని, ప్రమాదం లేదని జింకకు చెప్పింది. చిలుక పక్కనే ఎగురుతూ వచ్చిన గద్ద జింక మెడలోని పామును కాళ్లతో అందుకుని దూరంగా పడేసింది. కొంతసేపటికి పరుగు ఆపింది జింక. అడవిలో అలజడికి కారణమైన కోతికి జరిగిందంతా చిలుక చెప్పగా విని, ఒకటే పగలబడి నవ్వింది. తర్వాత కోతిని పిలిచి గట్టిగా మందలించింది సింహం.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని