తగవు తగదు

ఉదయాన్నే తమ పక్కింటాయన ఎవరి మీదో కేకలు వేస్తున్నాడు. అది విని పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్న నందు బయటికి వచ్చి చూశాడు. పక్కింటాయన దెబ్బలాడుతున్నది ఎవరితోనో కాదు నందు వాళ్ల నాన్నతోనే. ఆయన మొక్కలకు నీళ్లు పెడుతుంటే.. కొన్ని నీళ్లు పక్కింటి వాళ్ల పెరట్లో దండెం మీద ఆరేసిన బట్టల మీద పడ్డాయట. అవి తడిచి పోయాయట. పక్కింటాయన నాన్నతో ఆ విషయం

Updated : 03 Nov 2021 00:30 IST

దయాన్నే తమ పక్కింటాయన ఎవరి మీదో కేకలు వేస్తున్నాడు. అది విని పాఠశాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్న నందు బయటికి వచ్చి చూశాడు. పక్కింటాయన దెబ్బలాడుతున్నది ఎవరితోనో కాదు నందు వాళ్ల నాన్నతోనే. ఆయన మొక్కలకు నీళ్లు పెడుతుంటే.. కొన్ని నీళ్లు పక్కింటి వాళ్ల పెరట్లో దండెం మీద ఆరేసిన బట్టల మీద పడ్డాయట. అవి తడిచి పోయాయట. పక్కింటాయన నాన్నతో ఆ విషయం మీదే పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నట్టు అర్థమయింది నందుకి. నందు వాళ్ల నాన్నేమో ‘పొరపాటై పోయింది’ అని క్షమాపణలు చెప్పి బతిమాలుతున్నారు. కానీ, పక్కింటాయన వినిపించుకోకుండా అదే పనిగా నాన్న మీద బిగ్గరగా అరుస్తూనే ఉన్నాడు. ఇటు చూస్తే నందుకి పాఠశాలకు సమయం కావస్తోంది. చేసేదేమీ లేక సైకిల్‌ ఎక్కి వెళ్లిపోయాడు.

నాలుగు రోజుల తరువాత.. పక్కింటాయన, వాళ్ల ఇంట్లోని చెత్తను పెరటి గోడ వెనకకు విసిరేశాడు. కొంత మురికి, చెత్తా గాలికి ఎగిరి.. నందు వాళ్ల పెరట్లోని మొక్కల దగ్గర పడింది. అక్కడంతా చిందరవందరగా అయింది. అది గమనించిన నందు వాళ్ల నాన్న దాన్ని చీపురుతో జాగ్రత్తగా చేటలోకి ఎత్తి వీధి చివర ఉన్న చెత్తకుండీలో వేసి వచ్చాడు.

అది చూసిన నందుకి కోపం వచ్చేసింది. సర్రున వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లి.. ‘అదేమిటి నాన్నా! ఆ చెత్తను పక్కింటాయన కదా తీసుకువెళ్లి చెత్త కుండీలో వెయ్యాలి.. పైగా మన ఇంటిలో పడిన వాళ్ల చెత్తను వాళ్లే తీసేయాలి కదా. మొన్న కాసిన్ని నీళ్లు వాళ్ల దండెం మీది బట్టల మీద పడ్డాయని ఆయన మీ మీద దెబ్బలాటకు కూడా వచ్చాడు కదా. ఈ రోజు వాళ్ల చెత్త పడినందుకు నువ్వు కూడా ఆయనతో దెబ్బలాడవచ్చు కదా?’ అని గుక్కతిప్పుకోకుండా అడిగాడు.
అప్పుడు నందు వాళ్ల నాన్న చిన్నగా నవ్వి ‘అది సరే గానీ.. ఆ మధ్యన నువ్వు  ఆడుకుంటుంటే మన ఎదురింటి వాళ్ల కుక్కపిల్ల రక్తం వచ్చేలా నీ కాలుని కరిచింది కదా! అప్పుడు నువ్వు దాన్ని తిరిగి ఎందుకు కరవలేదు?’ అని అడిగాడు. ‘అలా ఎలా కరుస్తాను నాన్నా?’ అని అన్నాడు నందు విస్మయంగా. ‘కదా! కుక్కపిల్ల నిన్ను కరిస్తే, తిరిగి నువ్వు దాన్ని కరవ లేదు. ఆ గాయానికి వైద్యుడితో చికిత్స చేయించుకున్నావు. ఆ తరువాత నుంచీ ఆ కుక్కకి దూరంగా ఉంటున్నావు కదా’ అన్నాడు.

‘అవును.. అయితే?’ అన్నాడు నందు. ‘ఇప్పుడు నేను ఆయన మీద గొడవకు వెళ్లాననుకో. అది మరి కొన్ని ఆవేశాలకు దారి తీస్తుంది. అలా ఒకరిపై మరొకరికి కక్షలు పెరిగిపోతాయి. ఆయన నన్ను శత్రువులానే చూస్తాడు. అలా కాకుండా ఉండాలనే.. నేను ఆయనను ఏమీ అనలేదు. మౌనంగా ఆ చెత్తను నేనే ఎత్తి కుండీలో పారేసి వచ్చాను. ఇప్పుడు కోపం ఉన్నా, ఏదో ఒకరోజు ఆయనే తెలుసుకుంటాడు’ అని వివరించి చెప్పాడు నాన్న నందుతో. నాన్న చెప్పిన విషయం అర్థమయిందన్నట్లుగా తల ఊపాడు నందు.

ఇంతలో తన కారణంగా వాళ్ల ఇంటి ఆవరణలో పడిన చెత్తను తీసి, చెత్త కుండీలో పారేసి వచ్చిన నందు వాళ్ల నాన్నను గమనించాడు పక్కింటాయన. నందు వాళ్ల నాన్న మంచితనాన్ని కళ్లారా చూసిన ఆయన, ఇంటికి వెళ్లి క్షమాపణలు అడిగాడు. వెంటనే నాన్న ఆయన భుజం మీద స్నేహంగా తట్టారు. అది చూసి నందు చాలా సంతోష పడిపోయాడు. నాన్న ఎందుకు అలా చేశాడో అప్పుడు నందుకు పూర్తిగా అర్థమైంది. 

- కోనే నాగ వెంకట ఆంజనేయులు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని