కాకి ఉపాయం!

అనగనగా ఓ ఊరు. ఆ ఊర్లో ఓ కాకి జంట ఉండేది. అవి ఓ వేపచెట్టు మీద గూడు కట్టుకుని హాయిగా జీవిస్తున్నాయి. రోజూ ఆహారం కోసం వెళ్లి, సాయంత్రానికి గూటికి చేరుకునేవి. కొన్ని రోజులు గడిచాక వాటికి సంతానం కలిగింది. ఆ పిల్లల్ని ఆ కాకుల జంట కంటికిరెప్పలా ఎంతో అపురూపంగా చూసుకునేది.

Updated : 10 Nov 2021 06:35 IST

అనగనగా ఓ ఊరు. ఆ ఊర్లో ఓ కాకి జంట ఉండేది. అవి ఓ వేపచెట్టు మీద గూడు కట్టుకుని హాయిగా జీవిస్తున్నాయి. రోజూ ఆహారం కోసం వెళ్లి, సాయంత్రానికి గూటికి చేరుకునేవి. కొన్ని రోజులు గడిచాక వాటికి సంతానం కలిగింది. ఆ పిల్లల్ని ఆ కాకుల జంట కంటికిరెప్పలా ఎంతో అపురూపంగా చూసుకునేది.

ఇలా రోజులు గడుస్తున్నాయి. ఇంతలో మండువేసవి వచ్చింది. అప్పటికింకా ఆ కాకిపిల్లలకు ఎగిరే వయసు రాలేదు. తల్లి కాకి ఆహారం నోట కరుచుకుని తెచ్చి, వాటికి అందించేది. తమ తల్లి అందించే ఆహారాన్ని అవి ఎంతో ఆనందంగా తినేవి.

ఒకరోజు.. ఎవరో బయట వదిలిన ఆవకాయ అన్నపు మెతుకులు కనిపించాయి. వాటిని తల్లి కాకి జాగ్రత్తగా తెచ్చి వాటి బుజ్జి పిల్లల నోట్లో పెట్టింది. ఆవకాయ రుచి బాగా నచ్చి ఆవురావురుమంటూ పిల్లలన్నీ తిన్నాయి. తినడమైతే తిన్నాయి కానీ, వాటికి వెంటనే దాహం వేసి.. గగ్గోలు పెట్టాయి. పాపం తల్లి కాకికి ఏం చేయాలో పాలు పోలేదు. కారణం కాకి పిల్లలకు గూడు దాటి బయటకు వచ్చే వయసు రాలేదు మరి.

కాస్త దూరంలోనే ఓ పిల్ల కాలువ ఉంది. కానీ ఆ నీళ్లు నోట ఉంచుకుని తెచ్చే అవకాశం లేదు. ఏం చేయాలో పాలుపోక అటూఇటూ తిరగసాగింది. పిల్లలు దాహంతో కావ్‌.. కావ్‌..మని అరుస్తుంటే తల్లి కాకి హృదయం ద్రవించిపోతోంది.

ఈలోపు ఆహారం కోసం బయటకు వెళ్లిన మగకాకి వచ్చింది. తల్లి కాకి ఆతృత పట్టలేక.. ‘పిల్లలు దాహంతో అలమటించి పోతున్నాయి. ఏదో ఒకటి చేసి వాళ్లకు నీళ్లు పట్టుకు రా..’ అని ఏడుస్తూ చెప్పింది. నువ్వేం కంగారు పడకు. ఒక్క క్షణంలో పట్టుకొస్తానని చెప్పి, ఎగురుకుంటూ వెళ్లింది మగకాకి.

దానికి కొంతదూరంలో ఒక బూరుగు చెట్టు కనిపించింది. దానికున్న బూరుగు కాయల్లో ఎండిపోయి, విచ్చుకున్న ఒక దాన్ని చూసింది. దానిలో నుంచి బయటకు వస్తున్న దూదిని నోట కరుచుకుని పిల్ల కాలువ దగ్గరకు వెళ్లింది. ఆ దూదిని  నీటిలో ముంచింది. అది నీటిని పీల్చుకుంది.  కాకి ఎగురుకుంటూ వచ్చి పిల్లల నోటి ముందు పెట్టింది. తల్లి కాకిని తన నోటితో ఆ దూదిని పిండమని చెప్పింది. అంతే చకచకా దాని నుంచి నీళ్లు వచ్చాయి. కాకి పిల్లలన్నీ వాటిని తాగి తమ దాహాన్ని తీర్చుకున్నాయి.

- కొమ్ముల వెంకట సూర్యనారాయణ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని