మృగరాజు ఇచ్చిన ధైర్యం!

సాయంత్రం కావస్తోంది. అడవిలో తిరుగుతుండే జంతువులు తమ తమ స్థావరాలకు వెళుతున్నాయి. ఆ సమయంలో వేరే అడవి నుంచి ఒక తోడేలు అక్కడికి వచ్చింది. తన రాకను చూసి కూడా కుందేళ్లు ఏ బెదురూ లేకుండా ఉండటం తోడేలుకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది.

Updated : 19 Nov 2021 00:51 IST

సాయంత్రం కావస్తోంది. అడవిలో తిరుగుతుండే జంతువులు తమ తమ స్థావరాలకు వెళుతున్నాయి. ఆ సమయంలో వేరే అడవి నుంచి ఒక తోడేలు అక్కడికి వచ్చింది. తన రాకను చూసి కూడా కుందేళ్లు ఏ బెదురూ లేకుండా ఉండటం తోడేలుకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. కుందేళ్లకు దగ్గరగా వెళ్లి ‘ఎంత ధైర్యం? నేనంటే మీకు భయం లేదా?’ అని అడిగింది. ‘మా మృగరాజు ఉండగా మాకెందుకు భయం?’ అన్నాయి కుందేళ్లు. ‘నేను మిమ్మల్ని చంపితింటాను. ఎక్కడో దూరంగా ఉన్న మీ మృగరాజు ఏం చేస్తుంది?’ అంది తోడేలు.

అప్పుడు చెట్టుపై ఉన్న కాకి ‘ఓ తోడేలూ.. ఆ పని చేసిచూడు. ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. మా అడవి సంగతి నీకు తెలియనట్లుంది’ అని జోక్యం చేసుకుంది. కాకి అలా అనే సరికి తోడేలు కుందేళ్ల మీద దాడి చేయడానికి జంకింది. అక్కడ నుంచి మరి కొంత దూరం వెళ్లింది. అక్కడ అడవి మేకలు కనిపించాయి. తోడేలుకు నోరూరింది. అడవి మేకలు కూడా తనను చూసి బెదరలేదు. వెనకడుగు వెయ్యలేదు. కుందేళ్లను అడిగినట్లే తోడేలు.. ‘ఎంత ధైర్యం నీకు.. నేనంటే భయం లేదా?’ అని అడిగింది. మేకలు అప్పుడు కుందేళ్లు జవాబు ఇచ్చినట్లుగానే ‘మా మృగరాజు ఉండగా మాకు ఎందుకు భయం?’ అన్నాయి. ‘నేను మిమ్మల్ని చంపి తింటాను. ఎక్కడో ఉన్న మీ మృగరాజు ఏం చేయగలదు?’ అంది తోడేలు. అప్పుడు అక్కడే చెట్టు మీద నుంచి ఒక చిలుక ‘చేసి చూడు. ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది.’ అంది. తోడేలు అయోమయంలో పడింది. ఇదేదో వింత అడవిలా ఉందే అనుకుంది.

అంతలో జింక పిల్లలు మరో దారిలో వెళ్లడం తోడేలు గమనించింది. మేకలను వదిలి జింక పిల్లల వైపు పరుగు తీసింది. అక్కడ కూడా తోడేలుకు ఇందాకటి అనుభవమే ఎదురైంది. ఒక గుడ్లగూబ ‘జింక పిల్లల జోలికి పోకు. వాటికేమైనా జరిగితే నీ జీవితం ఈ అడవిలో ముగిసిపోతుంది’ అని పలికింది. తోడేలు ఆలోచనలో పడింది. కడుపులో ఆకలి, ఎదురుగా బోలెడు కుందేళ్లు, మేకలు, జింకపిల్లలు.. అయినా.. వాటి మీద దాడి చేయడానికి ధైర్యం సరిపోవడం లేదు.

‘కనిపించని మృగరాజు పేరు చెప్పి తనను హడలెత్తిస్తున్నాయా ఏంటి?’ అనుకుని సందేహంలో పడింది తోడేలు. పరిస్థితి గమనించి గుడ్లగూబ ‘ఓ తోడేలూ! ఏంటి.. ఏదో ఆలోచిస్తున్నావు. నీ ఆకలి తీరే మార్గం ఈ అడవిలో దొరకదు. ప్రాణం దక్కించుకుంటే మరో అడవిలో అయినా బతకవచ్చు’ అని హితవు పలికింది. ‘మరి మృగరాజు జంతువులను చంపి తినదా? అది శాకాహారా?’ అని అడిగింది తోడేలు. ‘మా మృగరాజు మాంసాహారే! కానీ ఈ అడవి జంతువులను మాత్రం తినదు. ఇక్కడ జీవులను తినడానికి వచ్చే వేరే అడవి జంతువులను తింటుంది. ఆ నియమం వల్లే ఇక్కడ జంతువులను కన్నబిడ్డల్లా కంటికి రెప్పలా చూసుకుంటుంది. నిన్నటి నుంచి ఏ జంతువూ రాలేదు. ఈ రోజు నువ్వు కనిపించావు. నీకు మూడింది పో’ అని అంది గుడ్లగూబ.

అంతలో అడవంతా పక్షుల గోల. ఆ వెంటనే గుహ నుంచి దిక్కులు పిక్కటిల్లేటట్లు సింహగర్జన వినిపించింది. అంతే.. బతుకుజీవుడా! అనుకుంటూ తోడేలు క్షణాల్లో ఆ అడవి నుంచి పరుగుపరుగున బయటపడింది. అచ్చం సింహంలా గర్జిస్తూ ఎలుగుబంటి గుహ నుంచి బయటకు వచ్చి పెద్దగా నవ్వింది. అడవిలో శాకాహార జంతువులన్నీ కలిసి తమను తాము రక్షించుకోవడానికి ఇలా నాటకమాడుతున్నాయన్న విషయం వేరే అడవి జంతువులకు ఎప్పటికీ తెలియలేదు.

- బెలగాం భీమేశ్వరరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని