చంద్రయ్య మంచితనం!

చంద్రయ్య సంతలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చంద్రయ్యకు వినికిడి సమస్య ఉంది. ఒకరోజు శంకరయ్య అనే అతను సంతలో కావల్సిన వస్తువులు కొనుగోలు చేసి వాటిని ఇంటికి చేర్చడానికి కూలికోసం చూస్తుండగా చంద్రయ్య కనిపించాడు.

Updated : 25 Nov 2021 01:14 IST

చంద్రయ్య సంతలో కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చంద్రయ్యకు వినికిడి సమస్య ఉంది. ఒకరోజు శంకరయ్య అనే అతను సంతలో కావల్సిన వస్తువులు కొనుగోలు చేసి వాటిని ఇంటికి చేర్చడానికి కూలికోసం చూస్తుండగా చంద్రయ్య కనిపించాడు. ‘చంద్రయ్యా! మా ఇంటికి ఈ సరకుల మూటను చేర్చాలి’ అన్నాడు. ‘అలాగే.. కూలీ ఎంత ఇస్తారు బాబుగారూ..’ అన్నాడు చంద్రయ్య. ‘అయిదు రూపాయలిస్తాను’ అన్నాడు శంకరయ్య. ‘ఆ.. సరిగా వినబడలేదు బాబుగారూ..’ అన్నాడు చంద్రయ్య. అయిదు రూపాయలు అని వేళ్లు చూపించాడు. ‘సరే .. పదండి’ అని చంద్రయ్య, సరకుల మూటను తల మీద పెట్టుకుని శంకరయ్యను అనుసరించాడు.  

శంకరయ్య తన చేతిలో రెండు చిన్న సంచులను పట్టుకున్నాడు. ఇంటికి చేరుకోగానే వస్తువుల మూటను దింపాడు చంద్రయ్య. ‘ఇదిగో నీ కూలీ’ అని నాలుగు రూపాయలు ఇచ్చాడు శంకరయ్య. ‘అదేంటి బాబుగారూ.. అయిదు రూపాయలని నాలుగు రూపాయలే ఇస్తున్నారు’ అన్నాడు చంద్రయ్య. ‘నీకు చెవుడే కాదు.. చూపు కూడా మందగించినట్టుంది. నేను నాలుగు రూపాయలిస్తానని.. నాలుగు వేళ్లు చూపించాను’ అని అబద్ధం ఆడాడు శంకరయ్య. చంద్రయ్య.. వాదించడం ఎందుకు అని.. ‘నాదే పొరపాటు అయ్యుంటుంది బాబుగారూ..’ అని ఇంటి ముఖం పట్టాడు.

కాసేపటికి శంకరయ్య ఇంటి తలుపు చప్పుడయ్యింది. శంకరయ్య తలుపు తీసి చూస్తే.. వాకిట్లో చంద్రయ్య నిలబడి ఉన్నాడు. ‘ఏంటి చంద్రయ్యా.. మళ్లీ వచ్చావు’ అన్నాడు. ‘బాబుగారూ.. దారిలో ఈ సంచి పడి ఉంది. దీన్ని మీ చేతిలో ఉండగా చూశాను, మీదే అయి ఉంటుందని తెచ్చాను’ అన్నాడు చంద్రయ్య.

శంకరయ్య సంచిని చూడగానే గుర్తుపట్టాడు. అది తన చేతిలోనుంచి జారిపడినట్లుంది. సంచిని తీసుకుని చూశాడు. అందులో డజను సబ్బులున్నాయి. ఒక్కొక్క సబ్బు ఖరీదు ముఫ్పై రూపాయలు. ‘చంద్రయ్య వాటిని తేకుండా, సంతలో సగం ధరకు అమ్ముకున్నా నూట ఎనభై రూపాయలు వచ్చేవి. కానీ అతను నిజాయతీగా తెచ్చి ఇచ్చాడు’ అని మనసులో అనుకున్నాడు. తను చంద్రయ్యకు చేసిన మోసం గుర్తొచ్చి, సిగ్గుపడి.. ‘చంద్రయ్యా! నువ్వు నిజాయతీగా సంచిని తెచ్చి ఇచ్చినందుకు నీకు అదనంగా అయిదు రూపాయలిస్తున్నాను.. తీసుకో’ అని ఇవ్వబోయాడు. ‘బాబుగారూ! నా కళ్లు ఇంకా మసకబారలేదు. అందువల్లే మీ సంచి దారిలో దొరికింది. నాకు మీరు అయిదు రూపాయలు ఇవ్వక్కర్లేదు. నాకు ఇస్తానన్న మిగతా ఒక్క రూపాయి ఇవ్వండి చాలు’ అన్నాడు శంకరయ్య మారు మాట్లాడకుండా చంద్రయ్యకు ఇవ్వాల్సిన రూపాయి ఇచ్చాడు. అది తీసుకుని వెళ్లిపోయాడు చంద్రయ్య. శంకరయ్య తను చేసిన దానికి బుద్ధి తెచ్చుకుని, ఇక ఎవరినీ ఎప్పుడూ మోసం చేయకూడదని నిర్ణయించుకున్నాడు.

- యు.విజయశేఖర రెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని