గాజు పూలకుండీ..!

పల్లవ దేశాన్ని పూర్వం.. జయంతుడు పాలించేవాడు. అతని భార్య లీలావతి. యువరాణి పద్మావతిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. పద్మావతికి దేశదేశాల నుంచి వింత వస్తువులు సేకరించే అలవాటు ఉంది. ఏదైనా వస్తువు పాడైతే దాన్ని బయట పారేయించేది.

Updated : 12 Dec 2021 04:25 IST

పల్లవ దేశాన్ని పూర్వం.. జయంతుడు పాలించేవాడు. అతని భార్య లీలావతి. యువరాణి పద్మావతిని ఎంతో అల్లారు ముద్దుగా పెంచారు. పద్మావతికి దేశదేశాల నుంచి వింత వస్తువులు సేకరించే అలవాటు ఉంది. ఏదైనా వస్తువు పాడైతే దాన్ని బయట పారేయించేది.
పద్మావతి ఒకసారి ఒక గాజు పూలకుండీని తెప్పించింది. అది ఎన్నో రత్నాలతో పొదగబడి, ఎంతో అందంగా ఉండేది. దాన్ని తన ప్రత్యేక మందిరంలో పెట్టుకుని ఎంతో అపురూపంగా చూసుకునేది. ఆ మందిరాన్ని సీత, వనజ, సుమిత్ర, రేణుక అనే నలుగురు చెలికత్తెలు అందంగా అలంకరించేవారు.
ఒక రోజు ఆ గాజు పూలకుండీ పగిలిపోయింది. నలుగురు చెలికత్తెలను పిలిపించి ఎవరు పగలగొట్టారో చెప్పమని నిలదీసింది యువరాణి. నలుగురు వరుసగా నిలబడ్డారు. ‘నేను కాదు, నేను కాదు’ అన్నారు సీత తప్ప మిగతా ముగ్గురు. సీత వేలికి కట్టు కట్టి ఉంది. సీతను నిలదీసింది పద్మావతి. ‘యువరాణీ! పగిలిన గాజు ముక్కలు మీ కాలిలో ఎక్కడ గుచ్చుకుంటాయోనని వాటిని కుప్ప చేసి ఎత్తుతుండగా ఒక గాజు ముక్క గుచ్చుకుంది. అంతేకానీ ఎవరు పగలగొట్టారో మాత్రం నాకు తెలియదు’ అంది సీత. ‘ఆమె వేలికి గాజు ముక్క గుచ్చుకున్న ఆధారం దొరికింది కాబట్టి ఆమే గాజుకుండీని పగలగొట్టింది అనడానికి ఎటువంటి సందేహమూ లేదు’ అని ముక్తకంఠంతో అన్నారు వనజ, సుమిత్ర, రేణుక.
అప్పుడే అక్కడకు వచ్చి అందరి మాటలు విన్న మంత్రి సుశర్మ ‘యువరాణీ! విచారణ తర్వాత జరుగుతుంది. ముందుగా సీతను చెరశాలలో పెట్టిద్దాము’ అన్నాడు. దానికి యువరాణి సరే అని ‘ఈ గాజు ముక్కలను బయట పారేయండి’ అని మిగతా ముగ్గురు చెలికత్తెలకు చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయింది.
ఆ ముగ్గురు చెలికత్తెలు ఒక సంచిలో ఆ ముక్కలను భద్రపరిచారు. కొలువు అయిపోయాక ఆ సంచిని తీసుకుని దారిలో ఒక పాడుపడ్డ ఇంటి వద్దకు చేరుకున్నారు. అక్కడ కూర్చుని గాజుముక్కల నుంచి ఒక్కో రత్నాన్ని వేరు చేశారు. ‘మొత్తం వంద రత్నాలు ఉండాలి. జాగ్రత్తగా గాజు ముక్కలను పగలగొట్టి విడదీయండి’ అని సుమిత్ర, రేణుకతో అంది వనజ.
‘గాజు కుండీ పగిలేలా ప్రణాళిక భలే రచించావు’ అన్నారు సుమిత్ర, రేణుక. ‘అవును గాజుకుండీ వచ్చిన రోజు నుంచి దాని మీద ఉన్న రత్నాలను లెక్కబెట్టాను.. సీత నిజాయతీ కలది. ఆమె సహకరించదు. అందుకే ఈ ఒక్క కుండీతో మన ముగ్గురి కష్టాలు తీరతాయి. అని మీతో చెప్పాను. నేను చేసే పనికి మీరు సహకరిస్తామన్నారు. ఆ ధైర్యంతోనే పూలకుండీ పగలగొట్టి పక్కకు తప్పుకున్నాను. అదే సమయానికి సీత రావడంతో ఆ తప్పు ఆమె మీద సులువుగా పడింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు..’ అంది వనజ.
‘ఒక్కొక్కరికీ ముప్ఫైమూడు వస్తాయి. ఒకటి మాత్రం మిగులుతోంది’ అంది సుమిత్ర. ‘దాన్ని నేనే తీసుకుంటాను’ అంది వనజ. ‘అవును అది నువ్వు తీసుకోవడమే ఉత్తమం’ అంది రేణుక. ‘అమ్మల్లారా..! మీ ముగ్గురూ గొప్పవారు అవుతున్నారు. ఆ ఒక్కటి ఈ బిచ్చగాడికి ఇస్తే మీకు కాస్త పుణ్యం వస్తుంది’ అని అన్నాడు అక్కడకు వచ్చిన యాచకుడు. ‘ఆ.. అది కుదరని పని నువ్వు దాన్ని అమ్మేటప్పుడు, నీకు ఎక్కడిది అని అందరికీ అనుమానం వస్తుంది. అప్పుడు డొంకంతా కదులుతుంది.. నువ్వు ఇక్కడ నుంచి పోతావా. పోవా?’ అని గట్టిగా అంది వనజ.
‘పోతా.. పోతా.. మీ ముగ్గురిని కూడా పట్టుకుపోతా..’ అని చప్పట్లు చరిచాడు బిచ్చగాడి వేషంలో ఉన్న మంత్రి. కాస్త దూరంలో ఉన్న భటులు వచ్చి వారిని బంధించి కోటకు తీసుకెళ్లి చెరసాలలో పెట్టారు. మరుసటి రోజు సభలో సీత, వనజ, సుమిత్ర, రేణుకలను ప్రవేశపెట్టారు.
‘మహారాజా..! సీతను చెరసాలలో పెట్టగానే మిగతా ముగ్గురి మీద దృష్టి పెట్టి బిచ్చగాడి వేషంలో వారిని అనుసరించి పట్టుకున్నాను’ అని మంత్రి విషయం చెప్పాడు. మహారాజు ఆ ముగ్గురికీ దేశబహిష్కరణ శిక్ష విధించాడు. సీతను చెరసాల నుంచి విడుదల చేసి, విలువైన బహుమతులు ఇచ్చాడు. అసలు దొంగలను చాలా చాకచక్యంగా పట్టుకున్న మంత్రిని ఘనంగా సన్మానించాడు.

- యు.విజయశేఖరరెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని