మాయా తిరగలి!

ముకుందుడు చాలా పేదవాడు. పొట్ట గడవడానికి కుటుంబమంతా కూలి పనులకు వెళుతుండేది. ఒకసారి ఆ ప్రాంతాన్ని కరవు చుట్టుముట్టింది. ‘సరైన పనే దొరకడం లేదు. మనం ఇక ఇక్కడ ఎంతోకాలం ఉండలేం. ఎక్కడికైనా వెళ్లి.. ఏదైనా పని చూసుకుందాం’ అని భార్యకు చెప్పాడు ముకుందుడు.

Published : 15 Dec 2021 00:47 IST

ముకుందుడు చాలా పేదవాడు. పొట్ట గడవడానికి కుటుంబమంతా కూలి పనులకు వెళుతుండేది. ఒకసారి ఆ ప్రాంతాన్ని కరవు చుట్టుముట్టింది. ‘సరైన పనే దొరకడం లేదు. మనం ఇక ఇక్కడ ఎంతోకాలం ఉండలేం. ఎక్కడికైనా వెళ్లి.. ఏదైనా పని చూసుకుందాం’ అని భార్యకు చెప్పాడు ముకుందుడు. ‘ఎక్కడికి వెళతామో తెలియదు. ఇంట్లో ఉన్న కాసిన్ని సామాన్లు మోసుకుపోవడం ఎందుకు? అమ్మేసుకుని వెళదాం’ అంది ఆమె.
ముకుందుడు సామానంతా ఒకచోట చేర్చడం మొదలు పెట్టాడు. భార్య, పిల్లలు సహాయం చేయసాగారు. అప్పుడే అతని దృష్టి మూలనున్న చెక్కపెట్టెపై పడింది. అది తరతరాల నుంచి వాళ్లింట్లో ఉంది. ఎన్నడూ తెరవలేదు. ముకుందుడు దానికి ఉన్నతాళం పగులగొట్టి చూశాడు.
అందులో కొన్ని తాళపత్ర గ్రంథాలు కనిపించాయి. వాటిని తీసి పక్కన పెట్టాడు. పెట్టె అడుగున ఒక తిరగలి ఉంది. బయటకు తీశాక దానివైపు ఆశ్చర్యంగా చూశారు. ‘మన దగ్గర ధాన్యమే లేదు. దీన్నేం చేసుకుంటాం’ దాన్ని ఒక పక్కన పెడుతూ చెప్పాడు ముకుందుడు. ముకుందుడి భార్య ‘అవును.. తిరగలి దేనికి? దీంతో మన ఆకలి తీరదు కదా. దీన్ని అమ్మేస్తే కాసిన్ని డబ్బులైనా వస్తాయి’ అంది, దాన్ని చూస్తూ..
ఆమె నోట్లోంచి ‘ఆకలి’ అనే మాట బయటకు రాగానే, తిరగలి నుంచి పిండి వచ్చి చుట్టూరా పడింది. అది చూసి భార్యాభర్తలు ఆశ్చర్యపోయారు. ముకుందుడు తిరగలి రెండు రాళ్లను వేరు చేసి, లోపలేమైనా ఉందేమోనని చూశాడు. ‘ఖాళీగానే ఉందే! పిండి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా?’ అని అనుకున్నాడు. కొద్ది క్షణాల్లోనే ఆ పిండి కాస్తా, రొట్టెలుగా మారిపోయింది.
తిరగలికి అద్భుత శక్తి ఉందని అప్పుడు వాళ్లు గ్రహించారు. ముకుందుడు తిరగలికి నమస్కరించి.. ‘రొట్టెలు ఇచ్చి ఆకలి తీర్చుతున్నందుకు కృతజ్ఞతలు’ అన్నాడు. ‘ఆకలి’ అనే మాట వినగానే, మళ్లీ తిరగలి నుంచి పిండి బయటకు వచ్చి, రొట్టెలుగా మారిపోయింది.
‘తిరగలికి.. ఆకలి అనే మాట వినిపిస్తే చాలు, రొట్టెలు ఇస్తున్నట్లుంది’ అంది ముకుందుడి భార్య. మీరనుకునేది నిజమే. ఈ శక్తి నాలో కేవలం ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. అప్పటి వరకూ నన్ను వాడుకుని మీ ఆకలి తీర్చుకోండి. ఎవరికైనా సాయమూ చేయొచ్చు. కానీ ప్రతిఫలం ఆశించకూడదు’ అనే మాటలు తిరగలి నుంచి వినిపించాయి.
దీంతో ముకుందుడి కుటుంబం వలస పోలేదు. చుట్టుపక్కల వారికి అవసరమైనప్పుడు కొన్ని రొట్టెలు ఇవ్వసాగారు. కిరాణా దుకాణం నడిపే అప్పయ్యకు ముకుందుడిపై అనుమానమొచ్చింది. ‘ముకుందుడు సరకులు కొనేందుకు రావడం లేదే? మరి ఈ రొట్టెలన్నీ ఎలా చేస్తున్నాడు. ఎలా పంచుతున్నాడు?’ అనుకున్నాడు.
అప్పయ్య ఇంటికి వెళ్లేదారిలోనే ముకుందుడి గుడిసె ఉంది. ఒకనాటి రాత్రి.. అప్పయ్య ఇంటికి వెళుతూ, గుడిసె దగ్గరకు వచ్చేసరికి మాటలు వినిపించాయి. వెంటనే కిటికీ నుంచి నెమ్మదిగా గుడిసెలోకి తొంగిచూశాడు. అప్పుడే లోపల ముకుందుడి కుటుంబం ‘ఆకలి’ అనడం, తిరగలి రొట్టెలు ఇవ్వడం చూశాడు. అప్పన్న మనసులో దురాలోచన మొదలైంది.
మరుసటి రోజు.. తన పొలంలో పెద్దగా పనిలేకపోయినా, ముకుందుడి కుటుంబాన్ని కూలీకి పిలిచాడు. వాళ్లు పనిలో ఉండగానే, అప్పయ్య.. ముకుందుడి గుడిసెకు వెళ్లి తిరగలిని దొంగిలించాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అది ఇచ్చిన రొట్టెలన్నింటినీ దుకాణానికి తీసుకెళ్లి పదిరూపాయలకో రొట్టెను అమ్మసాగాడు. అసలే కరవు కాలం జనమంతా ఎగబడి కొన్నారు. అలా ఒకరోజు గడిచింది.  
రొట్టెలు కొన్నవారి ఇళ్లలో ధాన్యం మాయమైంది. ‘ఇదంతా అప్పయ్య పనే! మన ధాన్యాన్ని దొంగిలించి, రొట్టెలు చేయించి, మనకే అమ్ముతున్నట్లున్నాడు’ అని అందరికీ అనుమానం వచ్చింది. వారంతా వెళ్లి గ్రామాధికారికి ఫిర్యాదు చేశారు.
ఆయన అప్పయ్యను పిలిచి.. ‘అప్పయ్యా.. రొట్టెలు చేసేందుకు నీకు పిండి ఎక్కడిది? ధాన్యం ఎక్కడ కొంటున్నావు?’ అని ప్రశ్నించాడు. సరైన సమాధానం చెప్పకపోవడంతో గ్రామాధికారి అప్పయ్యకు ఆరునెలల కారాగార శిక్ష విధించాడు. ముకుందుడికి ఈ విషయం తెలిసింది.
కనిపించకుండా పోయిన తన తిరగలిని అప్పయ్య దొంగిలించి ఉంటాడని గ్రహించాడు. గ్రామాధికారికి విషయమంతా చెప్పాడు. ఆయన తిరగలిని తెప్పించి ముకుందుడికి ఇచ్చాడు.
మొదటి తప్పుగా క్షమించి అప్పయ్య శిక్షను గ్రామాధికారి రద్దు చేశాడు. ముకుందుడి కుటుంబం ఓ ఆరునెలలపాటు తిరగలి ఇచ్చే రొట్టెలతో తమ ఆకలిని తీర్చుకోవడమే కాకుండా, ఆకలిగొన్న వారందరికీ రొట్టెలను ఉచితంగా పంచి ఇచ్చారు. ఈలోగా ఎప్పటిలానే వర్షాలు పడ్డాయి. కరవు మాయమైంది. మళ్లీ అందరికీ మంచి రోజులు వచ్చాయి.

- హర్షిత


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని