చిట్టి.. చిక్కిపోయింది!

నాలుగు రోజుల క్రితం వేటగాడికి చిక్కిన చిట్టి అనే చిలుక ఎలాగో కష్టపడి చాకచక్యంగా తప్పించుకుంది. క్షణం ఆలస్యం చేయకుండా తానుండే చిట్టడవిలోకి ఎగురుకుంటూ చేరింది. నెమ్మదిగా జామచెట్టు మీద వాలింది. తన స్నేహితులైన పావురం, కోకిల, పిచ్చుక.. చిట్టి రాకను గమనించాయి.

Published : 16 Dec 2021 00:25 IST

నాలుగు రోజుల క్రితం వేటగాడికి చిక్కిన చిట్టి అనే చిలుక ఎలాగో కష్టపడి చాకచక్యంగా తప్పించుకుంది. క్షణం ఆలస్యం చేయకుండా తానుండే చిట్టడవిలోకి ఎగురుకుంటూ చేరింది. నెమ్మదిగా జామచెట్టు మీద వాలింది. తన స్నేహితులైన పావురం, కోకిల, పిచ్చుక.. చిట్టి రాకను గమనించాయి. ఎంతగానో సంతోషిస్తూ చిట్టి పక్కకు చేరాయి. చిట్టిని పరిశీలిస్తూ.. ‘బాగా చిక్కిపోయావు..’ అంది పిచ్చుక.

‘అవును! నిజమే! ఎర్రని ముక్కుతో పచ్చగా కళకళలాడుతూ ఉండేదానివి. ఇప్పుడు బాగా నీరసంగా కనిపిస్తున్నావు’ పిచ్చుక మాటలకు వంతపాడుతూ అంది కోకిల. ‘వేటగాడు సరిగా తిండి పెట్టి ఉండడు. అందుకే చిట్టి చిక్కిపోయింది. అయినా చక్కనమ్మ చిక్కినా అందమేగా..! బాధ పడకు, నీ గూటికి చేరావుగా.. చక్కగా మారిపోతావులే’ చిట్టిని ఊరడిస్తూ అంది పావురం.

చిట్టి తన స్నేహితుల వైపు దీనంగా చూసింది. ‘చిట్టీ! నువ్వెళ్లిన దగ్గర నుంచి పచ్చి మంచి నీళ్లైనా ముట్టలేదు. నువ్వొచ్చేవరకూ ఏమీ తాగకూడదనుకున్నాను. తెలుసా!’ అంది పిచ్చుక. ఆ మాటలకు చిట్టి.. ‘అవునా..’ అంది ఆశ్చర్యపోతూ. నేనైతే నువ్వొచ్చే వరకూ ఏమీ తినకూడదనుకున్నాను. ఎంత ఆకలి వేసినా, ఏమీ తినలేదు కూడా.. తెలుసా చిట్టీ’ అంది పావురం గొప్పగా. ‘అయ్యో! ఏమీ తినకుండా ఉన్నావా?’ కడుపు మాడిపోతుంది మిత్రమా!’ అని చిట్టి, పావురంతో అంది. ‘నేనైతే నువ్వు తిరిగి వచ్చేవరకూ ఆహారం తీసుకోకూడదనుకున్నాను. దాహం తీర్చుకోకూడదనుకున్నాను. అందుకే నీరసించి పోయాను తెలుసా చిట్టీ..’ అని కోకిల అంది.

పిచ్చుక, పావురం, కోకిల మాటలు విన్న చిట్టి కళ్ల నుంచి రెండు కన్నీటి బొట్లు రాలాయి. ‘ఎందుకు? ఏడుస్తున్నావు? చిట్టీ’ ఆ మూడూ అడిగాయి. అప్పుడు చిట్టి ఆ మూడింటికేసి అభిమానంగా చూస్తూ.. ‘మిత్రులారా! ఇది ఏడుపు కాదు. నా మీద మీరు చూపించిన అభిమానానికి ఆనందంతో వచ్చిన కన్నీరు. ఈ చిట్టి రాక కోసం మీరు చేసిన త్యాగం చాలా గొప్పది. మీ వంటి మిత్రులు దొరకడం నిజంగా నా అదృష్టం’ అంది.

ఆ జామచెట్టుపైనే ఉన్న ఒక కాకి చిట్టి మాటలు విని, పకపకా నవ్వింది. కాకి వెక్కిరించేసరికి చిట్టికి కోపం వచ్చేసింది. ‘ఈ జామచెట్టు మీదకు నువ్వెప్పుడొచ్చావ్‌? మా మిత్రుల ఆత్మీయ పలకరింపు నీకు వెటకారంగా ఉందా? అయినా ఏకాకివైన నీకు స్నేహం విలువ ఏం తెలుస్తుంది?’ అని చిట్టి ఆవేశంగా అంది.

చిట్టి మాటలకు సమాధానంగా కాకి.. ‘కోపం వద్దు చిట్టీ! నేను చెప్పేది జాగ్రత్తగా విను. నేను నీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే నువ్వెళ్లిపోయాక నేను ఈ చెట్టు మీదకు వచ్చాను. అయితే నీ మిత్రులు చెప్పిన మాటలను బట్టి నీ గురించి నాకు తెలిసింది. కానీ నీ మీద నీ మిత్రులు కురిపించిన అభిమానం అంతా నాటకమే.. నిజం కాదు’ అంది.

‘నీకెలా తెలుసు?’ అని చిట్టి, కాకిని అడిగింది. ‘‘అలా అడిగావు కాబట్టి.. చెబుతున్నాను. ఎక్కడి నుంచో వచ్చిన నేను నీ మిత్రుల మధ్యన చేరాను. అప్పుడవి నాతో.. ‘ఇక్కడ చిట్టి అనే చిలుక మాతో కలిసి ఉండేది. చాదస్తంతో నీతి నియమాలు చెబుతూ మా బుర్ర తినేసేది. పరుల సొమ్ము పాము వంటిదని, కష్టపడి సంపాదించిన ఆహారమే తినాలని మమ్మల్ని చంపేసేది. మా అదృష్టం కొద్దీ వేటగాడికి చిక్కుకుంది. లేకపోతే మా పని అయిపోయేదే’ అని నాతో అన్నాయి. అంతేకాదు నేను కష్టపడి తెచ్చుకున్న ఆహారాన్ని నన్ను అడగకుండానే, నాకు కొంతైనా మిగల్చకుండానే రోజూ తినడం చేయసాగాయి. వీళ్ల అసలు రంగు బయటపడడంతో వీళ్లకు దూరంగా ఎగిరిపోవాలి అనుకున్నాను. కానీ ఎప్పటికైనా నువ్వు తిరిగి వస్తావని.. పైకి తీయని కబుర్లు చెబుతూ పబ్బం గడుపుకునే మీ మిత్రుల బండారాన్ని నీకు తెలియ చెప్పాలనే ఇక్కడ ఉంటున్నాను. నేను తెచ్చిన పళ్లనే ఇందాక నువ్వొచ్చే ముందు వరకూ తింటున్నాయి. నువ్వు రాగానే వాటిని దాచేసి, గబగబా నీ దగ్గరకు వచ్చేశాయి. నేను చెప్పేది నిజమో కాదో నీ మిత్రులను అడుగు’’ అంది కాకి ధీమాగా!

‘కాకి చెప్పిన మాటలు నిజమేనా?’ అని చిట్టి.. ఆ మూడింటిని అడిగింది. కాకి ద్వారా వాటి నైజం బయటపడటంతో కోకిల, పిచ్చుక, పావురాలు సిగ్గుతో తల దించుకున్నాయి. ‘కాకి మాటలు నిజమే’ అని ఒప్పుకోక వాటికి తప్పలేదు. చిట్టికి కోపం, బాధ రెండూ ఒకేసారి వచ్చాయి. తమాయించుకుని ‘మంచి గుణాలున్న వారితో చేసిన స్నేహమే కలకాలం నిలుస్తుంది. నటన ఉంటే అది నిలవదు. మీరు మీ గుణాలు మార్చుకున్నప్పుడే నేను మీతో స్నేహం చేస్తాను’ అంటూ చిట్టి... కాకి పక్కన చేరింది. ‘మంచి గుణాలున్న నువ్వు నా మిత్రుడిగా దొరకడం నా అదృష్టం మిత్రమా!’ అంటూ కాకికేసి అభిమానంగా చూసింది చిట్టి.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని