మ్యావ్‌.. మ్యావ్‌.. మంచితనం!

ఓ రోజు సాయంత్రం కోతుల మంద నుంచి ఓ కోతి తన పిల్లతో సహా తప్పిపోయింది. పాపం దానికి ఎటు వెళ్లాలో తెలియడం లేదు. భయంతో జామ చెట్టు పైన కిచకిచమని అరుస్తూ.. ఒక కొమ్మ నుంచి మరో కొమ్మ మీదకు దూకసాగింది.

Updated : 17 Dec 2021 06:26 IST

ఓ రోజు సాయంత్రం కోతుల మంద నుంచి ఓ కోతి తన పిల్లతో సహా తప్పిపోయింది. పాపం దానికి ఎటు వెళ్లాలో తెలియడం లేదు. భయంతో జామ చెట్టు పైన కిచకిచమని అరుస్తూ.. ఒక కొమ్మ నుంచి మరో కొమ్మ మీదకు దూకసాగింది. చుట్టు పక్కల నివాసం ఉండేవారు దాని అరుపులకు తలుపులు వేసుకుని ఇంటికే పరిమితమయ్యారు. ఇంతలో చీకటయ్యింది. ఆ చీకట్లో కోతికి ఏమీ కనిపించడం లేదు. దాంతో అది అలా అరుస్తూనే ఉంది.

కాసేపటికి పిల్ల కోతి కూడా కిచకిచమని అరవడం మొదలుపెట్టింది. తల్లి కారణం అడిగింది. అప్పుడా పిల్ల కోతి ‘అమ్మా! రోజూ మనతో తిరిగే కోతులేవి? నాతో ఆడుకునే నా స్నేహితులేరి? ఎక్కడున్నారు? వాళ్లంతా కనబడకపోతే నాకు ఏం తోచడం లేదమ్మా!’ అంది. ‘అయ్యో.. నా పిచ్చి తల్లీ.. మనం వాళ్ల మధ్య నుంచి తప్పిపోయాం. దానికితోడు చీకటి పడింది. ఎటుపోవాలో నాకు అర్థం కావడం లేదు’ అంది తల్లి. ‘అమ్మా! ఈ రాత్రి మనం ఒంటరిగా గడపాలా’ అంది పిల్లకోతి. ‘అవును.. మనం ఎవరి తోడూ లేకుండా ఉండాలమ్మా’ అంది తల్లి. ‘అమ్మా! నాకు భయం వేస్తుంది. ఆకలి కూడా వేస్తుంది’ అంది పిల్లకోతి. ‘ ఈ రాత్రికి ఎలాగోలా గడిపితే రేపు, ఉదయం మన మందతో కలిసి హాయిగా తిరగొచ్చు. ఆకలన్నావ్‌ కదా! ప్చ్‌ నువ్వేమో చిన్నదానివి.. ఈ పచ్చి జామకాయలు కొరకలేవు. పండ్లు, రేపు ఉదయాన్నే చూసుకుని తిందువుగానీ.. కాస్త ఆకలికి ఓర్చుకో’ అంది తల్లి. ‘అమ్మా! నాకు బాగా ఆకలేస్తుంది. ఉదయం నుంచి ఒక్క పండు కూడా తినలేదు. నేనే కాదు.. నువ్వు కూడా ఉదయం నుంచి ఒక్క పండు కూడా తినలేదు. ఆహారం దొరక్క.. నువ్వు నాకు కడుపునిండా పాలు ఇవ్వలేకపోతున్నావు అని నాకు తెలుసమ్మా!’ అంది పిల్లకోతి. బిడ్డ మాటలకు తల్లికోతి కళ్లలో నీళ్లు తిరిగాయి. కన్నీళ్లు బయటకు వస్తే బిడ్డ తట్టుకోలేదని తల పక్కకు తిప్పింది. పాపం.. బిడ్డ ఆకలి తీర్చలేకపోతున్నందుకు మనసులోనే చాలా బాధపడింది.

పిల్లకోతి ఆకలితో అల్లాడుతున్న విషయం.. తల్లిని పాలకోసం అడగడం అన్నీ చెట్టు కింద ఉన్న ఒక పెంపుడు పిల్లి వింది. దానికి చాలా జాలి కలిగింది. ఎలాగైనా సహాయం చేయాలనుకుంది. అది ధైర్యంగా చెట్టు పైకి ఎక్కి పెద్దకోతిని ‘మ్యావ్‌.. మ్యావ్‌..’ అంటూ పలకరించింది. ‘కోతి మామా! నీ బిడ్డకు ఆకలిగా ఉందని మీ మాటల ద్వారా తెలుసుకున్నాను. మీరు ఏమీ అనుకోకపోతే కిందకు రండి. నా యజమాని నాకోసం పాత్రలో పాలను పోస్తాడు. వాటిని మీ బిడ్డకు పట్టించి ఆకలి తీర్చండి’ అంది పిల్లి. పిల్లి మాటలకు తల్లి కోతి కరిగిపోయింది. అప్పటిదాకా కళ్లలో తిరుగుతున్న కన్నీళ్లు ఒక్కసారిగా బయటకు వచ్చాయి. అయినా తమాయించుకుని ‘అయ్యో! నా బిడ్డ పాలు తాగితే.. నీ ఆకలి ఎవరు తీరుస్తారు? ఆ పాపం.. నేను మూట కట్టుకోలేను. నువ్వు కూడా నా బిడ్డ లాంటి దానివే. నువ్వు పాలు తాగకుండా పస్తులుంటే నాకు మంచిది కాదు’ అంది. ‘కోతి మామా! నేను చెప్పేది విను. ముందు ఆకలితో ఉన్న నీ బిడ్డ కడుపు నింపు. పాపం.. చూడు ఎలా అరుస్తుందో’ అంది పిల్లి. పెద్దకోతి చెప్పినా పిల్లి వినలేదు. చివరకు పిల్లను తీసుకుని చెట్టు దిగింది తల్లి కోతి. పాత్ర నిండా ఉన్న పాలను పిల్లకు పట్టించింది. పాలు తాగిన పిల్లకోతి కిచకిచమని అరవడం మానేసింది. పైగా తల్లి ఒడిలో నుంచి కిందకు దిగి పిల్లి చుట్టూ ఆనందంగా గంతులేయసాగింది. పెద్దకోతి పిల్లిని ఉద్దేశించి ‘ నీ కడుపు మాడ్చుకుని నా బిడ్డ ఆకలి తీర్చావు. ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను’ అని కృతజ్ఞతలు తెలిపింది.

పెద్దకోతి మాటలకు పిల్లి అడ్డొస్తూ.. మీరు శాకాహారులు కేవలం పండ్లు, ఆహారం మీదనే ఆధారపడతారు. మేం ఏదైనా ఆరగించేస్తాం. ఇంట్లో యజమాని పోసే పాలు తాగుతాం. పెరుగన్నం తింటాం. రాత్రి పూట ఎలుకలను వేటాడుతాం’ అంది. మళ్లీ ‘నా బిడ్డ ఆకలి తీర్చిన నీ మేలు ఎప్పటికీ మరువలేను’ అంటూ ఆ రాత్రి చెట్టు కింద బిడ్డతో గడిపింది పెద్దకోతి. ఉదయాన్నే లేచి పిల్లికి వీడ్కోలు పలుకుతూ.. ‘ఇకనుంచి మనం స్నేహితులం. దేవుడు అనుగ్రహిస్తే మళ్లీ కలుసుకుందాం’ అని పిల్లకోతిని ఎత్తుకుని మందలో కలిసేందుకు చెట్టు పైకి ఎక్కింది తల్లికోతి.

- తమ్మవరపు వెంకట సాయి సుచిత్ర


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని