మారినమృగరాజు

అడవికి రాజైన సింహానికి ఏదైనా తిన్న తర్వాత అది అరిగే వరకూ తిరగడం అలవాటు. అలా తిరిగే సమయంలో కనిపించిన వస్తువులతో, చిన్న జీవులైన పురుగులతో చెలగాట మాడటమంటే దానికి మహా సరదా! ఆ చెలగాటం వల్ల అల్ప జీవులు గాయపడినా, ఒక్కోసారి ప్రాణం కోల్పోయినా సరే మృగరాజు లెక్క చేయదు.....

Published : 27 Dec 2021 00:35 IST

డవికి రాజైన సింహానికి ఏదైనా తిన్న తర్వాత అది అరిగే వరకూ తిరగడం అలవాటు. అలా తిరిగే సమయంలో కనిపించిన వస్తువులతో, చిన్న జీవులైన పురుగులతో చెలగాట మాడటమంటే దానికి మహా సరదా! ఆ చెలగాటం వల్ల అల్ప జీవులు గాయపడినా, ఒక్కోసారి ప్రాణం కోల్పోయినా సరే మృగరాజు లెక్క చేయదు. చెలగాటమూ ఆపదు.

ఒకరోజు అలవాటులో భాగంగానే మాంసం తిన్న తర్వాత తిరగడం మొదలుపెట్టింది. అయితే చెలగాట మాడటానికి ఒక్క పురుగు కూడా కనిపించలేదు. ‘ఈ రోజు ఎవరితో ఆడుకోవాలి’ అనుకుంటూ అటూ ఇటూ తిరగసాగింది. అప్పుడే దాని కాలికి ఏదో తగలడంతో కిందకు చూసింది. పసుపు రంగులో నిగనిగలాడుతున్న మామిడి పండు కనిపించింది. అది తీసుకుని అక్కడే ఉన్న రాతి బండమీద కూర్చుంది. మామిడి పండును తన కాళ్ల మధ్యలో పెట్టుకొని పండు లోపల గట్టిగా పెంకులా ఉన్న టెంకను లాగింది. అంతలోనే ఆ టెంక అమాంతం పైకెగిరి పొదల్లో పడింది.

‘నాకు చిక్కకుండా పైకెగిరి పడతావా? నేను ఈ అడవికి రాజును తెలుసా?’ అంటూ మృగరాజు దర్పంగా లేచి పడిపోయిన టెంక కోసం అటూ ఇటూ చూసింది. టెంక కనిపించింది. ఆనందంగా ఆ టెంకను తన గోళ్లతో రక్కి ముక్కలు ముక్కలు చేయాలని తిరిగి తీసుకోబోయింది. ఇదంతా చెట్టు మీద ఉన్న ఒక గొంగళి పురుగు గమనించింది. ‘గతంలో మృగరాజు తన చెలగాటంలో ఎన్నో గొంగళి పురుగులు బలయ్యాయి. మృగరాజు చెలగాటం.. మాకు ప్రాణసంకటం’ అనుకుంది ఆ గొంగళిపురుగు. మృగరాజు చేతిలో టెంకను చూసి ‘దాన్ని ముక్కలు చేయకుండా ఉంటే మొక్కగా తిరిగి బతుకుతుంది కదా!’ అనుకుంది. అందుకే వెంటనే మృగరాజు వీపు మీద పాకింది. దురద పుట్టడంతో మృగరాజు చేతిలోని టెంక మళ్లీ ఎగిరిపోయింది. దాంతో అసహనంగా విసుక్కుంటూ వీపు మీద చూసుకుంది. దాని చేతిలోకి గొంగళి పురుగు చిక్కింది. ఇప్పటికి దొరికావా అనుకుంటూ గొంగళి పురుగును నలిపేయబోయింది. కానీ  గొంగళి పురుగు తెలివిగా మృగరాజు నుంచి తప్పించుకుని చెట్టు మీదకు పాక్కుంటూ పోసాగింది. అది గమనించిన మృగరాజు ‘ఛీ ఛీ ఏనుగును సైతం వేటాడే బలం ఉన్న నేను ఈరోజు అటు మామిడి టెంకను, ఇటు చిన్ని గొంగళి పురుగునూ పట్టుకోలేకపోయానే’ అంటూ చిరాకు పడింది. తోటి వాళ్లతో చెబితే లోకువైపోతాననుకుంది. కానీ ఆ రెండింటిని తిరిగి ఎలాగైనా పట్టుకోవాలని బలంగా అనుకుంది. అలసిపోవడంతో అక్కడే రాతి బండమీదనే నిద్రలోకి జారుకుంది.

కొన్ని రోజులు గడిచాయి. ఆరోజు కూడా మృగరాజు చెలగాటం కోసం చుట్టూ చూసింది. నారింజ రంగు కలిగిన చిట్టి రెక్కలతో, మధ్యలో చిన్న చిన్న చుక్కలతో ఒక సీతాకోక చిలుక   కనిపించింది. ఆడితే ఇలాంటి వాటితోనే ఆడుకోవాలని దాన్ని పట్టుకోబోయింది. కానీ అది ఎగురుకుంటూ వెళ్లి మామిడి మొక్క మీద వాలింది. మృగరాజు మళ్లీ మొక్కమీదకు వెళ్లి పట్టుకోబోయింది. సీతాకోక చిలుక ‘ఆగండి మృగరాజా!’ అంది. వెంటనే మృగరాజు ‘నీకెంత ధైర్యం నన్నే ఆగమంటావా! మొన్నటికి మొన్న ఓ చిన్న గొంగళి, చెత్త మామిడి టెంక నా నుంచి తప్పించుకుని పోయాయి. ఆ కసి, బాధా నాకింకా ఉన్నాయి. అవి పోతే పోయాయి. ఇప్పుడు నీతో చెలగాటం ఆడి నా కసి తీర్చుకుంటా’ అని అంది.

‘ఒక్కసారి ఆగండి మృగరాజా! అప్పటి గొంగళి పురుగే.. ఇప్పుడు మీ ముందున్న సీతాకోక చిలుక. ఆ మామిడి టెంక మీ నుంచి తప్పించుకుని ఇదిగో ఈ చిన్న మామిడి మొక్కగా మారింది’ అంది సీతాకోకచిలుక. ‘అవునా!’ అంటూ మృగరాజు ఆశ్చర్యపోతూ పరిశీలనగా చూసింది. సీతాకోక చిలుకకు, మృగరాజు తన మాటలను వింటుందనే నమ్మకం కలిగింది. ‘అవును మృగరాజా! రూపాంతరం మా సహజ లక్షణం. టెంక విత్తనమై మొక్కగా అంకురం చెందడం వాటి సహజ ధర్మం. అడవిని పాలించే పాలకులు మీరు. మమ్మల్ని కాపాడటం మీ ధర్మం. మాతో ఆడుకోండి. కానీ చెలగాటం ఆడి మా ప్రాణాలు తీయకండి. మీ ఆకలి తీర్చలేని మా వంటి అల్ప జీవులతో చెలగాటం ఆడుకోవడం మీకు తప్పనిపించలేదా.. మృగరాజా! మమ్మల్ని బతకనివ్వండి. మీకు మా బాధ చెప్పాలనే తిరిగి మీ ముందుకు వచ్చాను. రాజుగా కాపాడతారో.. చెలగాటం ఆడతారో మీ ఇష్టం’ అంటూ సీతాకోక చిలుక మౌనంగా తలదించుకుంది. దాని మాటలు విన్న మృగరాజుకు జాలేసింది. వెంటనే ‘నీ మాటలు నన్ను ఆలోచించేలా చేశాయి. అల్ప జీవులతో చెలగాటం వాటి మనుగడకు ముప్పు అని తెలిసింది. నా తప్పు నాకు తెలిసేలా చేసిన నిన్ను అభినందిస్తున్నాను. ఇక నుంచి నేనే కాదు, ఎవరూ మీకు ముప్పు కలిగించకుండా చూస్తాను’ అంది మృగరాజు. ‘చాలా చాలా ధన్యవాదాలు మృగరాజా!’ అంటూ సీతాకోక చిలుక తన చిట్టి చిట్టి రెక్కలతో హాయిగా ఎగురుతూ వెళ్లిపోయింది.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు