నాయకుడే సేవకుడు!

మధిరవనంలోని జంతువులన్నీ ఎంతో చక్కగా కలిసిమెలిసి ఒకదానికొకటి సాయం చేసుకుంటూ చక్కగా జీవించసాగాయి. అయితే ఆ వనంలో ఉన్న జంతువుల్లోకెల్లా బాగా తెలివైన నక్క.. తన తెలివితేటలతో మృగరాజుకు సహాయం చేసేది. ముఖ్యంగా వేసవికాలంలో కలిగే నీటి కొరతను అధిగమించడానికి తగిన సూచనలు, పరిష్కార మార్గాలను తెలుపుతూ సహాయపడుతూ ఉండేది.

Published : 30 Dec 2021 00:49 IST

ధిరవనంలోని జంతువులన్నీ ఎంతో చక్కగా కలిసిమెలిసి ఒకదానికొకటి సాయం చేసుకుంటూ చక్కగా జీవించసాగాయి. అయితే ఆ వనంలో ఉన్న జంతువుల్లోకెల్లా బాగా తెలివైన నక్క.. తన తెలివితేటలతో మృగరాజుకు సహాయం చేసేది. ముఖ్యంగా వేసవికాలంలో కలిగే నీటి కొరతను అధిగమించడానికి తగిన సూచనలు, పరిష్కార మార్గాలను తెలుపుతూ సహాయపడుతూ ఉండేది.

మృగరాజు నక్క చేసే సూచనలను ఆచరిస్తూ వేసవిలో నీటి ఎద్దడి నుంచి జంతువులను కాపాడుకునేది. అయితే నక్క  చనిపోవడంతో అడవిలో ఉన్న జంతువులన్నీ ఆందోళన పడసాగాయి. విషయం తెలుసుకున్న సింహం జంతువుల అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది.

‘మిత్రులారా! ప్రతి సంవత్సరం వేసవిలో మనకు సహాయం చేసే నక్క ఇప్పుడు లేదు.. కాబట్టి ఆ పనిని ఎవరికైనా అప్పగిద్దాం అని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా ఆ పని చేయగలరా?’ అని అడిగింది. ఎవరూ మాట్లాడలేదు.

‘సరే అయితే... నేనే ఆ పని చేస్తాను. నాకు సాయంగా ఏనుగు ఉంటుంది. మీకు ఎవరికైనా అభ్యంతరమా?’ అని అడిగింది. అప్పుడూ ఎవరూ మాట్లాడలేదు. తర్వాత సింహమే కలగజేసుకుని ‘ఈ వేసవిలో మనల్ని నీటి ఎద్దడి నుంచి రక్షించుకోవడానికి ఒక మార్గం కనిపెట్టాను. దాని ప్రకారం ముందుకు వెళ్లాలి’ అంది. కానీ కొన్ని జంతువులు సింహం వెంట నడవడానికి తటపటాయించాయి.

వేసవి కాలం రానే వచ్చింది. క్రమక్రమంగా చిన్న చెరువులోని నీరు అడుగంటసాగింది. సింహం తను అనుకున్న విధంగా అడవికి పశ్చిమ దిశగా జంతువులను బయలుదేరదీసింది. అయితే కొన్ని జీవులు సింహాన్ని అనుసరించడానికి నిరాకరించాయి.

చాలా సమయం పట్టింది... ఆ కొత్త ప్రదేశానికి చేరడానికి. అక్కడ దట్టమైన చెట్ల మధ్యలో ఉన్న పే...ద్ద నీటికొలనును చూసి అక్కడికి రావడానికి పడిన కష్టాన్ని మరిచి కేరింతలు కొట్టాయి జంతువులన్నీ. ‘ఈ వేసవిలో మనల్ని రక్షించేది ఈ కొలను నీరే’ అనుకున్నాయి.

కానీ సింహం ఇక్కడికి రాకుండా ఉన్న మిగిలిన జంతువుల గురించి ఆలోచిస్తూ ఆందోళన పడసాగింది. లాభం లేదని భావించి చివరికి ఏనుగును పిలిచి ‘అక్కడ ఉన్న మన మిత్రులు కూడా ఇక్కడికి వస్తే బాగుంటుంది. వారి దగ్గరకు వెళ్లి ఎలాగైనా నచ్చచెప్పి ఈ ప్రాంతానికి తీసుకురా’ అని చెప్పింది. ‘సరే’ అని ఏనుగు అక్కడ ఉన్న జంతువుల వద్దకు వెళ్లి వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసింది. మొదట వినకపోయినా తర్వాత రావడానికి ఒప్పుకొన్నాయి. వాటితో కలిసి, ఏనుగు నీటి వనరు ఉన్న ప్రాంతానికి బయలుదేరింది. మార్గం మధ్యలో వేటగాడు తవ్విన కందకాల్లో కొన్ని జంతువులు పడిపోయాయి.

ఈ విషయాన్ని, ఏనుగు వెంటనే కాకి ద్వారా సింహానికి కబురు పంపింది. మృగరాజు హుటాహుటిన ఆ ప్రాంతానికి బయలుదేరింది. ఏనుగును, దూరంగా వస్తున్న సింహాన్ని చూసి భయపడిన వేటగాడు అక్కడి నుంచి పారిపోయాడు. సింహం ఏనుగు సాయంతో మిత్రులందరినీ రక్షించింది. అక్కడి నుంచి అందరూ నీటి వనరు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు.

‘మమ్మల్ని క్షమించండి మృగరాజా! మీ మాటను లెక్కచేయకున్నా సరే.. మేము ఏమైపోతామో అని భావించి మా కోసం ఏనుగును పంపారు. ఆపదలో ఉన్న మమ్మల్ని కాపాడారు’ అన్నాయి జంతువులు.

దానికి సింహం.. ‘మిత్రులారా! మనం పని చేయాల్సి వచ్చినప్పుడు చేయాలి. లేదంటే పెద్దలు చెప్పేది వినాలి. అంతేకానీ ఆపద సమయంలో నిర్లక్ష్యం వహిస్తే తిప్పలు తప్పవు.  తనవారిని రక్షించుకోవడం, దూరదృష్టి కలిగి ఉండటం, సరైన ప్రణాళికలు వేసుకోవడం.. ఇవన్నీ నాయకుల లక్షణాలు. అవసరమైనప్పుడు ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవాలి. అలా కుదరనప్పుడు తానే స్వయంగా ఆ పని చేయాలి. అప్పుడే అసలు సిసలైన నాయకుడు అనిపించుకుంటాడు. నిజానికి నాయకుడే సేవకుడు’ అంది సింహం.

సింహం మంచితనం, దూరదృష్టి, సూక్ష్మబుద్ధిని జంతువులన్నీ అభినందించాయి. వేసవికాలం ముగిసి వర్షాలు పడడంతో అన్ని జంతువులూ తమ తమ ఆవాసాలకు చేరుకున్నాయి.

- ఏడుకొండలు కళ్లేపల్లి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని