చిట్టికోతి.. చిన్ని జింకపిల్ల!

ఒక అడవికి కొత్తగా ఓ బుజ్జి కోతి వచ్చింది. అది జింక పిల్లతో స్నేహం చేసింది. ఒకరోజు బుజ్జి కోతి.. జింక పిల్లతో ‘మిత్రమా! మీ అడవిలోని అందాలను చూడాలని ఉంది. నాకు చూపించవా?’ అని అడిగింది. సరేనంది జింక పిల్ల. అవి రెండూ కలిసి అడవి లోపలికి వెళ్లాయి. పైకి చూస్తూ అడవిలోని అందాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగి టక్కున ఆగిపోయాయి. వాటికి ఒక సింహం ఎదురుగా వచ్చింది. వెంటనే బుజ్జి కోతి పక్కనున్న...

Published : 31 Dec 2021 01:03 IST

క అడవికి కొత్తగా ఓ బుజ్జి కోతి వచ్చింది. అది జింక పిల్లతో స్నేహం చేసింది. ఒకరోజు బుజ్జి కోతి.. జింక పిల్లతో ‘మిత్రమా! మీ అడవిలోని అందాలను చూడాలని ఉంది. నాకు చూపించవా?’ అని అడిగింది. సరేనంది జింక పిల్ల.

అవి రెండూ కలిసి అడవి లోపలికి వెళ్లాయి. పైకి చూస్తూ అడవిలోని అందాలను ఆస్వాదిస్తూ ముందుకు సాగి టక్కున ఆగిపోయాయి. వాటికి ఒక సింహం ఎదురుగా వచ్చింది. వెంటనే బుజ్జి కోతి పక్కనున్న చెట్టు ఎక్కేసింది. జింక పిల్ల మాత్రం సింహానికి ఎదురుగా నిలబడింది. సింహం.. చెట్టు పైకి ఎక్కిన కోతిని చూస్తూ.. ‘ఏయ్‌! పిల్ల కోతి.. కిందకు దిగు’ అని గద్దించింది. కోతికి ముచ్చెమటలు పట్టాయి. అది కింద ఉన్న జింక పిల్లను వదిలేసి తనను దిగమంటున్నదేంటబ్బా! అని బుజ్జికోతి ఆశ్చర్యపోతూ.. ‘నేను దిగను’ అని అంది. వెంటనే సింహం.. ‘నువ్వు దిగకుంటే చిరుత పులి, ఎలుగుబంటిని పిలిపించి.. నిన్ను చెట్టుపై నుంచి తోయిస్తాను. మర్యాదగా దిగుతావా? లేదా?’ అంది. ‘నేను దిగను. దిగితే మీరు నన్ను తింటారుగా!’ అంది బుజ్జి కోతి. అప్పుడు సింహం.. ‘నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?’ అని బుజ్జికోతిని ప్రశ్నించింది. అది తన సంగతంతా సింహానికి చెప్పింది.

అప్పుడు సింహం ‘నీ మిత్రుణ్ని వదిలిపెట్టి నువ్వు చెట్టుపైకి ఎక్కవచ్చా?’ అంది. ‘ఏం చేయాలి మృగరాజా! తనకు మాలిన ధర్మం పనికిరాదుగా’ అని అంది బుజ్జి కోతి. ‘ఓహో.. వేలెడంత లేవు. ధర్మసూక్ష్మాలు కూడా మాట్లాడుతున్నావే! సరే నువ్వు చెట్టు దిగితే, నిన్ను నేను ఏమీ చెయ్యను.. సరేనా..! నేను అన్న మాట తప్పను. కావాలంటే ఈ జింక పిల్లను అడుగు’ అంది సింహం.

అప్పుడు జింక పిల్ల.. ‘అవును’ అన్నట్లు తలూపింది. వెంటనే బుజ్జి కోతి చెట్టు దిగి కిందకు వచ్చింది. అప్పుడు సింహం నవ్వి.. ‘మీ మిత్రులు ఇద్దరూ అడవి లోపలికి వెళ్లి అంతా చూసి రండి, వెళ్లండి..’ అంది. ‘బతుకు జీవుడా!’ అనుకుంది బుజ్జి కోతి. వాటిని ఇంకేమీ అనకుండా సింహం అక్కడ నుంచి వెళ్లిపోయింది.

అప్పుడు బుజ్జికోతి ‘ఇదేంటీ..! మీ రాజుగారు ఇంత మంచి వారా?’ అని ప్రశ్నించింది. ‘అవును. తాను రాజు కాబట్టి.. అడవిలోని పిల్ల జంతువుల జోలికి పోనే పోనని మాట ఇచ్చారు. అందుకే నేను ధైర్యంగా ఉన్నాను’ అని అంది జింక పిల్ల. ‘మరి ఆ మాట నాకు ముందే ఎందుకు చెప్పలేదు?’ అంది బుజ్జి కోతి. ‘నువ్వు నన్ను చెప్పనిస్తేగా’ అంది జింక పిల్ల.

అవి రెండూ మరింత దూరం వెళ్లాయి. అక్కడ వాటికి ఈసారి పెద్దపులి కనిపించింది. బుజ్జి కోతి భయపడి మళ్లీ చెట్టు ఎక్కబోయింది. కానీ జింక పిల్ల దాన్ని వారిస్తూ గట్టిగా పట్టుకుంది. బుజ్జి కోతి భయంతో వదిలి పెట్టమని ప్రాధేయపడింది. ‘భయపడకు మిత్రమా! అది మనల్ని ఏమీ చేయదు. నేను ఉన్నాను కదా!’ అని అంది. ‘అయితే ఈ పులి కూడా సింహంలాగా ప్రతిజ్ఞ చేసిందా?’ అంది బుజ్జికోతి. ఇంతలో పెద్దపులి అక్కడకు చేరుకుని ‘ఇది ఎవరు? ఎక్కడ నుంచి వచ్చింది?’ అని ప్రశ్నించింది. అప్పుడు జింక పిల్ల తన మిత్రుడని చెప్పింది. ‘అయితే వెళ్లండి’ అంటూ పెద్దపులి వెళ్లిపోయింది. అప్పుడు బుజ్జికోతి... ‘ఈ పులి మనల్ని ఏమీ అనలేదు ఎందుకు?’ అని ప్రశ్నించింది. జింక పిల్ల ‘మా అమ్మ, దానికి ఒకసారి కాలులో ముల్లు దిగితే ఒక కోతి సాయంతో దాన్ని తీయించింది. అందుకే దానికి మేమంటే అభిమానం’ అని అంది. ‘ఓహో! ఈ అడవిలో క్రూరమృగాలు సాధు జంతువుల్లా ఉన్నాయే! మా అడవిలోనైతే ఈ పప్పులేం ఉడకవు. అవి చిన్నా పెద్దా తారతమ్యం లేకుండా అన్ని జంతువుల్ని స్వాహా చేస్తాయి’ అంది బుజ్జి కోతి.

ఇంతలో వాటికి చిరుత పులి ఎదురయింది. అప్పుడు కోతి భయపడింది. వెంటనే జింక పిల్ల ‘మిత్రమా! ఈ పులి కూడా మనల్ని ఏమీ చేయదులే. నీవేం భయపడకు’ అంది. ‘అదేంటి? దీనిక్కూడా మీ అమ్మ సాయం చేసిందా?’ అంది అమాయకంగా బుజ్జికోతి. ‘లేదు. దీని పిల్లలతో నాకు చిన్నప్పట్నుంచి స్నేహం. నేను ప్రతిరోజు వాటితో ఆడుకుంటాను’ అంది జింక పిల్ల. కోతి చాలా ఆశ్చర్యపోయింది.

‘మీ అమ్మా, నువ్వూ ఎంత మంచి వారు. మీ ప్రాణాలను లెక్కచేయకుండా క్రూరమృగాలకు కూడా ఉపకారం చేస్తున్నారు. అందుకే అవి కూడా మీకు ప్రాణదానం చేశాయి. అది సరే మరి.. మీ అమ్మ ఎలా చనిపోయింది’ అని అడిగింది బుజ్జి కోతి. ‘అనారోగ్యంతో చనిపోయింది. అంతేకానీ క్రూర జంతువులేం చంపలేదు’ అని అంది జింక పిల్ల.

‘అబ్బ.. నాకు ఎంచక్కా మీ అడవిలోనే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంత మంచి స్వేచ్ఛ ఏ అడవిలోనూ లేదు. మీ అమ్మలాగా, నీలాగా నేను కూడా ఇతరులకు సాయం చేస్తాను. దాంతో భవిష్యత్తులో నా పిల్లలు కూడా స్వేచ్ఛగా బతుకుతారు. క్షేమంగా ఉంటారు. నేను కూడా మా అమ్మతో పాటు వచ్చి ఈ అడవిలోనే ఉంటా’ అని అంది బుజ్జి కోతి. ఆ మాటకు జింక పిల్ల ‘అలాగే మిత్రమా’ అంటూ నవ్వింది.

- సంగనభట్ల చిన్న రామకిష్టయ్య


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని