తాతయ్య కళ్లజోడు!

ఉదయం నిద్రలేచినప్పటి నుంచి తాతయ్య దీనంగా ఉండటం గమనించింది బాల. తాతయ్యకు దినపత్రిక చదవడం అంటే చాలా ఇష్టం. అది చదవకుండా ఆయన ఉండలేరు. ఇప్పుడు తాతయ్య ఎదురుగా టీపాయ్‌ మీదే పత్రిక ఉన్నప్పటికీ దీనంగా ఎందుకున్నాడో బాలకు తెలియలేదు.....

Published : 01 Jan 2022 02:16 IST

దయం నిద్రలేచినప్పటి నుంచి తాతయ్య దీనంగా ఉండటం గమనించింది బాల. తాతయ్యకు దినపత్రిక చదవడం అంటే చాలా ఇష్టం. అది చదవకుండా ఆయన ఉండలేరు. ఇప్పుడు తాతయ్య ఎదురుగా టీపాయ్‌ మీదే పత్రిక ఉన్నప్పటికీ దీనంగా ఎందుకున్నాడో బాలకు తెలియలేదు.

‘తాతయ్యా! పత్రిక చదవడం లేదు.. ఎందుకు?’ అని, ఆయన పక్కనే కూర్చుంటూ అడిగింది బాల. ‘నా కళ్లజోడు కనబడటం లేదు. ఎక్కడ పెట్టానో గుర్తుకు రావడం లేదు’ అని చెప్పాడు తాతయ్య. ‘అన్ని గదుల్లో వెతికావా.. తాతయ్యా? పోనీ నేను వెతికి పెట్టనా?’ గది నాలుగు మూలలూ గమనిస్తూ అంది బాల.

‘చూశానమ్మా! ప్చ్‌! కానీ కళ్లజోడు కనబడలేదు’ విచారంగా అన్నాడు తాతయ్య. ‘నేను వెతికితే తప్పకుండా దొరుకుతుంది. మొన్న నీ చేతికర్ర కూడా నాకే దొరికింది.. ఉండండి వెతుకుతాను’ అంటూ లేచింది బాల.

‘బాలా! వెదికేముందు కొంచెం దినపత్రిక చదివి పెట్టమ్మా! పత్రిక చదవకపోతే నాకు రోజు గడవదు’ అన్నాడు తాతయ్య. ఆయన మాటలకు.. ‘నేను చదవలేను తాతయ్యా!’ నిట్టూరుస్తూ సమాధానం చెప్పింది బాల. ‘అయిదో తరగతి చదువుతున్నావుగా! తప్పుగా చదివితే.. నేను వింటూ సరిచేస్తానులే’ అంటూ దినపత్రికను బాల చేతిలో పెట్టాడు తాతయ్య. తప్పదనుకుంటూ.. పత్రికను చదివేందుకు బాల ప్రయత్నం చేసింది.

తడుముకుంటూ.. తడుముకుంటూ.. అక్షరాలను ఒక్కొక్కటిగా కలుపుకుంటూ.. పసిపాప తడబడుతూ అడుగులు వేసినట్లుగా చదవసాగింది. తాతయ్య నవ్వుతూనే బాల చదివే అక్షరదోషాలను వింటూ సరిచేయసాగాడు.

‘ఇక చాలు.. బాలా! మిగతా భాగం బడి నుంచి వచ్చాక సాయంత్రం చదువుదువులే’ అన్నాడు తాతయ్య. తాతయ్య అలా అనడంతో బడికి బయలు దేరడానికి సిద్ధపడింది బాల.

మరుసటి రోజు కూడా తాతయ్య కళ్లజోడు కనబడకపోవడంతో పత్రికను బాలే చదవాల్సి వచ్చింది. ఇబ్బంది పడుతూనే చదవసాగింది. ‘టీవీలో వార్తలు వింటే.. పత్రిక చదవాల్సిన అవసరం లేదు కదా! తాతయ్యా?’ అని బాల సలహా ఇస్తున్నట్లుగా చెప్పింది.

‘చదవడం, రాయడం రాని వాళ్లు, కళ్లు లేని వాళ్లు వినడం ద్వారా తెలుసుకుంటారు. కానీ నాకు చదవడం వచ్చుగా.. కళ్లు కూడా ఉన్నాయి! కళ్లజోడు లేకపోవడంతో నీ మీద ఆధారపడ్డాను. లేకపోతే నేనే చదువుకునేవాణ్ని’ అన్నాడు తాతయ్య.

‘సరే.. తాతయ్యా! మీ కళ్లజోడు దొరికే వరకూ చదివి పెడతానులే’ సర్దుబాటు చేసుకుంటూ సమాధానం ఇచ్చింది బాల. ఇలా ప్రతిరోజూ ఉదయమే తాతయ్య అడగకుండానే దినపత్రిక చదివి పెట్టడం బాల దినచర్యలో భాగమైంది.

ఆ రోజు జనవరి ఒకటో తేదీ. 2021వ సంవత్సరం వెళ్లిపోయి 2022 వచ్చేసింది. ‘నూతన సంవత్సర శుభాకాంక్షలు’ అని బాలే స్వయంగా కాగితం మీద రంగురంగుల పెన్సిళ్లతో తాతయ్యకు రాసిచ్చింది.  

ఒక్క తప్పుకూడా లేకుండా చక్కగా, అందంగా రాసిన కాగితాన్ని చూడగానే తాతయ్యకు ఎంతో ఆనందం వేసింది. ‘బాలా! నీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నువ్వు ఎంతో బాగా రాస్తున్నావు. అన్నట్లు నా కళ్లజోడు దొరికింది.. తెలుసా? ఈ రోజు నుంచి పత్రిక నేనే చదువుకుంటానులే’ అని తాతయ్య తన కళ్లజోడును పెట్టుకుంటూ అన్నాడు.

బాల కళ్లజోడుకేసి ఆశ్చర్యంగా చూస్తూ.. ‘ఎక్కడ దొరికింది.. తాతయ్యా?’ అని అడిగింది. ‘‘నిజం చెప్పనా? కళ్లజోడు నా జేబులోనే ఉంది.. పోలేదు. కానీ సరిగ్గా నెల క్రితం, మీ తెలుగు టీచర్‌ నీ గురించి చెబుతూ.. ‘బాల అన్నీ బాగానే చదువుతోంది. కానీ తెలుగు సరిగ్గా చదవలేకపోతోంది’ అని చెప్పారు. అందుకే నీతో తెలుగు చదివించాలనే కళ్లజోడు కనబడటం లేదని చెప్పాను. ఇప్పుడు నువ్వు చదవడమే కాదు, బాగా రాస్తున్నావు కూడా. ఇక ఈ రోజు నుంచి నిన్ను ఇబ్బంది పెట్టనులే. ప్రతిక నేనే చదువుకుంటాను’ అంటూ కళ్లజోడు పెట్టుకున్నాడు తాతయ్య.

‘తాతయ్యా! నీకు కళ్లజోడు దొరికినా సరే.. పత్రిక మాత్రం నేనే చదువుతాను. ఇప్పుడు నాకు చదవడం కష్టం కాదు. ఎంతో ఇష్టం!’ అంటూ అలవాటులో భాగంగా పత్రికను చదవసాగింది. ‘మా బాల బంగారం!’ అంటూ తాతయ్య బాలను మెచ్చుకున్నాడు.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు