ఇంతకీ ఎవరు గొప్ప!

సింహపురం జమీందారు నరసింహరాజు. ఆయన పేదవారికోసం చక్కని సత్రం కట్టించాలనుకున్నాడు. అందుకోసం ఇసుక, ఇటుకలు, సిమెంట్‌, రాళ్లు, కంకర, ఇనుపచువ్వలు తెప్పించారు. వాటన్నింటినీ ఓ చెట్టుకింద పెట్టించాడు. అవన్నీ కొంతసేపు చెట్టు నీడలో సేదతీరాయి.కాస్త చల్లబడ్డాక..చెట్టుకు ఏవో గుసగుసలు వినపడ్డాయి. వాటిని చెట్టు వింది....

Published : 05 Jan 2022 00:32 IST

సింహపురం జమీందారు నరసింహరాజు. ఆయన పేదవారికోసం చక్కని సత్రం కట్టించాలనుకున్నాడు. అందుకోసం ఇసుక, ఇటుకలు, సిమెంట్‌, రాళ్లు, కంకర, ఇనుపచువ్వలు తెప్పించారు. వాటన్నింటినీ ఓ చెట్టుకింద పెట్టించాడు.

అవన్నీ కొంతసేపు చెట్టు నీడలో సేదతీరాయి.కాస్త చల్లబడ్డాక..చెట్టుకు ఏవో గుసగుసలు వినపడ్డాయి. వాటిని చెట్టు వింది.

‘నేను లేకపోతే భవనం ఎలా కడతారు. ఏ భవంతికైనా నేనేగా ముఖ్యం’ అంది ఇసుక మెల్లగా.. ‘నన్ను కలపకపోతే నువ్వు పొడిపొడిగా రాలిపోతావు. దేనికీ పనికిరావు?’ అంది సిమెంటు. ‘ఆ.. బడాయి! మీరుంటే మాత్రం నన్ను వరుసగా పేర్చాకే గదా మీతో ఉపయోగం. నేను లేకపోతే మీ ఇద్దరినీ ఎందుకు ఉపయోగిస్తారు?’ అంది ఇటుక దబాయింపుగా.

‘ఇదిగో! మీరంతా ఏమనుకున్నా.. సరే నేను మీతో కలవందే.. భవనానికి పటిష్టత వస్తుందా? అసలు పైకప్పు నిలుస్తుందా? అది జారిపడిపోతే ఎవరిది పూచీ. మేమే గొప్ప’ అన్నాయి ఇనుపచువ్వలు.

‘అబ్బో! ఇక ఆపండాపండి మీ కబుర్లు. నేను పునాదిరాయిని. మీ అందరికంటే ముందు నేను. నేను సరిగా లేకపోతే ఇక అంతే. దేనికైనా నేనే ముఖ్యం’ అంది పునాదిరాయి.

‘నన్ను మీరు మరిచిపోయారు. మిమ్మల్నందర్నీ కలిపేదే నేను. కట్టడానికి ముందు, తర్వాత.. నాతో అవసరమే లేదని ఎవర్నైనా చెప్పమనూ! చూస్తా’ అని సవాలు విసిరింది నీటికొలను.

ఇక చిన్న, పెద్ద వస్తువులు విజృంభించి.. ‘నేను గొప్ప అంటే.. నేనే గొప్ప’ అని కీచుకీచుగా అరుస్తున్నాయి.

ఇదంతా వింటున్న చెట్టు నవ్వింది. అన్నీ దాని వంక చూశాయి. ‘అటు చూడండి! ఆ మహిళ ఏం చేస్తోందో’ అని అడిగింది చెట్టు. అన్నీ ఒక్కసారిగా అటుచూసి ‘చీపురుతో ఊడుస్తోంది’ అని ముక్తకంఠంతో చెప్పాయి. ‘చీపురుకు ఎన్ని పుల్లలున్నాయి?’ అడిగింది చెట్టు. ‘చేతికి అమరేటన్ని’ అన్నాయి.

‘మరి అవి ఓ కట్టలా ఎలా ఉన్నాయి’ అడిగింది చెట్టు. ‘ఓ తాడుతో!’ అన్నాయి.

‘తాడును తీసి ఊడ్చమని, ఒక పుల్లతోనో, రెండు పుల్లలతోనో ఊడ్చమని చెప్పండి ఆమెకు’ అంది చెట్టు. ‘అదెలా సాధ్యం? ఆ తాడు తీసేస్తే.. పుల్లలు చెల్లాచెదురై, ఊడ్చడం అసాధ్యం’ అన్నాయి అవన్నీ.

‘మరి అన్ని పుల్లల్లో ఏ పుల్ల గొప్పదో వెతికి పట్టుకుని, దాంతో ఊడిస్తే పోలా?’ అంది చెట్టు.

వస్తువులన్నీ ఒకదాని మొహం మరోటి చూసుకున్నాయి. ‘ఇది సాధ్యం కాదు కానీ.. అన్నీ కట్టగా కలిసి, తాడుతో కడితేనే ఊడ్చడానికి అవుతుంది’ అన్నాయి.

‘కదా! వాటిలో ఏ పుల్ల గొప్పదో.. చెప్పలేనప్పుడు మీలో ఎవరు ముఖ్యమో, ప్రాధాన్యమెవరికో.. మీరెలా నిర్ణయిస్తారు? పుల్లలన్నీ కలిస్తేనే మాలిన్యాలు తుడిచే చీపురు. మీరంతా కలిస్తే నివాసయోగ్యమైన చక్కని కట్టడం. చక్కని కట్టడాలు కలిస్తేనే చూడచక్కని ఊరు. అలాంటి అనేక ఊళ్లు కలిస్తేనే దేశం. ఐక్యతే బలం. ఇప్పుడు చూడండి.. నేను ఎన్ని ఆకులతో కళకళలాడుతున్నానో! అదే.. నేను ఒకే ఆకుతో ఉంటే నేను మీకు నీడనిచ్చేదాన్నా?’ అంది చెట్టు.

‘నువ్వు చెప్పింది నిజమే. కలిసికట్టుగా ఉన్నప్పుడే బంధాలు బలంగా ఉంటాయి’ అని అవి ఒప్పుకున్నాయి. తమకు చల్లని నీడనివ్వడమే కాకుండా.. చక్కటి మాటలు చెప్పిన చెట్టు వంక స్నేహపూర్వకంగా చూశాయి అవన్నీ.

- భాగవతుల భారతి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని