అయ్యో... పాపం అనంతయ్య!

అనంతయ్య ఓ వస్త్రవ్యాపారి. ఒకరోజు ఆయన వస్త్రాలు కొనేందుకు నగరానికి బయలుదేరాడు. డబ్బు సంచి పైకి కనబడకుండా మొలకు కట్టుకున్నాడు. అందులో అన్నీ నాణేలే ఉండటంతో బరువుగా ఉంది.

Published : 06 Jan 2022 00:12 IST

నంతయ్య ఓ వస్త్రవ్యాపారి. ఒకరోజు ఆయన వస్త్రాలు కొనేందుకు నగరానికి బయలుదేరాడు. డబ్బు సంచి పైకి కనబడకుండా మొలకు కట్టుకున్నాడు. అందులో అన్నీ నాణేలే ఉండటంతో బరువుగా ఉంది.

కొంతదూరం వెళ్లాక ఒక అపరిచితుడు చెట్టు కింద కూర్చుని కనిపించాడు. అతని పక్కనే చేతికర్ర ఉంది. దాంతో అనంతయ్య అతడిని చూడగానే యాచకుడిగా పోల్చుకున్నాడు. ఊహించినట్లుగానే ఆ కొత్తవ్యక్తి ‘అయ్యా! ధర్మం చేయండి’ అని చేతులు చాచాడు. ‘కాళ్లూ.. చేతులూ బాగానే ఉన్నాయిగా’.. అతడినే పట్టిపట్టి చూస్తూ అన్నాడు అనంతయ్య.

‘ఎక్కడ బాబూ! పైకి కాళ్లు బాగున్నట్లే కనిపించినా, పక్షపాతం వచ్చి చచ్చుబడిపోయాయి. మీలాంటి మహాత్ములు ఇచ్చే కాసిన్ని డబ్బులతోనే భారంగా జీవితం గడుపుతున్నాను. సాయంత్రం వరకూ ఇలా అడుక్కొని, కాళ్లీడ్చుకుంటూ ఇంటికి వెళ్లేసరికి అందరూ నిద్రపోయే సమయమవుతోంది. ఏదో ఇలా మొండిగా బతికేస్తున్నాను’ అని దీనంగా చెప్పాడు యాచకుడు.

అనంతయ్య జేబులో చేతులు పెట్టి కాసింత చిల్లరను గుప్పిట పట్టుకున్నాడు. అయితే వాటిని బయటకు తీయబోతూ.. ‘వీడికి ఇద్దామా? వద్దా?’ అని సంశయంలో పడ్డాడు. ‘అయ్యా.. ఇవ్వాలా? వద్దా? అని ఆలోచిస్తున్నారు కదూ’ ముఖంలోకి చూస్తూ అడిగాడు యాచకుడు. ‘వీడు నా మనసును చదివేస్తున్నట్లున్నాడు’ అని లోలోన అనుకున్నాడు అనంతయ్య.

‘మిమ్మల్ని చూస్తే వ్యాపారిలా అనిపిస్తున్నారు. నా ముఖాన కాసింత చిల్లర పడేస్తే, మీకు ఉపయోగపడే విషయమొకటి చెబుతాను’ అని బిచ్చగాడు చేతులు చాస్తూ అడిగాడు.

అనంతయ్య చిల్లర తీసి అతని చేతిలో పెట్టి.. ‘ఏంటో చెప్పు?’ కాస్త వంగి అడిగాడు. ‘ఓ పదినిమిషాల కిందటే, ఈ దారిన దొంగల గుంపు వెళ్లింది. వారికి దొరికితే మిమ్మల్ని పూర్తిగా దోచేస్తారు’ అని చెప్పాడు.
‘అయ్యో! ఇప్పుడెలా మరి?’ అన్నాడు వ్యాపారి. ‘కంగారు పడకండి... ఈ చెట్టు ఎక్కి, చుట్టూరా చూడండి. కనుచూపుమేరలో దొంగలు కనబడకపోతే.. మీరు నిశ్చింతగా వెళ్లొచ్చు. లేదంటే.. ఓ పావుగంట ఆగి వెళ్లండి’ అని ఉపాయం చెప్పాడు యాచకుడు.

అనంతయ్య చెట్టు ఎక్కబోతుండగా, నడుముకు కట్టుకున్న డబ్బు సంచీ బరువుగా అనిపించింది. దాన్ని తీసి యాచకుడి ఒడిలో పెట్టి.. ‘నేను దిగాక దీన్ని నాకు తిరిగి ఇవ్వు’ అని చెట్టెక్కడం మొదలు పెట్టాడు.
‘చెట్టు జాగ్రత్తగా ఎక్కండి... ఎక్కేటప్పుడు కిందకు చూడకండి... కళ్లు తిరుగుతాయి... జారిపడతారు..’ అని ముష్టివాడు చెట్టువైపు చూస్తూ చెప్పాడు. అనంతయ్య చెట్టెక్కి చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. ‘హమ్మయ్య.. దొంగలు వెళ్లిపోయినట్లున్నారు’ అనుకుని ఆనందంగా చెట్టు దిగాడు. ఆశ్చర్యం! యాచకుడు లేడు. తన డబ్బుమూట కూడా లేదు. కాస్తదూరంలో పరిగెత్తుతూ కనిపించాడు.

అనంతయ్య లబోదిబోమన్నాడు. వాడివెంట పరిగెత్తి పరిగెత్తి... అలసిపోయి, ఇక తన వల్ల కాక ఆగిపోయాడు. తొందరపాటున అపరిచితుణ్ని నమ్మినందుకు తగిన శాస్తే జరిగిందని బాధపడుతూ ఇంటికి తిరిగి వెళ్లాడు.

- శాఖమూరి శ్రీనివాస్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని