ఉచిత సలహాలు!

మృగరాజు మంత్రిగా ఉన్న ఎలుగుబంటి మంత్రాంగం, సేవకుడిగా ఉన్న నక్కకు నచ్చలేదు. సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్న నక్కకు కాలం కలిసి వచ్చింది. అది వేసవి కాబట్టి ఎండ వేడిమి తీవ్రస్థాయిలో ఉంది. మధ్యాహ్నమంతా గుహలో రాచకార్యాలు చూసిన మృగరాజుకు చల్లదనంలో సేద తీరాలనే కోరిక కలిగింది.

Published : 07 Jan 2022 01:54 IST

మృగరాజు మంత్రిగా ఉన్న ఎలుగుబంటి మంత్రాంగం, సేవకుడిగా ఉన్న నక్కకు నచ్చలేదు. సమయం, సందర్భం కోసం ఎదురు చూస్తున్న నక్కకు కాలం కలిసి వచ్చింది. అది వేసవి కాబట్టి ఎండ వేడిమి తీవ్రస్థాయిలో ఉంది. మధ్యాహ్నమంతా గుహలో రాచకార్యాలు చూసిన మృగరాజుకు చల్లదనంలో సేద తీరాలనే కోరిక కలిగింది. అందుకే సాయంత్రం సమయంలో.. గుహ నుంచి మందీమార్బలంతో బయటకు వచ్చింది.

ఇంతలో సింహం ఒక్కసారిగా తూలిపడింది. నక్క, మృగరాజు చెంతచేరి శరీరానికి అంటుకున్న మట్టిని దులిపింది. ‘మంత్రివర్యా! మృగరాజు నడిచే దారి విషయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది. పొరపాటున జరగరానిది జరిగితే..! ఈ నేలను చిందరవందరగా చేసి మృగరాజు తూలిపోవడానికి కారణమైన ఎలుకల పనిపట్టండి’ అంది నక్క.

‘వాటిని మందలిస్తాను’ సంజాయిషీ ఇచ్చుకుంది ఎలుగుబంటి. ‘జాతి లక్షణం ముందు మందలింపు ఏ మూలకు? నేలపై పొరను మూతులతో తొలిచి నిక్షేపం లాంటి ప్రదేశాన్ని చిందరవందరగా చేశాయి. అక్కడితో ఆగక.. చెట్టు, చేమ ఎక్కి.. పళ్లు, కాయలూ కొరికి నేలపాలు చేస్తుంటాయి. ఉడుతలు కూడా అంతే. అటువంటి చిన్న జీవులు ఆహారానికి తక్కువ, అలజడికి ఎక్కువ. వీటికి అడవిలో చోటు ఇచ్చి మనం ఇబ్బందులు పడుతున్నాం. ఇలాంటి విషయాలను మంత్రివర్యులు పరిగణనలోకి తీసుకుని చర్యలు తీసుకోవాలి’ అని అక్కసును వెళ్ల్లగక్కింది నక్క.

‘అందరూ బాగుంటే మనమూ బాగుంటాం’ అని సర్దుబాటు చేయబోయింది ఎలుగుబంటి. ‘మృగరాజు ఈ అడవికి రాజు. రాజుకే భద్రత లేకపోతే ఎలా?’ అంటూ అడ్డుతగిలింది నక్క. అప్పుడు మృగరాజు కలుగజేసుకుని సర్పకేతుడనే పామును పిలవమని నక్కను పురమాయించింది. నక్క విజయగర్వంతో అక్కడ నుంచి కదిలింది. సలహాను స్వీకరించిన మృగరాజు.. తొందర్లోనే తనను మంత్రి పదవికి ఎన్నిక చేయడం ఖాయం అని కలలు కనడం ప్రారంభించింది.

రోజులు గడుస్తున్నాయి. వర్షాకాలం వచ్చింది. కొద్దిపాటి వర్షానికే అడవంతా వరదమయైపోతుంది. దానికి తోడు వర్షం వెలిసిన వెంటనే కప్పల బెకబెకలతో అడవంతా హోరెత్తిపోయింది. మృగరాజుకు కూడా నిద్రలేమి ఒకింత అసహనానికి గురి చేసింది. నక్క సలహా మేరకు మళ్లీ సర్పకేతుకి కబురు పంపి కప్పల అంతు చూడమని ఆజ్ఞాపించింది.

వర్షాకాలం ముగిసి చలికాలం వచ్చింది. వెచ్చదనం కోసం గుహలో నిద్రపోతున్న సింహానికి.. దోమలు కంటి మీద కునుకు లేకుండా చేశాయి. వేసవికాలం ప్రారంభంలోనే అడవిలో ఉన్న చెరువు ఎండిపోయి జంతువులకు తాగునీటి సమస్య ఎదురైంది. ఈ వార్త సింహానికి తెలిసి నష్ట నివారణ చర్యల కోసం మంత్రితో సమాలోచనలు ప్రారంభించింది.

సేవకుడిగా అక్కడే ఉన్న నక్క మాత్రం ఉచిత సలహాలు ఇవ్వడం ప్రారంభించింది. ఈసారి ఎలుగుబంటి ఊరుకోలేదు. ‘మృగరాజా! రాజుగా మీరు ఎవరు ఏది చెప్పినా వినాలి. అందులో మంచీచెడులు ఆలోచించుకోవాలి. అందరూ బాగుంటే మనం బాగుంటామన్న ధర్మం నేను చెబితే దాన్ని విస్మరించారు. దాని ఫలితమే సంవత్సర కాలంగా మనం అనుభవిస్తున్న శిక్ష. ఎలుకలు, ఉడుతలు, కప్పలు లేకపోవడం వల్లే మనం ఇన్ని బాధలు పడుతున్నాం’ అని కారణాలతో సహా వివరించి చెప్పింది.  

‘నక్క పిచ్చి పిచ్చి సలహాల వల్లే ఇదంతా..’ అని అర్థం కావడంతో నక్కవైపు సింహం కోపంగా చూసింది. నక్కకు నోట మాట రాలేదు. ఎలుగుబంటి కొన్ని దిద్దుబాటు చర్యలు చెప్పింది. అప్పటి నుంచి సింహం నక్క సలహాలు వినడం మానుకుంది. నక్క కూడా ఇంకెప్పుడూ సలహాలు ఇచ్చే సాహసం చేయలేదు.

- బి.వి.పట్నాయక్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని