నల్లకుక్క.. తెల్ల కుక్క..

ఒక ఊళ్లో తెల్లకుక్క, నల్లకుక్క ఎంతో స్నేహంగా ఉండేవి. దొరికిన ఆహారాన్ని సగం సగం పంచుకుని తినేవి. మిగతా కుక్కలు కూడా వీటిని చూసి ‘స్నేహమంటే ఇలా ఉండాలి’ అంటూ పొగిడేవి. అవి రెండూ ఎవరికి ఎదురుపడినా వాళ్లు తెల్లకుక్కనే ఎత్తుకుని ఎంతో ఆప్యాయంగా నిమురుతూ ‘ఎంత బాగుందో’

Published : 09 Jan 2022 01:07 IST

క ఊళ్లో తెల్లకుక్క, నల్లకుక్క ఎంతో స్నేహంగా ఉండేవి. దొరికిన ఆహారాన్ని సగం సగం పంచుకుని తినేవి. మిగతా కుక్కలు కూడా వీటిని చూసి ‘స్నేహమంటే ఇలా ఉండాలి’ అంటూ పొగిడేవి. అవి రెండూ ఎవరికి ఎదురుపడినా వాళ్లు తెల్లకుక్కనే ఎత్తుకుని ఎంతో ఆప్యాయంగా నిమురుతూ ‘ఎంత బాగుందో’ అంటూ ఆడించేవాళ్లు. ఆహారం కూడా తెల్లకుక్కకే పెట్టేవారు. పక్కనే ఉన్న నల్లకుక్కను పట్టించుకునేవాళ్లు కాదు. పైగా ఎదురుపడితే కొట్టి తరిమేసేవాళ్లు.

కొద్దిరోజుల తర్వాత.. తనను అందరూ మెచ్చుకుంటున్నారనే పొగరు తెల్లకుక్కలో బాగా పెరిగిపోయింది. ఆరోజు నుంచి జతగా ఉన్న నల్లకుక్కను ‘నువ్వు నల్లగా ఉన్నావు. అందుకే ఎవరూ నిన్ను పట్టించుకోరు. నేను తెల్లగా ఉన్నాను కాబట్టి, అందరూ నన్ను మెచ్చుకుంటున్నారు. నా వల్లనే నీకు తిండి దొరుకుతోంది. లేకుంటే ఆకలితో మాడిపోయే దానివి’ అంటూ దెప్పిపొడుస్తూ ఉండేది. నల్లకుక్క నిజమే అనుకుని చాలా బాధపడేది. ‘ఆ దేవుడు నాక్కూడా తెలుపు రంగు ఇచ్చుంటే బాగుండేది’ అని మనసులో అనుకుని మదనపడేది. తెల్లకుక్క నల్లకుక్కతో వెట్టిచాకిరి చేయించుకోవడం మొదలుపెట్టింది. ‘చెప్పిన పని చేయకుంటే నాకు దొరికే ఆహారంలో సగభాగం  నీకు ఇవ్వను’ అంటూ బెదిరించేది.

ఒకరోజు ఒకతను ఈ రెండు కుక్కలను చూశాడు. తెల్లకుక్కను ఎత్తుకుని ముద్దు చేసి.. ఇది చాలా బాగుంది. మన బంగ్లాలో కట్టేద్దాం. అందంగానూ ఉంటుంది. కాపలాకి పనికొస్తుంది’ అన్నాడు. ‘చూశావా.. నేను అందంగా ఉన్నాను కాబట్టే నాకు పెద్ద బంగళాలో చోటు దొరికింది. మంచి తిండి పెడతారు. అదృష్టం అంటే ఇదే! అందరికీ రాదు’ అంది తెల్లకుక్క. నల్లకుక్క బాధతో కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఏడవకు.. నీక్కూడా మంచి రోజులు వస్తాయిలే.. ఈ జన్మలో మాత్రం కాదు. నాలాగా తెల్లగా పుడితే తప్పకుండా వస్తాయి’ అని వెటకారంగా అంది తెల్లకుక్క. ‘నేను బాధపడుతున్నది అందుక్కాదు. నేను రంగు మాత్రమే నలుపు ఉన్నాను. నా మనసు ఎప్పుడూ తెల్లగా ఉంటుంది. ఇన్నాళ్లు కలిసి తిరిగాము.. కలిసి తిన్నాము. ఇప్పుడు నువ్వు హఠాత్తుగా దూరం అవుతుంటే బాధగా ఉంది అంతే!’ అంది నల్లకుక్క. ఆ మాటకు గట్టిగా నవ్వేసింది తెల్లకుక్క. ‘అన్ని రోజులూ ఒకేలా ఉండవు. మార్పులు జరగడం సహజం. ఆ దేవుడు నీకు బజార్లు తిరిగే రాత రాశాడు.. నాకు భవనంలో సుఖ జీవితం రాశాడు’ అంది తెల్లకుక్క. నల్లకుక్క ఏడుస్తుంటే హేళనగా నవ్వుకుంటూ ఆ వ్యక్తి వెంట వెళ్లిపోయింది తెల్లకుక్క.

అలా కొద్ది రోజులు గడిచిపోయాయి. నల్లకుక్క ఒంటరి అయిపోవడంతో, వేళకు సరిగా తిండి దొరికేది కాదు. వీధుల వెంబడి తిరుగుతూ కాలం గడపసాగింది. ఒకరోజు ఒక చెత్త కుండీ పక్కన పడుకొని దీర్ఘంగా ఆలోచిస్తుంది. సరిగ్గా అదే సమయానికి తెల్లకుక్క పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చింది. ‘నువ్వు ఇక్కడ ఉన్నావా..? నీకోసం ఊరంతా వెతికాను’ అంటూ ఆతృతగా అడిగింది తెల్లకుక్క. ‘ఏమైంది? ఎందుకు వెతికావు?’ అని అంది నల్లకుక్క. ‘నేను తప్పించుకుని పారిపోయి వచ్చాను. దూరంగా వెళ్లి మాట్లాడుకుందాం రా..’ అంటూ ఊరి బయటకు తీసుకు వెళ్లింది. కన్నీళ్లు పెట్టుకుని నల్లకుక్క పాదాలు పట్టుకుంది తెల్లకుక్క. ‘నన్ను క్షమించు మిత్రమా! నువ్వు నల్లగా ఉన్నావని ఎగతాళి చేశాను. నీతో వెట్టి చాకిరి చేయించాను. నాకు రాజభోగం లభించిందని సంబరపడ్డాను. ఆ బంగ్లా కంటే నీతో ఉండటమే మేలు. వాళ్లు నన్ను గొలుసుతో బంధించారు. వాళ్లు చెప్పినట్లు వినాలి. పెట్టింది తినాలి. ఇంటికి కాపలా కాయాలి. కొంచం కూడా స్వేచ్ఛ లేని బతుకైంది. తోటి కుక్కలతో కలవనివ్వరు. బయటకు వదలరు. నిలబడి.. నిలబడి కాళ్లు పట్టేశాయి. నేను నీతోనే ఉంటాను మిత్రమా..’ అంటూ కన్నీరు కార్చింది.

అది విన్న వెంటనే గట్టిగా నవ్వేసింది నల్లకుక్క. ‘నేను నల్లగా ఉన్నాను అని నన్ను వెటకారం చేశావు. స్వేచ్ఛ లేని జీవితం ఎంత అందంగా ఉంటే మాత్రం ఏం ప్రయోజనం. నలుగురితో స్నేహంగా ఉండలేనప్పుడు ఎంత బాగుంటే మాత్రం ఏం ఉపయోగం. శరీరం ఎలా ఉన్నా లోపలి మనసు బాగుంటే చాలు. రంగును బట్టి గుణాన్ని, లక్షణాన్ని ఎప్పటికీ ఎంచకూడదు. స్నేహానికి కావలసింది రంగూ ఆర్భాటం కాదు, సహాయం చేసే బుద్ధి. ఇప్పటికయినా తెలుసుకున్నందుకు చాలా సంతోషం’ అంటూ తెల్లకుక్కను దగ్గరకు తీసుకుంది నల్లకుక్క. తెల్లకుక్క పశ్చాత్తాప పడుతూ నల్లకుక్కకు మరోసారి క్షమాపణ చెప్పింది.

- నరెద్దుల రాజారెడ్డి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు