సింహానికి జలుబు చేసింది!

‘మన అడవికి రాజైన సింహానికి జలుబు చేసింది. ఉదయం నుంచి జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. నిన్ను దగ్గరుండి తీసుకురమ్మని మన మంత్రి కుందేలు చెప్పారు’ అంటూ కాకి ఎగురుకుంటూ వచ్చి వైద్యుడైన కొంగతో చెప్పింది.

Updated : 10 Jan 2022 00:08 IST

‘మన అడవికి రాజైన సింహానికి జలుబు చేసింది. ఉదయం నుంచి జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. నిన్ను దగ్గరుండి తీసుకురమ్మని మన మంత్రి కుందేలు చెప్పారు’ అంటూ కాకి ఎగురుకుంటూ వచ్చి వైద్యుడైన కొంగతో చెప్పింది.

‘ఎవరికి జలుబు? చీమకా..? నేను రాను’ వెటకారంగా అంది కొంగ. ‘చీమకు కాదు.. సింహానికి. వినబడలేదా?’ చిరాకు పడుతూ అంది కాకి. ‘సింహానికే!!.. అయితే రావాల్సిందే.. పద’ అంటూ కొంగ.. జలుబు మందు తీసుకుని బయలు దేరింది. అక్కడ సింహం గుహ ముందు ఏనుగు, జిరాఫీ, కోతి, జింక మొదలైనవి ఉన్నాయి. వాటిని చూసి వెటకారంగా నవ్వుతూ ‘జలుబు మన మృగరాజుకు చేస్తే మీరంతా దేనికి?’ వెక్కిరిస్తూ అంది కొంగ.

‘మన రాజుకు ఎలా ఉందో తెలుసుకుందామని వచ్చారులే! నువ్వు గుహలోకి నడు’ మంత్రి అయిన కుందేలు కొంగతో అంది. ‘గుహలోకి నేను ఒంటరిగా వెళ్లలేను. తోడుగా నువ్వూ రావాలి’ కుందేలుతో అంది కొంగ. ‘సరే పద!’ అంటూ కుందేలు కూడా.. కొంగతో పాటు గుహలోకి నడిచింది.

కొంగ గుహలోకి అలా వెళ్లిందో లేదో.. కుందేలు, అక్కడున్న జంతువుల సాయంతో గుహ ముందు మార్గాన్ని ఒక పెద్ద బండరాయితో మూసేసింది. తీరా చూస్తే గుహలో సింహం లేదు. చిన్నగా వెలుతురు వస్తోంది. సన్నగా గాలి వీస్తోంది. గుహ అంతా  చీకటిగా ఉంది. కొంగకు భయం వేస్తోంది. బిగ్గరగా అరవసాగింది. ‘నన్ను గుహలో ఎందుకు బంధించారు? మృగరాజుకు ఈ విషయం చెప్పి మీకు శిక్ష పడేలా చేస్తాను’ అంది కొంగ. ఆ మాటలకు గుహ తెరచుకుంది. ‘నా మాటలకు భయపడి గుహను తెరిచారు’ అనుకుంటూ కొంగ గుహ నుంచి వస్తూ ముందుకు చూసింది. దాని ఎదురుగా సింహం ఉంది.

కొంగకు ఒక్కసారిగా భయం వేసింది. అయినా ధైర్యం తెచ్చుకుంది. ‘మృగరాజా! మీకు జలుబు చేసిందంటే మందు ఇవ్వడానికి వచ్చాను. కానీ బయట ఉన్న వాళ్లు నన్ను గుహలో బంధించేశారు. మీకు మందు ఇస్తాను. కానీ వాళ్లను మీరు కఠినంగా శిక్షించాలి. కొంగ దీనంగా అంది. సింహం అక్కడే ఉన్న దిమ్మ మీద కూర్చుంటూ ‘జలుబు చేసింది నాకు కాదు.. కోతి పిల్లకు’ అంది గట్టిగా. ‘మరి మీకు జలుబు అని అబద్ధం ఎందుకు చెప్పారు?’ కొంచెం ధైర్యం తెచ్చుకుని అడిగింది కొంగ. ‘ఎందుకా! నిన్న రాత్రి కోతి తన పిల్లకు జలుబు చేసిందని మందు కోసం నీ దగ్గరకు వస్తే నువ్వు కనీసం పట్టించుకోలేదు. మందు ఇవ్వలేదు. కాకి ద్వారా నువ్వు చేసిన పని నాకు తెలిసింది. చిన్న జీవులు వైద్యం కోసం నీ దగ్గరకు వస్తుంటే, వాటిని చిన్న చూపు చూస్తూ పట్టించుకోవట్లేదు’ అని తెలిసింది. ఇప్పుడు చెప్పు.. నేను శిక్ష ఎవరికి వేయాలి? నీకా? వాళ్లకా?’ సింహం గట్టిగా గర్జిస్తూ అడిగే సరికి కొంగకు భయం వేసింది.

తన తప్పు మృగరాజుకు తెలిసి పోవడంతో తలదించుకుంది. ‘వైద్యుడు దేవునితో సమానం. ఎందుకంటే దేవుని దృష్టిలో అందరూ సమానమే! తరతమ భేదాలుండవు కనుక.. వైద్యుడైన నువ్వు కూడా అలాగే ఉండాలి. నువ్వు చేసిన మొదటి తప్పు కనుక గుహలో కొంత సేపు బంధించి, కోతి పడిన బాధ నీకు తెలిసొచ్చేలా చేశాను. మరొక్కసారి చేస్తే శిక్ష తీవ్రంగా ఉంటుంది. జాగ్రత్త!’ కొంగను హెచ్చరిస్తూ అంది సింహం.   ‘తప్పయిపోయింది మృగరాజా! ఇకనుంచి అందరినీ సమాన దృష్టితో చూస్తాను’ కొంగ బుద్ధి తెచ్చుకుంటూ.. కోతి పిల్లకు మందు వేయడానికి నడిచింది. సింహం అక్కడున్న జంతువులతో ‘చూడండీ.. మీరు బాగుంటే నేనూ బాగుంటాను. మీకే కష్టం వచ్చినా కాకి చేత కబురు పెట్టండి చాలు’ అంది. అక్కడున్న జంతువులన్నీ మృగరాజుకూ జై’ అన్నాయి.

- కె.వి.లక్ష్మణరావు


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని