ఉందిలే.. మంచికాలం!

జయదత్తుడు రెండు ఎకరాలున్న రైతు. అతనికి శుభదత్తుడు ఒక్కగానొక్క కొడుకు. ఉన్న ఊర్లోనే గురువుల వద్ద విద్యాభ్యాసం చేశాడు. అక్కడ చదువు పూర్తయ్యాక పట్టణం వెళ్లి చదువుకుందామనుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకును దూరం పంపలేక, జయదత్తుడు ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకోమన్నాడు. శుభదత్తుడు తండ్రి మాట కాదనలేకపోయాడు...

Published : 11 Jan 2022 00:54 IST

యదత్తుడు రెండు ఎకరాలున్న రైతు. అతనికి శుభదత్తుడు ఒక్కగానొక్క కొడుకు. ఉన్న ఊర్లోనే గురువుల వద్ద విద్యాభ్యాసం చేశాడు. అక్కడ చదువు పూర్తయ్యాక పట్టణం వెళ్లి చదువుకుందామనుకున్నాడు. ఒక్కగానొక్క కొడుకును దూరం పంపలేక, జయదత్తుడు ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేసుకోమన్నాడు. శుభదత్తుడు తండ్రి మాట కాదనలేకపోయాడు.

వరుసగా మూడేళ్లు వానలు సరిగా కురవకపోవడంతో పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. శుభదత్తుడికి వ్యవసాయం అంటేనే చిరాకు అనిపించింది. తండ్రితో ‘నేను వ్యవసాయం చేయలేను నాన్నా.. నాకేదైనా బతుకుదెరువు చూడండి’ అన్నాడు. జయదత్తుడు, అతడిని తనకు తెలిసినవారి అంగట్లో పనికి పెట్టాడు. కొద్దిరోజులు గడిచాక, శుభదత్తుడు నీరసంగా ఇల్లుచేరి.. ‘ఆ పని నావల్ల కాదు నాన్నా! ఆ వెట్టిచాకిరి నేను చేయలేను’ అన్నాడు. ‘సరే లేరా!’ అని జయదత్తుడు, కొడుకుతో ఊర్లోనే చిన్న వ్యాపారం పెట్టించాడు. వారానికోసారి శుభదత్తుడు సంతకెళ్లి సరకులు తెచ్చి ఊరిలో అమ్మేవాడు. సొంతూరవడంతో అందరూ బంధుమిత్రులే. అప్పుగా తీసుకుని పోవడం ఎక్కువ, తిరిగి చెల్లించడం తక్కువ. సంవత్సరం గడిచేసరికి వ్యాపారం దివాళా తీసింది.
ఈ రెండు చేదు అనుభవాలతో శుభదత్తుడికి తనమీద తనకు నమ్మకం పోయింది. ఎప్పుడూ వీధి అరుగు మీద నిరాశతో దిగులుగా కూర్చుని ఉండేవాడు. కొడుకును చూస్తు జయదత్తుడు విచారంలో మునిగిపోయేవాడు. అలా ఉండగా.. ఒకరోజు పక్కింటి పిల్లవాడు పలకతో, అరుగు మీద కూర్చున్న శుభదత్తుడి దగ్గరకు వచ్చి ‘అన్నా! ఈ లెక్క ఎంత చేసినా జవాబు రావడం లేదు. మీరు కాస్త చేసిపెట్టండి’ అన్నాడు. శుభదత్తుడికి కూడా ఆ లెక్క కొత్తగా అనిపించింది. కాస్త కష్టపడ్డ తర్వాత దానికి జవాబు దొరికింది. పిల్లవాడి ముఖంలో వెలుగు చూసి ఏదో తెలియని ఆనందం శుభదత్తుడికి కలిగింది. ఆ తర్వాత పిల్లవాడు అప్పుడప్పుడు వచ్చి సందేహాలు తీర్చుకుని వెళ్లేవాడు.

పిల్లవాడి సందేహాలు తీర్చడానికి శుభదత్తుడూ ముందు కాస్త సిద్ధపడాల్సి వచ్చేది. అయినా శుభదత్తుడికి అది ఆనందం కలిగించేది. ఒకరోజు పిల్లవాడి తండ్రి, జయదత్తుడితో.. ‘మా వాడికి మీ వాడి దగ్గర చదువుకోవాలని ఉంది. ఎంతో కొంత ఇచ్చుకుంటాను. కాదనకండి’ అన్నాడు. ఈ ప్రతిపాదనకు జయదత్తుడు ఒప్పుకొన్నాడు. ఖాళీగా ఉంటే కొడుకు మనసు పాడవుతుందేమోనని అతని భయం.

తండ్రి కోరిక మేరకు ఆ పిల్లవాడికి చదువు చెప్పడం ప్రారంభించాడు శుభదత్తుడు. అలా చెబుతూ ఉంటే తనకూ ఎంతో ఆనందంగా ఉండడం గమనించాడు. అదేం వేళా.. విశేషమో కానీ ఒకరు, ఇద్దరయ్యారు. ఇద్దరు, నలుగురయ్యారు. అలా చూస్తుండగానే విద్యార్థుల సంఖ్య వంద దాటింది. అరుగు పట్టక ఎండలో రహదారి మీద పిల్లలు కూర్చోసాగారు.

ఒకరోజు ఆ దారిన పోతున్న గ్రామాధికారి ఇది చూసి, తక్షణం తాటాకు పాక వేయించాడు. తర్వాత ఆ పాక పది పాకలైంది. గురువులు పెరిగారు. తమ పిల్లలు విద్యావంతులు అవుతున్నందుకు గ్రామస్థులు సంతోషించారు. కొడుకు ప్రయోజకుడైనందుకు జయదత్తుడూ ఆనందించాడు.

- గంగిశెట్టి శివకుమార్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని