Published : 14/01/2022 01:01 IST

తెలివైన నక్క!

నగనగా ఒక అడవి. ఆ అడవిలో ఓ పెద్దపులి. అది ఒక గుహలో నివసిస్తూ ఉండేది. జంతువులను వేటాడిన తర్వాత.. తినగా మిగిలిన మాంసాన్ని గుహలో దాచుకునేది. పులి ఉన్న ఆ గుహవైపు ఏ జంతువు కూడా వెళ్లడానికి సాహసించేది కాదు. పొరపాటున దాని కంటపడితే ప్రాణాలు పోవడం ఖాయం.. కాబట్టి జంతువులన్నీ ఆ గుహ దరిదాపుల్లోకి కూడా వెళ్లేవి కావు.

ఓ రోజు ఎప్పటిలాగే అడవిలోకి వేటకు వెళ్లింది. సాయంత్రం గుహకు చేరుకుని చూస్తే.. దాచుకున్న మాంసం కనబడలేదు. పులి ఆశ్చర్యపోయింది. ‘మాంసం ఎలా మాయమైపోయిందబ్బా!’ అని ఆలోచనలో పడింది.

‘ఏ జంతువైనా వచ్చి మాంసాన్ని దొంగతనం చేసిందా? ఇక్కడికి జంతువులు రావడం అసాధ్యం. నేనంటేనే వాటికి హడల్‌’ అని తనలో తాను అనుకుంది పులి. ఆ రోజు తెచ్చుకున్న మాంసాన్ని గుహలో భద్రపరిచి నిద్రపోయింది. మరునాడు వేటకు వెళ్లి తిరిగొచ్చిన పులికి మళ్లీ ఖాళీ గుహ దర్శనమిచ్చింది. ఈరోజు కూడా మాంసం మాయమైంది. పులికి కోపం వచ్చింది. ఎవరో రోజూ దొంగతనం చేస్తున్నారని దానికి అర్థమైంది. ఎలాగైనా దొంగను పట్టుకోవాలని నిర్ణయించుకుంది.

మరుసటి రోజు పులి వేటకు వెళ్లలేదు. దొంగను పట్టుకోవడానికి గుహపై ఉన్న పొదల్లో నక్కి కూర్చుంది. అక్కడి నుంచి చూస్తే గుహ ముందు భాగం అంతా స్పష్టంగా కనిపిస్తోంది. పులి, దొంగను పట్టుకోవడానికి ఓపికగా నిరీక్షిస్తోంది. మధ్యాహ్నమైంది.. సూర్యుడు నడి నెత్తిపై ఉన్నాడు. అప్పుడు కాస్త అలికిడైంది. పులి జాగ్రత్తగా గమనించసాగింది. దానికి ఒక నక్క గుహలోకి వెళ్లడం కనిపించింది.

‘ఓహో.. ఇది దీని పనా! ఈరోజు నా పంజాతో దీనికి చావు ఖాయం..’ అనుకుంటూ భయంకరంగా గాండ్రిస్తూ గుహలోకి వెళ్లింది.

నక్కకు, పులిని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి. ఊహించని పరిణామానికి నక్క బిత్తరపోయింది. ఏం చేయాలో తోచలేదు. పారిపోవడానికి అవకాశం లేదు. బిక్కుబిక్కుమంటూ ఓ మూలకు నక్కి కూర్చుంది.

నక్కతో పులి కోపంగా.. ‘ఏయ్‌ నక్కా.. ఎంత ధైర్యం నీకు. నేను తెచ్చుకున్న మాంసాన్నే దొంగిలిస్తావా? ఈరోజు నా చేతుల్లో నీకు చావు మూడింది’ అని పంజా విసరబోయింది. ‘తప్పు చేశాను.. నన్ను క్షమించు.. అయినా చంపాలనుకుంటే, నేను చెప్పే మాటల్ని కూడా కాస్త విను’ అని కన్నీళ్లు పెట్టుకుంది నక్క. వెంటనే పులి తన పంజాను వెనక్కు తీసుకుంది.

‘నాకు వృద్ధులైన, జబ్బుపడిన తల్లిదండ్రులున్నారు. వారికి ఆహారం అందించాల్సిన బాధ్యత నాపై పడింది. ఆహారం దొరకడం కష్టంగా మారింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా దొంగతనం చేయాల్సి వస్తోంది’ అని నక్క చెప్పింది.

‘నీ మాటలు నిజమని, నేను ఎలా నమ్మాలి’ అంది పులి. ‘తమరు ఒకసారి నేను నివాసం ఉండే ప్రదేశానికి రండి. అక్కడి పరిస్థితులు చూసి నేను చెప్పే మాటలు అబద్ధం అయితే అక్కడే నా ప్రాణాలు తీయండి’ అంది నక్క.

పులి, నక్క ఉండే ప్రదేశానికి వెళ్లడానికి నిర్ణయించుకుంది. నక్క తనతో పాటు తాను ఉండే ప్రదేశానికి పులిని తీసుకెళ్లింది. అక్కడ నిజంగానే కదలలేని పరిస్థితుల్లో ఉన్న రెండు ముసలి నక్కలు కనిపించాయి. పులి నక్కను క్షమించి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

కొన్ని రోజులు గడిచాయి. పులి గుహలో విశ్రాంతి తీసుకుంటోంది. బయట జోరుగా వర్షం కురుస్తోంది. ఇప్పట్లో తగ్గేలా లేదు. పులికేమో బాగా ఆకలిగా ఉంది. బయట వేటాడటం అసాధ్యం. పులికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఆ కదలలేని ముసలి నక్కల్ని చంపి తినాలనుకుంది. వెంటనే నక్కలు ఉండే ప్రాంతానికి వెళ్లింది. కానీ పులికి నిరాశ ఎదురైంది. అక్కడ నక్కలు లేవు. ‘అరే.. ఎక్కడికి పోయాయి ఈ నక్కలు?’ అనుకుంటూ.. అటూఇటూ తిరగడం మొదలుపెట్టింది.

అక్కడే ఓ చెట్టుపై ఉన్న రామచిలుక... పులిని గమనించి ‘ఓ పులీ.. నక్క నీకన్నా తెలివైంది. ఎప్పుడైతే తన స్థావరాన్ని నీకు చూపించిందో.. అప్పుడే ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించింది. అందుకే ఆ మరుసటి రోజే తన నివాసాన్ని వేరే రహస్య ప్రాంతానికి మార్చుకుంది’ అని చెప్పింది. నక్క తెలివికి పులి ఆశ్చర్యపోయింది. తర్వాత ఒక నిట్టూర్పు విడిచి.. కాలే కడుపుతో నిరాశగా తిరిగి తన గుహ వైపు నడక సాగించింది.

- వడ్డేపల్లి వెంకటేష్‌


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని